సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు వారుతున్నప్పుడు సమాజ శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్య ప్రియులు, న్యాయ ప్రేమికులు, పౌరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయంకోసం, ధర్మం కోసం, మానవీయ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పరిధిలో శక్తివంచన లేకుండా పోరాడాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడల్లా దాన్ని కాపాడుకోడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. విలువల ప్రేమికులందరూ ఒక్కటిగా ముందుకు కదలాలి. దానికి ఇమామ్ త్యాగం స్ఫూర్తిగా నిలవాలి.
ఇస్లామీ క్యాలండరు ప్రకారం ‘ముహర్రం’ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన మాసం. ఇది ముస్లిమ్ జగత్తుకు నూతన సంవత్సరం. ముహర్రం మాసంతోనే ఇస్లామీయ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇస్లామ్‌కు పూర్వం అప్పటి సమాజంలో కూడా కొత్తసంవత్సరం ‘ముహర్రం’ నుండే ప్రారంభమయ్యేది. ముహమ్మద్ ప్రవక్త(స) ముహర్రం మాసాన్ని అల్లాహ్ నెల అని అభివర్ణించారు. రమజాన్ రోజాల (ఉపవాసాలు) తరువాత అత్యంత శుభప్రదమైన రోజా ఆషూరా రోజానే. అంటే ముహర్రం పదవ తేదీన పాటించే రోజా అన్నమాట. రమజాన్ రోజాలు విధిగా నిర్ణయించక ముందు ఆషూరా రోజాయే ఫర్జ్ రోజాగా ఉండేది. కాని రమజాన్ రోజాలు విధిగా నిర్ణయించబడిన తరువాత ఆషూరా రోజా నఫిల్‌గా మారిపోయింది.
కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ప్రాముఖ్యత మరింతగా పెరిగిపోయింది. అంత మాత్రాన ముహర్రం మాసమంతా విషాద దినాలుగా పరిగణించడం, ఎలాంటి శుభకార్యాలూ నిర్వహించక పోవడం సరికాదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరగతి పొందారు. ధర్మయుద్ధంలో అమరుడు కావడం మానవ సహజ భావోద్రేకాలపరంగా బాధాకరం కావచ్చునేమోగాని, లౌకికంగా సత్కర్మల ఆచరణ అనివార్యంగా జరగాల్సిన నేపథ్యం లో పూర్తిగా విషాదానికి పరిమితం కావడమూ అంత సరికాకపోవచ్చు.
ముహమ్మద్ ప్రవక్త(స) నిర్యాణం తరువాత తొలి నలుగురు ఖలీఫాల సార«థ్యంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ జనరంజకమైన ప్రజాస్వామ్య పాలన పరిఢవిల్లింది. ఇస్లామీయ ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి సూత్రం,‘దేశం దైవానిది, దేశవాసులు ఆయన పాలితులు’. అంతేకాని పాలకులు ప్రజలకు ప్రభువులు ఎంతమాత్రంకాదు. ఇస్లామీయ రాజ్యానికి దైవభీతి, సచ్ఛీలత, జవాబుదారీతనం ప్రాణం లాంటివి. పాలకులు ఈ సుగుణాలకు ప్రతిరూపంగా, ఆదర్శంగా ఉండేవారు. అధికారులు, న్యాయమూర్తులు, సేనాపతులు, అన్నిశాఖల అధికారులు ఎంతో నిజాయితీపరులుగా, న్యాయ ప్రేమికులుగా ఉండేవారు.
అనుక్షణం దైవానికి భయపడుతూ, ప్రజాసేవలో ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తపడేవారు. ప్రజలకు సమాధానం చెప్పుకునే విషయంలో కూడా వారు, ‘ఎప్పుడైనా, ఎక్కడైనా తాము ప్రజలకు జవాబుదారులమని భావించేవారు. ప్రతిరోజూ నమాజుల సమయంలో ప్రజల్ని కలుసుకొని, వారి అవసరాలు తీర్చేవారు. అవసరమైన సూచనలు, హితవులు చేసేవారు. కాని ఖలీఫాల తదనంతర కాలంలో పరిస్థితులు మారిపోయాయి.
దైవభీతి, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య భావనలకు భంగం ఏర్పడింది. యజీద్ రాచరికం రూపంలో పురుడు పోసుకున్న దుష్పరిణామాలు ఇస్లామీయ ప్రజాస్వామ్య భావనను, ఆ సూత్రాలను తుంగలో తొక్కాయి. ఈ విధంగా కుటుంబ పాలన, చక్రవర్తుల పరంపర ప్రారంభమైంది. ఈ దురదృష్టకర పరిణామాల కారణంగా ముస్లిం సమాజం నేటి వరకూ ఇస్లామీయ ప్రజాస్వామ్య స్ఫూర్తికి దూరంగానే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణకు హజ్రత్ ఇమామె హుసైన్ (ర) కంకణబద్ధులయ్యారు. లక్ష్యసాధన కోసం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోడానికి సిధ్ధపడ్డారు. విలువల పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడలేదు.
ప్రజాకంటకమైన రాచరిక వ్యవస్థను ఎదుర్కొన్న క్రమంలో సంభవించిన పరిణామ ఫలితాలు ఈనాడు మనముందున్నాయి. ఇమామె హుసైన్ ఇంతటి ప్రమాదాన్ని కూడా లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడి, ఇస్లామీయ ప్రజాస్వామ్య సంక్షేమరాజ్యాన్ని, దాని ప్రత్యేకతల్ని కాపాడుకోడానికి ’కర్బలా’ సాక్షిగా ఒక విశ్వాసి పోషించవలసిన పాత్రను ఆచరణాత్మకంగా నిరూపించారు.
అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందుకే ప్రతియేటా ‘మొహర్రం’ పదవ తేదీన (యౌమె ఆషూరా) ఆయన త్యాగాన్ని స్మరించుకుంటారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరత్వం ఆషామాషీ మరణం కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మసంస్థాపన, దైవప్రసన్నతే ధ్యేయంగా సాగిన సమరంలో పొందిన వీరమరణం. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం, ఏ ధ్యేయం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి అమరుడయ్యారో మనం దాన్నుండి స్ఫూర్తిని పొందాలి.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment