యువతిని నిర్బంధించి అత్యాచారం
నిందితుడి అరెస్టు
మెహిదీపట్నం: యువతిని ఇంట్లో నిర్బంధించి నాలుగు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గుణ్ని పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన హుమాయున్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్ వివరాల ప్రకారం.. సయ్యద్ ఇమాద్ హుస్సేన్ టోలీచౌకి అల్‌హస్నాత్ కాలనీలో అద్దెకుంటూ మాదాపూర్‌లోని డెల్ కంపెనీలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతితో పరిచయమేర్పడి అదికాస్త ప్రేమగా మారింది. కొద్ది కాలం తర్వాత ఆమె ఇక్కడ ఉద్యోగం మానేసి దుబాయ్ వెళ్లి ఉద్యోగం చేస్తోంది. అయితే ‘నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఇండియాకు తిరిగి రావాల’ని గత కొంతకాలంగా సయ్యద్ ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు.
ఆమె పెళ్లికి నిరాకరించడంతో తామిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానని బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన ఆమె దుబాయ్ నుంచి తిరిగి వచ్చి నాలుగు రోజులుగా సయ్యద్‌తో ఉంటోంది. పెళ్లికి యువతి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన సయ్యద్ ఆమెను నిర్భందించి అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి మెసేజ్ ద్వారా తన స్నేహితులకు సమాచారమివ్వడంతో వారు షీటీంకు ఫిర్యాదు చేశారు. షీటీం సోమవారం రాత్రి సయ్యద్ ఇంటిపై దాడిచేసి అతణ్ని అదుపులోకి తీసుకొని హుమాయూన్‌నగర్ పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సయ్యద్‌ను మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.