Imam Hussain
-
ఇమామ్ త్యాగం.. స్మరణీయం స్ఫూర్తిదాయకం
సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు వారుతున్నప్పుడు సమాజ శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్య ప్రియులు, న్యాయ ప్రేమికులు, పౌరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయంకోసం, ధర్మం కోసం, మానవీయ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పరిధిలో శక్తివంచన లేకుండా పోరాడాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడల్లా దాన్ని కాపాడుకోడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. విలువల ప్రేమికులందరూ ఒక్కటిగా ముందుకు కదలాలి. దానికి ఇమామ్ త్యాగం స్ఫూర్తిగా నిలవాలి. ఇస్లామీ క్యాలండరు ప్రకారం ‘ముహర్రం’ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన మాసం. ఇది ముస్లిమ్ జగత్తుకు నూతన సంవత్సరం. ముహర్రం మాసంతోనే ఇస్లామీయ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇస్లామ్‌కు పూర్వం అప్పటి సమాజంలో కూడా కొత్తసంవత్సరం ‘ముహర్రం’ నుండే ప్రారంభమయ్యేది. ముహమ్మద్ ప్రవక్త(స) ముహర్రం మాసాన్ని అల్లాహ్ నెల అని అభివర్ణించారు. రమజాన్ రోజాల (ఉపవాసాలు) తరువాత అత్యంత శుభప్రదమైన రోజా ఆషూరా రోజానే. అంటే ముహర్రం పదవ తేదీన పాటించే రోజా అన్నమాట. రమజాన్ రోజాలు విధిగా నిర్ణయించక ముందు ఆషూరా రోజాయే ఫర్జ్ రోజాగా ఉండేది. కాని రమజాన్ రోజాలు విధిగా నిర్ణయించబడిన తరువాత ఆషూరా రోజా నఫిల్‌గా మారిపోయింది. కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ప్రాముఖ్యత మరింతగా పెరిగిపోయింది. అంత మాత్రాన ముహర్రం మాసమంతా విషాద దినాలుగా పరిగణించడం, ఎలాంటి శుభకార్యాలూ నిర్వహించక పోవడం సరికాదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరగతి పొందారు. ధర్మయుద్ధంలో అమరుడు కావడం మానవ సహజ భావోద్రేకాలపరంగా బాధాకరం కావచ్చునేమోగాని, లౌకికంగా సత్కర్మల ఆచరణ అనివార్యంగా జరగాల్సిన నేపథ్యం లో పూర్తిగా విషాదానికి పరిమితం కావడమూ అంత సరికాకపోవచ్చు. ముహమ్మద్ ప్రవక్త(స) నిర్యాణం తరువాత తొలి నలుగురు ఖలీఫాల సార«థ్యంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ జనరంజకమైన ప్రజాస్వామ్య పాలన పరిఢవిల్లింది. ఇస్లామీయ ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి సూత్రం,‘దేశం దైవానిది, దేశవాసులు ఆయన పాలితులు’. అంతేకాని పాలకులు ప్రజలకు ప్రభువులు ఎంతమాత్రంకాదు. ఇస్లామీయ రాజ్యానికి దైవభీతి, సచ్ఛీలత, జవాబుదారీతనం ప్రాణం లాంటివి. పాలకులు ఈ సుగుణాలకు ప్రతిరూపంగా, ఆదర్శంగా ఉండేవారు. అధికారులు, న్యాయమూర్తులు, సేనాపతులు, అన్నిశాఖల అధికారులు ఎంతో నిజాయితీపరులుగా, న్యాయ ప్రేమికులుగా ఉండేవారు. అనుక్షణం దైవానికి భయపడుతూ, ప్రజాసేవలో ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తపడేవారు. ప్రజలకు సమాధానం చెప్పుకునే విషయంలో కూడా వారు, ‘ఎప్పుడైనా, ఎక్కడైనా తాము ప్రజలకు జవాబుదారులమని భావించేవారు. ప్రతిరోజూ నమాజుల సమయంలో ప్రజల్ని కలుసుకొని, వారి అవసరాలు తీర్చేవారు. అవసరమైన సూచనలు, హితవులు చేసేవారు. కాని ఖలీఫాల తదనంతర కాలంలో పరిస్థితులు మారిపోయాయి. దైవభీతి, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య భావనలకు భంగం ఏర్పడింది. యజీద్ రాచరికం రూపంలో పురుడు పోసుకున్న దుష్పరిణామాలు ఇస్లామీయ ప్రజాస్వామ్య భావనను, ఆ సూత్రాలను తుంగలో తొక్కాయి. ఈ విధంగా కుటుంబ పాలన, చక్రవర్తుల పరంపర ప్రారంభమైంది. ఈ దురదృష్టకర పరిణామాల కారణంగా ముస్లిం సమాజం నేటి వరకూ ఇస్లామీయ ప్రజాస్వామ్య స్ఫూర్తికి దూరంగానే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణకు హజ్రత్ ఇమామె హుసైన్ (ర) కంకణబద్ధులయ్యారు. లక్ష్యసాధన కోసం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోడానికి సిధ్ధపడ్డారు. విలువల పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడలేదు. ప్రజాకంటకమైన రాచరిక వ్యవస్థను ఎదుర్కొన్న క్రమంలో సంభవించిన పరిణామ ఫలితాలు ఈనాడు మనముందున్నాయి. ఇమామె హుసైన్ ఇంతటి ప్రమాదాన్ని కూడా లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడి, ఇస్లామీయ ప్రజాస్వామ్య సంక్షేమరాజ్యాన్ని, దాని ప్రత్యేకతల్ని కాపాడుకోడానికి ’కర్బలా’ సాక్షిగా ఒక విశ్వాసి పోషించవలసిన పాత్రను ఆచరణాత్మకంగా నిరూపించారు. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందుకే ప్రతియేటా ‘మొహర్రం’ పదవ తేదీన (యౌమె ఆషూరా) ఆయన త్యాగాన్ని స్మరించుకుంటారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరత్వం ఆషామాషీ మరణం కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మసంస్థాపన, దైవప్రసన్నతే ధ్యేయంగా సాగిన సమరంలో పొందిన వీరమరణం. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం, ఏ ధ్యేయం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి అమరుడయ్యారో మనం దాన్నుండి స్ఫూర్తిని పొందాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
‘వసుధైక కుటుంబా’నికి ప్రచారకర్తలు!
ఇండోర్: రాబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రధాని మోదీ ముస్లింలకు చేరవయ్యే ప్రయత్నం చేశారు. మహ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుసేన్ స్మారకార్థం ఇండోర్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో బోహ్రా ముస్లింలపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. సహజీవనం, సామరస్య సందేశాలను బోహ్రాలు విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. వారు నిజాయితీ, విలువలతో వ్యాపార కార్యకలాపాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వ పథకాలను ఈసందర్భంగా మోదీ ప్రస్తావించారు. బోహ్రా ఆధ్యాత్మిక గురువు సయ్యద్నా ముఫద్దాల్ సైఫుద్దీన్‌తో మోదీ వేదిక పంచుకున్నారు. శాంతి, న్యాయం కోసం ఇమామ్ హుసేన్ తన ప్రాణాలను త్యాగం చేశారని మోదీ కొనియాడారు. ఆయన బోధనలు ఆనాటి కన్నా నేటి సమాజానికే ఎక్కువ అవసరమని పేర్కొన్నారు. ‘వసుధైక కుటుంబం’ అనే భావన భారత్ బలమని.. బోహ్రాలు కూడా ఈ విషయాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నారని ప్రశంసించారు. ‘మనకు గతం గర్వకారణం. వర్తమానం విశ్వాసం. భవిష్యత్ భరోసా’ అని వ్యాఖ్యానించారు. ‘ఆశరా ముబారక్’ పేరిట ఏటా నిర్వహిస్తున్న కార్యక్రమానికి దేశ ప్రధాని హాజరవడం ఇదే తొలిసారి. ‘వ్యాపారాలను నిజాయితీతో నిర్వర్తిస్తూ బోహ్రాలు ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. జీఎస్టీ సద్వినియోగం జీఎస్టీ, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకున్నారు. చేతికున్న ఐదు వేళ్లు సమానంగా ఉండవు. అందుకే కొందరు వ్యాపారాన్ని మోసపూరితమైనదని భావిస్తున్నారు. వ్యాపారాలు చట్టాలకు లోబడి జరగాలని నాలుగేళ్లుగా చెబుతున్నాం. జీఎస్టీ, దివాలా చట్టాలతో నిజాయతీ కలిగిన వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తున్నాం’ అని మోదీ అన్నారు. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం విజయవంతం కావడంలో దావూదీ బోహ్రాల పాత్ర ఉందని పేర్కొన్నారు. బోహ్రా మత గురువు దివంగత సయ్యద్ మహ్మద్ బుర్హానుద్దీన్‌కు మహాత్మా గాంధీతో ఉన్న సన్నిహిత సంబంధాలను మోదీ గుర్తుచేశారు. రెండంకెల వృద్ధిరేటును అందుకోవడమే తదుపరి లక్ష్యమని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆ గమ్యం చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఐసీయూలో కాంగ్రెస్ ప్రతిపక్ష కాంగ్రెస్ ఐసీయూలో ఉందని మోదీ ఎద్దేవా చేశారు. మనుగడ కోసం ఇతర విపక్షాలపై అతిగా ఆధారపడుతోందని హేళన చేశారు. అందుకే 2019 ఎన్నికల కోసం ఎలాగైనా మహాకూటమి ఏర్పాటుచేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు. నమోయాప్ ద్వారా మోదీ గురువారం బీజేపీ కార్యకర్తలతో ముచ్చటించారు. గాలి బీజేపీ వైపే వీస్తోందని, ఆ బలానికి కొట్టుకుపోకుండా విపక్షాలు ఒకరి చేతులను మరొకరు గట్టిగా పట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ‘మేరా బూత్ సబ్సే మజ్బూత్’(నా పోలింగ్ బూత్ అత్యంత బలమైనది) మంత్రాన్ని పాటించాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీకి కార్యకర్తలే అతిపెద్ద బలమని, వారి శ్రమ, కష్టం వల్లే నాలుగేళ్లుగా పార్టీ ఎన్నో చారిత్రక విజయాలు సాధించిందని కొనియాడారు. -
అమర వీరులకు ముస్లింల రుధిర నివాళి
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : మొహర్రం సందర్భంగా మహ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్, ఆయన 72 మంది అనుచరులు దర్మ యుద్ధంచేసి ప్రాణత్యాగం చేసిన వైనాన్ని స్మరిస్తూ ముస్లింలు బందరు కోనేరుసెంటరులో శుక్రవారం రక్తం చిందించారు. యా హుస్సేన్... యా ఆలీ అంటూ నినాదాలు చేశారు. వేళ్ల మధ్య బ్లేడ్లు పెట్టుకుని చెస్ట్బీట్ నిర్వహించారు. బందరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచీ ముస్లింలు తరలివచ్చారు. తొలుత గిరియోహజరత్‌హజ్జత్ (చిన్నపార్టీ) సభ్యులు చింతచెట్టు సెంటరులోని సాహెబ్ పంజా నుంచి రాజుపేట మీదుగా కోనేరుసెంటరు వరకు జుల్జనా (ర్యాలీ) నిర్వహించారు. కోనేరుసెంటరులో అబేద్ మౌలానా ఆధ్వర్యంలో నమాజ్ చేశారు. చిన్నపార్టీ కోనేరుసెంటరును వీడిన అనంతరం ఇనగుదురుపేటలోని బారేమాం పంజా నుంచి గిరియోహజరత్‌హజ్జత్ (పెద్దపార్టీ) సభ్యులు జవ్వారుపేట, బుట్టాయిపేట, వల్లూరిరాజా సెంటరు మీదుగా కోనేరుసెంటరుకు వచ్చి జుల్జనా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన మతభోధకులు కర్బలా మైదానంలో ఇమామ్ హుస్సేన్, ఆయన 72 మంది అనుచరులు ధర్మయుద్ధం చేసిన తీరును వివరించారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చెస్ట్‌బీటింగ్ జరిగింది. చిన్నారులకు సైతం నొసటిపై కత్తిగాటుపెట్టి రక్త తర్పణం చేయించారు. పవిత్ర యుద్ధంలో మరణించిన ఇమాం హుస్సేన్ మృతదేహం తీసుకువచ్చేందుకు ఆయన కుమార్తె బీసకీనా శవపేటికను అలంకరించి తీసుకువెళ్లడాన్ని గుర్తు చేస్తూ యువతులు, చిన్నారులు శవపేటికను తయారు చేసి ఊరేగింపుగా కోనేరు సెంటరు వరకు మోసుకువచ్చారు. ఇమాం హుస్సేన్ మరణానంతరం అలనాటి యుద్ధ వాతావరణంను గుర్తుకు తెస్తూ గుర్రాలపై వస్త్రాలను, కత్తులను ప్రత్యేకంగా అలంకరించి (జుల్జనా)ఊరేగింపు నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి పీర్లను ఊరేగింపుగా కోనేరుసెంటరుకు తీసుకువచ్చి మళ్లీ వాటిని ర్యాలీగా తీసుకువెళ్లి పంజాల వద్ద ప్రతిష్టించారు. చెస్ట్‌బీటింగ్ కార్యక్రమం నేపథ్యంలో కోనేరుసెంటరులో ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేశారు. వైఎస్సార్ సీపీ బందరు నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రమయ్య (నాని), పట్టణ కన్వీనరు షేక్‌సలార్‌దాదా, ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మాదివాడ రాము, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కొల్లు రవీంద్ర, పట్టణ అధ్యక్షుడు మోటమర్రి వెంకటబాబాప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పీర్లకు దట్టీ సమర్పించారు. అప్సర బాదంపాలు వారి ఆధ్వర్యంలో భోజనం, పాతిమా డ్రస్సెస్ ఆధ్వర్యంలో మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ కె.వి.శ్రీనివాసరావు, సీఐలు అప్పలస్వామి, కె వెంకటేశ్వరరావు, పట్టణ సీఐ మూర్తి, ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది శాంతిభద్రతలను పర్యవేక్షించారు. -
ఇరాక్‌లో మొహర్రం నాడు మారణహోమం
కర్బాలా: ఇరాక్‌లో మొహర్రం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో గురువారం మారణహోమం చెలరేగింది. దేశవ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ సున్నీ మిలిటెంట్లు రెచ్చిపోయారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవిత్ర కర్బాలా ప్రాంతానికి చేరుకున్న లక్షల మంది షియాలే లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లో ఆత్మాహుతి బాంబు దాడులు జరిపారు. ఆయా ఘటనల్లో మొత్తం 43 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 లక్షల మందికిపైగా షియాలు అషుర వేడుకల తుది ఘట్టంలో పాల్గొనేందుకు గురువారం కర్బాలాలోని పవిత్ర ఇమామ్ హుస్సేన్ సమాధి వద్దకు వచ్చారు.