MD Usman Khan
-
ఇమామ్ త్యాగం.. స్మరణీయం స్ఫూర్తిదాయకం
సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు వారుతున్నప్పుడు సమాజ శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్య ప్రియులు, న్యాయ ప్రేమికులు, పౌరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయంకోసం, ధర్మం కోసం, మానవీయ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పరిధిలో శక్తివంచన లేకుండా పోరాడాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడల్లా దాన్ని కాపాడుకోడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. విలువల ప్రేమికులందరూ ఒక్కటిగా ముందుకు కదలాలి. దానికి ఇమామ్ త్యాగం స్ఫూర్తిగా నిలవాలి. ఇస్లామీ క్యాలండరు ప్రకారం ‘ముహర్రం’ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన మాసం. ఇది ముస్లిమ్ జగత్తుకు నూతన సంవత్సరం. ముహర్రం మాసంతోనే ఇస్లామీయ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇస్లామ్‌కు పూర్వం అప్పటి సమాజంలో కూడా కొత్తసంవత్సరం ‘ముహర్రం’ నుండే ప్రారంభమయ్యేది. ముహమ్మద్ ప్రవక్త(స) ముహర్రం మాసాన్ని అల్లాహ్ నెల అని అభివర్ణించారు. రమజాన్ రోజాల (ఉపవాసాలు) తరువాత అత్యంత శుభప్రదమైన రోజా ఆషూరా రోజానే. అంటే ముహర్రం పదవ తేదీన పాటించే రోజా అన్నమాట. రమజాన్ రోజాలు విధిగా నిర్ణయించక ముందు ఆషూరా రోజాయే ఫర్జ్ రోజాగా ఉండేది. కాని రమజాన్ రోజాలు విధిగా నిర్ణయించబడిన తరువాత ఆషూరా రోజా నఫిల్‌గా మారిపోయింది. కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ప్రాముఖ్యత మరింతగా పెరిగిపోయింది. అంత మాత్రాన ముహర్రం మాసమంతా విషాద దినాలుగా పరిగణించడం, ఎలాంటి శుభకార్యాలూ నిర్వహించక పోవడం సరికాదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరగతి పొందారు. ధర్మయుద్ధంలో అమరుడు కావడం మానవ సహజ భావోద్రేకాలపరంగా బాధాకరం కావచ్చునేమోగాని, లౌకికంగా సత్కర్మల ఆచరణ అనివార్యంగా జరగాల్సిన నేపథ్యం లో పూర్తిగా విషాదానికి పరిమితం కావడమూ అంత సరికాకపోవచ్చు. ముహమ్మద్ ప్రవక్త(స) నిర్యాణం తరువాత తొలి నలుగురు ఖలీఫాల సార«థ్యంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ జనరంజకమైన ప్రజాస్వామ్య పాలన పరిఢవిల్లింది. ఇస్లామీయ ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి సూత్రం,‘దేశం దైవానిది, దేశవాసులు ఆయన పాలితులు’. అంతేకాని పాలకులు ప్రజలకు ప్రభువులు ఎంతమాత్రంకాదు. ఇస్లామీయ రాజ్యానికి దైవభీతి, సచ్ఛీలత, జవాబుదారీతనం ప్రాణం లాంటివి. పాలకులు ఈ సుగుణాలకు ప్రతిరూపంగా, ఆదర్శంగా ఉండేవారు. అధికారులు, న్యాయమూర్తులు, సేనాపతులు, అన్నిశాఖల అధికారులు ఎంతో నిజాయితీపరులుగా, న్యాయ ప్రేమికులుగా ఉండేవారు. అనుక్షణం దైవానికి భయపడుతూ, ప్రజాసేవలో ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తపడేవారు. ప్రజలకు సమాధానం చెప్పుకునే విషయంలో కూడా వారు, ‘ఎప్పుడైనా, ఎక్కడైనా తాము ప్రజలకు జవాబుదారులమని భావించేవారు. ప్రతిరోజూ నమాజుల సమయంలో ప్రజల్ని కలుసుకొని, వారి అవసరాలు తీర్చేవారు. అవసరమైన సూచనలు, హితవులు చేసేవారు. కాని ఖలీఫాల తదనంతర కాలంలో పరిస్థితులు మారిపోయాయి. దైవభీతి, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య భావనలకు భంగం ఏర్పడింది. యజీద్ రాచరికం రూపంలో పురుడు పోసుకున్న దుష్పరిణామాలు ఇస్లామీయ ప్రజాస్వామ్య భావనను, ఆ సూత్రాలను తుంగలో తొక్కాయి. ఈ విధంగా కుటుంబ పాలన, చక్రవర్తుల పరంపర ప్రారంభమైంది. ఈ దురదృష్టకర పరిణామాల కారణంగా ముస్లిం సమాజం నేటి వరకూ ఇస్లామీయ ప్రజాస్వామ్య స్ఫూర్తికి దూరంగానే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణకు హజ్రత్ ఇమామె హుసైన్ (ర) కంకణబద్ధులయ్యారు. లక్ష్యసాధన కోసం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోడానికి సిధ్ధపడ్డారు. విలువల పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికైనా వెనుకాడలేదు. ప్రజాకంటకమైన రాచరిక వ్యవస్థను ఎదుర్కొన్న క్రమంలో సంభవించిన పరిణామ ఫలితాలు ఈనాడు మనముందున్నాయి. ఇమామె హుసైన్ ఇంతటి ప్రమాదాన్ని కూడా లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడి, ఇస్లామీయ ప్రజాస్వామ్య సంక్షేమరాజ్యాన్ని, దాని ప్రత్యేకతల్ని కాపాడుకోడానికి ’కర్బలా’ సాక్షిగా ఒక విశ్వాసి పోషించవలసిన పాత్రను ఆచరణాత్మకంగా నిరూపించారు. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందుకే ప్రతియేటా ‘మొహర్రం’ పదవ తేదీన (యౌమె ఆషూరా) ఆయన త్యాగాన్ని స్మరించుకుంటారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరత్వం ఆషామాషీ మరణం కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మసంస్థాపన, దైవప్రసన్నతే ధ్యేయంగా సాగిన సమరంలో పొందిన వీరమరణం. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం, ఏ ధ్యేయం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి అమరుడయ్యారో మనం దాన్నుండి స్ఫూర్తిని పొందాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ప్రేమతత్వాన్ని ప్రోదిచేసే ఈద్
ముస్లిం సమాజం జరుపుకునే రెండు ముఖ్యమైన పండుగల్లో ఈదుల్ ఫిత్ర్ అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో ముస్లింలు ఎంతో నియమనిష్టలతో రోజా వ్రతం పాటిస్తారు. భక్తిశ్రధ్ధలతో రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. పవిత్ర ఖురాన్ గ్రంధాన్ని భక్తితో పారాయణం చేస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స) వారిపై సలాములు పంపుతూ ఉంటారు. ప్రతిరోజూ తరావీహ్ నమాజులో పాల్గొని తన్మయులవుతుం టారు. దానధర్మాలు చేస్తారు, ఫిత్రాలు చెల్లిస్తారు. ఈ విధంగా రమజాన్ చంద్రవంక దర్శనంతో ప్రారంభమైన ఉపవాస దీక్షలు నెలరోజుల తరువాత షవ్వాల్ మాసం నెలవంక దర్శనంతో సమాప్తమవుతాయి. షవ్వాల్ మొదటి తేదీన జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినాన్నే మనం రమజాన్ పండుగ అంటున్నాము. రమజాన్ ఉపవాసదీక్షలు, పవిత్ర ఖురాన్ అవతరణతో దీని సంబంధం పెనవేసుకుపోయిఉంది. మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాన్ని, మానవీయ విలువల్ని జనింపజేయడానికి సృష్టికర్త ఉపవాస వ్రతాన్ని విధిగా నిర్ణయించాడు. రమజాన్ ఉపవాసవ్రతం మనిషిని ఒక క్రమశిక్షణాయుత జీవనవిధానానికి, బాధ్యతాయుతమైన జీవనవిధానానికి, దైవభక్తి పరాయణతతో కూడుకున్న జీవన విధానానికి అలవాటుచేస్తుంది. మానవుల్లో మహోన్నత విలువలను, సుగుణాలను జనింపజేసే వ్రతాన్ని పరాత్పరుడైన అల్లాహ్ వారికి అనుగ్రహించినందుకు, వాటిని వారు నెలరోజులూ మనోవాక్కాయ కర్మల ద్వారా త్రికరణశుధ్ధిగా పాటించ గలిగినందుకు సంతోష సంబరాల్లో తేలిపోతూ కృతజ్ఞతా పూర్వకంగా భక్తిశ్రధ్ధలతో పండుగ జరుపుకుంటారు. ఈ విధంగా రమజాన్ నెల ఆరంభం నుండి అంతం వరకు ఒక క్రమ పద్ధతిలో ధర్మం చూపిన బాటలో నడుస్తూ, దైవప్రసన్నత, పుణ్యఫలాపేక్షతో గడిపినవారు ధన్యులు. అందుకే ‘ఈద్’ (పండుగ)ను శ్రామికుని వేతనం (ప్రతిఫలం) లభించే రోజు అంటారు. ఆ రోజు ముస్లిములందరూ ఈద్ నమాజ్ ముగించుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారుచేసిన సేమియా పాయసాన్ని తమ హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు సోదరులందరికీ ఆప్యాయంగా రుచిచూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు. ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుంటారు. ఈ విధంగా రమజాన్ పర్వదినం మనిషిని ఉన్నత మానవీయ విలువలు కలవాడుగా తీర్చిదిద్ది, సమాజంలో శాంతి, సమానత్వం, సామరస్యం, సోదర ‡భావాలకు పునాది వేస్తుంది. ప్రేమ తత్వాన్ని ప్రోది చేస్తుంది. ఇదీ ఈదుల్ ఫిత్ర్ – రమజాన్ పర్వదిన పరమార్థం. – యండి.ఉస్మాన్ ఖాన్ -
అచంచల ప్రేమ
రుజుమార్గం మానవుడు ఈ ప్రపంచంలో అనేక వాటిని ప్రేమిస్తాడు. కొన్నింటిని చాలా ప్రియమైనవిగా కూడా భావిస్తాడు. తల్లిదండ్రుల్ని, భార్యాబిడ్డల్ని, బంధుమిత్రుల్ని ప్రేమిస్తాడు. తనఇంటిని, ఊరును, దేశాన్ని, జీవనసామగ్రిని, పెంపుడు జంతువుల్ని, కొన్నివస్తువుల్ని, కొన్నిజ్ఞాపకాలను ప్రేమిస్తాడు. ఇది మానవ సహజం. ఆయా పరిధుల్లో ధర్మసమ్మతం. అయితే ఇవన్నీ దేవుని ప్రేమకు, ఆయన ప్రవక్తపై ప్రేమకు లోబడి ఉండాలి. దీన్నే ఈమాన్ (విశ్వాసం) అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఎప్పుడైనా ఈ రెండింటి మధ్య ఎదురుబొదురు వ్యవహారం సంభవిస్తే దేవుడు, ప్రవక్త ప్రేమ మాత్రమే ఆధిక్యం పొందాలి. ఒకవ్యక్తి దేవుని ప్రేమలో నిమగ్నమైనప్పుడు, దైవ స్మరణ, చింతనలో లీనమైనప్పుడు, ఆరాధనలో, సేవలో రేయింబవళ్ళు గడిపినప్పుడు, కృతజ్ఞతా భావంతో అతని ఆత్మ తన్మయత్వం చెందుతున్నప్పుడు, దైవ మార్గంలో కష్టాలు కడగండ్లు భరిస్తున్నప్పుడు దేవుని కరుణా కటాక్షవీక్షణాలు అతనిపై ప్రసరి స్తాయి. దైవం అతణ్ణి తన ప్రత్యేక అనుగ్రహానికి పాత్రుణ్ణి చేస్తాడు. ఈవిధంగా ఒక బలహీనుడైన మనిషి తనచిరు ప్రయత్నంతో దేవుని ప్రేమను పొందగలుగుతాడు. ఆయన కారుణ్యం అతనిపై కుండపోతగా వర్షిస్తుంది. అంటే సర్వకాల సర్వావస్థల్లో దైవ ప్రేమ, దైవ ప్రవక్త ప్రేమ ఉఛ్చ్వాస నిశ్వాసలుగా ఉండాలి. ప్రవక్త ఇలా చెప్పారు ‘ఎవరైతే అల్లాహ్ కొరకే ప్రేమిస్తారో, అల్లాహ్ కొరకే ద్వేషిస్తారో, ఇచ్చినా ఆయన కోసమే, ఇవ్వకున్నా, నిరాకరించినా ఆయన కోసమే చేస్తారో అలాంటి వారు తమ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకున్నవారవుతారు’. ఎవరిపట్లనైనా ప్రేమానురాగాలు కలిగిఉన్నామంటే, లేక ఎవరితోనైనా విభేదిస్తున్నామంటే దైవ సంతోషమే దానికి పునాది కావాలి. ఎవరికైనా ఏదైనా ఇచ్చినా అది కూడా దైవంకోసమే కావాలి. ఒక నిరుపేదకు ఫలానా సాయం చేయడం వల్ల దేవుడు నన్ను ప్రేమిస్తాడు అన్నభావనే పునాదిగా ఉండాలి. ఎంతగొప్ప పని చేసినా, ఎంతమంచి పని చేసినా దైవ ప్రసన్నత కోసం మాత్రమే చేయాలి. దాని వెనుక మరే ప్రయోజనమూ ఉండకూడదు. నలుగురూ చూడాలని, తనను పొగడాలని ప్రదర్శనా బుధ్ధితో చేస్తే అది ఎంత గొప్ప సత్కార్యమైనా బూడిదలో పోసిన పన్నీరే. అందుకే నీ కుడిచేయి చేసిన దానం నీ ఎడమ చేతికి తెలియకూడదన్నారు మహమ్మద్ ప్రవక్త(స). ప్రదర్శనా బుధ్ధి మనిషిని ఇహలోకంలోనూ, పరలోకంలోనూ పరాభవం పాలు చేస్తుంది. ప్రతిఫల దినాన దైవం, నువ్వు పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడావు గనుక అవి నీకు ఇహలోకంలోనే ప్రసాదించాము. ఇక్కడ నీకెలాంటి వాటా లేదు అంటాడు. దైవం పట్ల, దైవ ప్రవక్త పట్ల అచంచలమైన ప్రేమ ఉన్నట్లయితే మానవుడి మనసు విశ్వాసం, విధేయత, భయభక్తులకు నిలయమవుతుంది. అదే అతడి ఇహపర సాఫల్యాలకు జామీనుగా నిలుస్తుంది. – యండి.ఉస్మాన్ ఖాన్ -
మోక్ష మార్గం
దైవం తరువాత మానవుడికి అత్యంత ఆదరణీ యులు, గౌరవనీయులు తల్లిదండ్రులే. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, సేవాభావం లేని మానవ జన్మ నిరర్థకం. కాని దురదృష్టవశాత్తు ఈనాడు తల్లిదండ్రుల్ని సంతా నం పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు తరచుగా వినబడుతున్నాయి. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లి, రక్తాన్ని చెమటను ఏకం చేసి అహర్నిశలూ శ్రమ పడి, ప్రతి అవసరాన్ని తీర్చి ప్రయోజకుడిగా చేసిన నాన్న ఈనాడు సంతానానికి భారమైపోతున్నారు. కొంతమంది దౌర్భాగ్యులు కన్నవారిని వృద్ధాప్యంలో ఆశ్రమాల్లో చేర్చడం, వంతులేసుకొని తల్లినొక దగ్గర, తండ్రినొక దగ్గర ఉంచడం, ‘తలా ఒక నెల’ అని పంచుకోవడం లాంటి దురదృష్టకర చేష్టలకు పాల్పడడం మనం చూస్తున్నాం. వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన సమయంలో వంతుల పేర ఆ వృద్ధ దంపతుల్ని భౌతికంగా విడదీసి, వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్న సంతానాన్నీ మనం చూస్తున్నాం. బాగా చదువుకున్నవాళ్లు, ఉన్నత హోదాలు వెలగబెడుతున్నవాళ్లు, హితబోధలు వల్లె వేసేవాళ్లు కూడా వృద్ధ తల్లిదండ్రుల మానసిక స్థితిని పట్టించుకోకుండా, నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా ప్రవర్తిస్తున్నారంటే అలాంటి వారిని ఏమనాలి? కొంత మంది, తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు వారిని పట్టించు కోరు. ప్రేమగా చూడరు, పట్టెడన్నం పెట్టరు. వారి ఆరోగ్యం పట్టించుకోరు. కాని చనిపోయిన తరువాత వేలు, లక్షలు ఖర్చుచేసి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఖరీదైన సమాధులు కట్టిస్తారు. వాటిపై పరిచే పూలకే వేల రూపాయలు వెచ్చిస్తారు. దీనివల్ల ప్రయో జనం? వారి జీవితకాలంలో ఆప్యాయంగా ప్రేమగా చూసుకోకుండా తదనంతరం ఎన్ని చేసినా వ్యర్థమే. అందుకే మమతల మూర్తి ముహమ్మద్ (స) ‘తల్లి పాదాల చెంత స్వర్గమున్నదని, తండ్రి స్వర్గానికి సింహ ద్వారమని, వారిసేవ చేసి వారి ప్రేమను, వారి ఆశీర్వా దాలను పొంది, వారిని ప్రసన్నం చేసుకోకపోతే స్వర్గప్రవేశం అసాధ్యమని’ ఉపదేశించారు. కాబట్టి బాల్యంలో వారు మనల్ని ఎంత కరుణతో, వాత్స ల్యంతో పెంచి పోషించారో, వారి వృద్ధాప్యంలో మనం వారిని అంతకంటే ఎక్కువ ప్రేమానురాగాలతో సేవలు చేయాలి. వారి బాగోగుల్ని, వారి ఆరోగ్యాన్ని, వారి మానసిక స్థితిగతుల్ని పట్టించుకోవాలి. వారిని ఎప్పుడూ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించాలి. వారు నొచ్చుకునే విధంగా, వారి మనసుకు కష్టం కలిగే విధంగా ఎట్టి పరిస్థితిలోనూ ప్రవర్తించకూడదు. దైవం మనందరికీ తల్లిదండ్రుల సేవ చేసి, వారి ప్రేమ ఆశీర్వాదాలు పొంది తన కృపకు పాత్రులయ్యే భాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం. – యండి. ఉస్మాన్ ఖాన్ -
ఇస్లాంలో యేసు
మానవజాతికి సన్మార్గం చూపడానికి దైవం అనేకమంది దైవప్రవక్తల్ని ప్రభవింపజేశారు. ఎన్నో దైవగ్రంథాలను అవతరింపజేశారు. ఉదాహరణకు పవిత్ర ఖురాన్ గ్రంథంలోని కొంతమంది ప్రవక్తల పేర్లు గమనించండి. 1. ఆదం అలైహిస్సలాం (ఆదాము) 2. ఇబ్ర హీం (అ) అబ్రాహాము 3. ఇస్మాయీల్ (ఇస్మాయేలు) 4. ఇస్హాఖ్ (ఇస్సాకు) 5. నూహ్ (నోవా) 6. ఇద్రీస్ (హానోక్) 7. లూత్ (లోతు) 8. యాఖూబ్ (యాకోబు) 9. యూసుఫ్ (యోసేపు) 10. అయ్యూబ్ (యోబు) 11. యూనుస్ (యోనా) 12. ఇలియాస్ (ఏలియా) 13. దావూద్ (దావీదు) 14. జక్రియా (జకర్యా) 15. అల్ ఎసా (ఎలీషా) 16. మూసా (మోషె) 17. ఈసా (ఏసు) 18. ముహమ్మద్ (స) వీరందరిపై దేవుని శాంతి, కారుణ్యం వర్షించుగాక: అలాగే తౌరాత్, జబూర్, ఇన్సీల్ (బైబిల్) ఖురాన్... దైవగ్రంథాలు... మరెన్నో సహీఫాలు. సృష్టికర్త ఈ విధంగా దైవప్రవక్తల్ని, గ్రంథాలను అవతరింపజేసిన అసలు ఉద్దేశ్యం... మానవాళికి సన్మార్గ పథాన్ని అవగతం చేయడం, స్వర్గమార్గాన్ని సుస్పష్టంగా తెలియజేయడం. సత్యాసత్యాలను, ధర్మాధర్మాలను, మంచీ చెడులను విడమరచి వారిని శాశ్వత సాఫల్యానికి అర్హులుగా చేయడం. నిజానికి ప్రారంభంలో మానవులంతా ఒకే ధర్మాన్ని అనుసరిస్తూ, ఒకే మార్గాన నడుస్తూ ఉండేవారు. ఆ తరువాత వారిలో వారికి విభేదాలు వచ్చాయి. అప్పుడు దైవం వారి వద్దకు శుభవార్తలు తెలియజేసే (సన్మార్గ దర్శకులను) పంపుతూ వచ్చాడు. ‘సత్యం’ గురించి ప్రజల్లో వచ్చిన విభేదాలను పరిష్కరించడానికి ఆయన ప్రవక్తలపై సత్యపూరిత గ్రంథాలను కూడా అవతరింపజేశాడు (2-212). ఇందులో భాగంగానే ఈసా ప్రవక్తను కూడా ఆయన పంపాడు. ఆయనపై ఇన్జీల్ (బైబిల్ ) గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈసా (అ) గొప్ప దైవప్రవక్త. ఆయన పవిత్ర జననం గురించి పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది. ‘‘అప్పుడు దైవదూతలు మర్యంతో... (ఈసా ప్రవక్త మాతృమూర్తి) మర్యం! దైవం నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను పరిశుద్ధపరిచాడు. యావత్ ప్రపంచ మహిళల్లో నీకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, తన సేవకోసం నియమించుకున్నాడు. కనుక మర్యం! నువ్వు ఇక నీ ప్రభువుకు విధేయురాలివై ఉండు. ఆయన దివ్య సన్నిధిలో సాష్టాంగపడుతూ ఉండు. మోకరిల్లే వారితో నువ్వు కూడా వినమ్రంగా తలవంచి ప్రార్థన చెయ్యి.’ ‘మర్యం! దేవుడు నీకు తన వైపు నుండి ఒక వాణికి సంబంధించిన శుభవార్త అందజేస్తున్నాడు. అతని పేరు మర్యం కుమారుడైన ఈసా మసీహా. అతను ఇహలోకంలోనూ, పరలోకంలోనూ గౌరవనీయుడవుతాడు. దైవసాన్నిధ్యం పొందిన వారిలో ఒకడవుతాడు. అంతేకాదు, తల్లి ఒడిలో ఉన్నప్పుడూ, తరువాత పెరిగి పెద్దవాడైనప్పుడూ, అతను ప్రజలతో మాట్లాడతాడు. ఒక సత్పురుషుడిగా వర్థిల్లుతాడు.’ మర్యం ఈ మాటలు విని కంగారు పడుతూ ‘ప్రభూ! నాకు పిల్లాడు ఎలా కలుగుతాడు? నన్ను ఏ పురుషుడూ తాకనైనా తాకలేదే!’ అన్నది. ‘ఇది అలాగే జరిగి తీరుతుంది. దైవం తాను తలచిన దాన్ని చేయగలడు. ఆయన ఒక పని చేయాలనుకున్నప్పుడు ‘అయిపో’ అంటే చాలు. అది వెంటనే అయిపో తుంది. దైవం అతనికి (మర్యం కుమారు డైన యేసుకు) గ్రంథజ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాత్, ఇన్జీల్ గ్రంథాల జ్ఞానాన్ని కూడా నేర్పుతాడు’’ అన్నారు దైవదూతలు. (పవిత్ర ఖురాన్ - 3 - 42, 48) తరువాత దైవం అతన్ని (యేసును) తన ప్రవక్తగా నియమించి ఇస్రాయీల్ సంతతి ప్రజల వద్దకు పంపిస్తాడు. అతను దైవసందేశ హరునిగా వారి వద్దకు వెళ్లి ఇలా అంటాడు...‘‘నేను మీ ప్రభువు వద్దనుండి మీకోసం కొన్ని సూచనలు తెచ్చాను. ఇప్పుడు మీ ముందు మట్టితో పక్షి ఆకారం గల బొమ్మను చేసి అందులో (గాలి) ఊదుతాను. అది దైవాజ్ఞతో సజీవ పక్షిగా మారిపోతుంది. నేను దేవుని ఆజ్ఞతో పుట్టుగుడ్డికి చూపును ప్రసాదిస్తాను. కుష్టురోగికి స్వస్థతనిస్తాను. మృతుల్ని కూడా బతికిస్తాను. మీరు ఏమేమి తింటారో, మీ ఇళ్లలో ఏమేమి నిల్వ చేసి ఉంచుకుంటారో అంతా మీకు తెలియజేస్తాను. మీరు విశ్వసించేవారైతే, ఇందులో మీకు గొప్ప గొప్ప నిదర్శనాలున్నాయి (3-49). ఈ విధంగా దైవం ఈసా (అ) అంటే క్రీస్తు మహనీయులవారి ద్వారా అద్భుతాలు చేయించాడు. మహిమలు చూపించాడు. తద్వారానైనా ప్రజలు తనను శుద్ధంగా విశ్వసించి, సదాచరణలు ఆచరించి, సమాజ సంక్షేమానికి పాటుపడుతూ, సాఫల్యం పొందుతారని, ఎందుకంటే అసలు ఆరాధ్యుడు ఏకైక దైవం మాత్రమే. ఆయన తప్ప మరొక దైవం లేడు. ఆయన నిత్య సజీవుడు, ఎప్పటికీ నిద్రించనివాడు. కనీసం కునుకుపాట్లు కూడా పడనివాడు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అనుమతి లేకుండా ఆయన సన్నిధిలో ఎవరూ సిఫారసు చేయలేరు. వారి (కళ్ల) ముందున్నదేమిటో, వారికి కనపడకుండా గుప్తంగా ఉన్నదేమిటో అంతా ఆయనకు తెలుసు. ఆయన తలచుకుంటే తప్ప, ఆయనకున్న జ్ఞానసంపదలోని ఏ విషయమూ ఎవరికీ తెలియదు. ఆయన రాజ్యాధికారం భూమ్యాకాశాలను పరివేష్టించి ఉంది. వాటి రక్షణ ఆయనకు ఏ మాత్రం కష్టమైన పని కాదు. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు. మానవులారా! మీ ఆరాధ్యుడు ఒక్కడే. కరుణామయుడు, కృపాసాగరుడు అయిన ఆ దైవం తప్ప మీకు మరో దేవుడు లేనే లేడు. భూమ్యాకాశాల సృజనలో, రేయింబవళ్ల చక్రభ్రమణంలో, సముద్రాలలో పయనిస్తూ, మానవులకు ప్రయోజనం చేకూర్చే ఓడలలో, దేవుడు పైనుండి కురిపించే వర్షపు నీటిలో - తద్వారా ఆయన మృతి భూమికి ప్రాణ ం పోసే (చెట్లూ చేమల్ని పచ్చదనం చేసే పనిలో) పుడమిపై పలు విధాల జీవరాశుల్ని విస్తరింపజేసే ఆయన సృష్టి నైపుణ్యంలో వాయువుల సంచారంలో. నేలకు నింగికి మధ్య నియమబద్ధంగా సంచరించే మేఘమాలికల్లో బుద్ధిజీవులకు అసంఖ్యాక నిదర్శనాలున్నాయి. (2.163-164). ఈ విధంగా సృష్టికర్త అయిన దైవం మానవుల మార్గదర్శనం కోసం, వారి ఇహ పర సాఫల్యాల కోసం అనేక ఏర్పాట్లు చేశాడు. ఆ ఏర్పాట్లలో భాగమే ప్రవక్తల ప్రభవన. గ్రంథాల అవతరణ. దైవాదేశాల ప్రకారం, దైవప్రవక్తల, దైవగ్రంథాల మార్గదర్శకంలో, ఎలాంటి హెచ్చు తగ్గులకు, అతిశయాలకు తావు లేకుండా నడుచుకుంటే తప్పకుండా ఇహలోకంలోనూ, పరలోకంలోనూ సాఫల్యం పొందవచ్చు. అమర సుఖాల శాశ్వత స్వర్గసీమను సొంతం చేసుకోవచ్చు. - ఎండీ ఉస్మాన్‌ఖాన్ -
కాలం విలువ
కాలం సాక్షి! మానవుడు ఘోరమైన నష్టంలో పడి ఉన్నాడు. అయితే, దైవాన్ని విశ్వసించి, సత్కార్యాలు ఆచరిస్తూ, సత్యం, సహనాలను గురించి పరస్పరం ఉపదేశించుకునేవారు మటుకు ఏ మాత్రం నష్టపోరు. (పవిత్ర ఖురాన్. 103-1, 3) ఇందులో మూడు విషయాలున్నాయి. దైవ విశ్వాసం, మంచి పనులు చేయడం, సత్యం- సహనాలను గురించి పరస్పరం బోధించుకో వడం. ఈ మూడు వర్గాల వారు తప్ప మిగతా వారంతా నష్టంలో పడి (దారి తప్పి) ఉన్నారు. ‘కాలం సాక్షి!’ అనడంలోని ఔచిత్యం ఏమిటం టే, కాలం అనాదిగా అనేక సంఘటనలకు సాక్షీభూతమైనది. ఎన్నో యథార్థాలను అది ప్రపంచానికి అందించింది. కాలం విలువను గుర్తించిన వారే ఈ యథార్థాల నుంచి గుణ పాఠం గ్రహిస్తారు. కాలం ఎవరి కోసమూ ఆగ దు. తన కర్తవ్య నిర్వహణలో అది అప్రతిహతం గా సాగిపోతూనే ఉంటుంది. అంతేకాదు, కాలం చాలా కర్కశమైనది కూడా! అది ఎవరినీ క్షమించదు. ఎంతో మంది మహామహులు, తమ కు ఎదురేలేదని విర్రవీగిన వా ళ్లు కాలగర్భంలో కలసిపొ య్యారు. కనుక కాలం విలు వను గుర్తించాలి. అది దేవుని అపార శక్తిసామర్థ్యాలకు, అసాధారణ కార్యదక్షతకు ప్రస్ఫుట నిదర్శన మని అంగీకరించాలి. ఈ సత్యాన్ని విశ్వసించి తదనుగుణంగా మంచి పనులు చెయ్యాలి. ధర్మ బద్ధమైన కార్యాలను ఆచరించాలి. సమస్త పాప కార్యాలకు. అన్యాయం, అధర్మాలకు దూరం గా ఉండాలి. సత్యంపై స్థిరంగా ఉన్న కారణం గా కష్టనష్టాలు ఎదురుకావచ్చు. మనోవాంఛ లను త్యాగం చేయాల్సి రావచ్చు. అవినీతి, అణ చివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సత్యమార్గా న పయనిస్తున్న క్రమంలో కష్టాలు, కడగండ్లు కలుగవచ్చు. ఇలాంటి అన్ని సందర్భాల్లో మనిషి విశ్వా సానికి నీళ్లొదలకుండా, సత్యంపై, న్యాయంపై, ధర్మంపై స్థిరంగా ఉంటూ సహనం వహిం చాలి. పరస్పరం సత్యాన్ని, సహనాన్ని బోధించు కుంటూ, దైవంపై భారం వేసి ముందుకు సాగా లి. ఇలాంటి వారు మాత్రమే ఇహపర లోకాల్లో సాఫల్యం పొందుతారని, మిగతా వారు నష్ట పోతారని మనకు అర్థమవుతూ ఉంది. కనుక అందరూ కాలం విలువను గుర్తిం చి, విశ్వాస బలిమితో సత్యంపై ిస్థిరంగా ఉం టూ, మంచి పనులు చేస్తూ, ప్రజలకు మంచిని, సత్యాన్ని, సహనాన్ని బోధిస్తూ, స్వయంగా ఆచ రిస్తూ సాఫల్యం పొందడానికి ప్రయత్నించాలి. దైవం మనందరికీ స్థిరత్వాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. ఎండీ.ఉస్మాన్ ఖాన్ -
విలువలతోనే సార్థకత
రుజుమార్గం గతంతో పోల్చుకుంటే ఈనాడు మానవుడు బాగా అభివృద్ధి సాధించాడు. ఆధునిక పరిజ్ఞానాన్ని ఔపోసన పట్టి, అనేక నూతన ఆవిష్కరణలకు నాంది పలికాడు. ఎన్నో కొత్త విషయాలు కనిపెడుతూ, భౌతికంగా ఎం తో ప్రగతి సాధించాడు. అయినా నైతికంగా, విలువల పరంగా తిరోగమనంలోనే ఉన్నాడన్నది జీర్ణించుకో లేని వాస్తవం. పైకి ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ ఈనా డు మానవ సమాజం ఎంతగానో దిగజారి పోయింది. ఏ రంగంలోనూ నైతికత, విలువలు కనిపించడం లేదు. కుటుంబం, సమాజం, విద్యా, ఉద్యోగం, వ్యాపా రం, ఆర్థికం, ఆధ్యాత్మికం, రాజకీయం, ఇలా అన్ని రంగాలూ కలుషితమై పోయాయి. కుటుంబ వ్యవస్థను గమనిస్తే గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే, మాన వ సమాజ సౌధానికి కుటుంబమే మూలస్తంభం. ఆలు మగల అనుబంధంతో కుటుంబం ఏర్పడి కౌటుంబిక వ్యవస్థ పునాదులను పటిష్టం చేస్తుంది. కాని ఈనాడు ఆలుమగల మధ్య ప్రారంభమయ్యే అనుబంధ లేమి కుటుంబ వ్యవస్థ పునాదులను బలహీనపరుస్తోంది. బంధాలు, అనుబంధాలు అపహాస్యం పాలవుతు న్నాయి. ఈ విధంగా కుటుంబంలో, సమాజంలో ఆత్మీ య, మానవీయ విలువలు మృగ్యమైపోతున్నాయి. ఇక విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోనూ నీతినిజాయితీ, విశ్వస నీయత లోపించాయి. తమ విద్యుక్త ధర్మాలను ఏ ఒక్కరూ నిర్వర్తించడం లేదు.అందిన కాడికి దండుకోవడమే తెలివైన పనిగా పరిగణించే దుస్థితి దాపురించింది. ఈ రంగాల్లోని ఎక్కువ మందికి ఈ సూత్రం వర్తిస్తుంది. ఏదో ఒకటి చేసి సంపాదించడమే నీతి అయిపోయింది. ఇక రాజకీయాల సంగతి సరేసరి. బాధ్యత, జవాబు దారీతనం మచ్చుకైనా కనిపించవు. ప్రజాసేవ అనేది ప్రజల్ని మోసం చేయడానికి వాడే పదం మాత్రమే. ఇదీ... నైతికత, ఆధ్యాత్మికతలను పక్కన పెట్టి ఆధునికత, భౌతికత సాధించిన ప్రగతి. కాబట్టి ఈ దుస్థితి దూరం కావాలంటే, దైవం నిర్దేశించిన జీవన విధానాన్ని అవలంబించాలి. ఆయన ఏర్పరచిన కార్యాచరణ పరిధుల్ని అతిక్రమించకుండా నిర్దేశిత హద్దులో్ల జీవితం గడపాలి. ఇష్టానుసారంగా వ్యవహ రిస్తే, ఈ ప్రపంచంలో ఎవరూ అడిగేవారు లేకపో యినా దైవం మాత్రం వదిలి పెట్టడని, తప్పకుండా ప్రశ్ని స్తాడని విశ్వసించాలి. మానవుడు పుట్టింది మొదలు మరణించేవరకు జీవితంలోని అన్ని దశల్లో, అన్ని రంగాల్లో అల్లాహ్ మానవుడికి మార్గదర్శకం అందించాడు. ముహమ్మద్ (స)ను యావత్ మానవాళికి ఆచరణాత్మక నమూనా గా ప్రభవింపజేశాడు. కనుక ప్రవక్త మార్గదర్శకంలో నడుచుకుంటే జీవితంలోని అన్నిరంగాల్లో విలువలు తొణికిసలాడతాయి. అవినీతి, అన్యాయం, ఐనైతికత లాంటి అనేక దుర్మార్గాలు అంతమైపోతాయి. మానవీ య విలువలతో కూడిన సత్సమాజం ఉనికిలోకొస్తుం ది. దైవం సమస్త మానవాళికీ విలువలతో కూడిన జీవి తం గడిపే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. యండి.ఉస్మాన్ ఖాన్ -
నిస్వార్థ సేవ
రుజుమార్గం సమాజ సేవలో ప్రధానమైనది మానవ సేవ. ఏరూపం లో అయినా సాటి మానవులకు చేసే ఉపకారాన్ని సేవ అనవచ్చు. సమాజంలో ప్రతినిత్యం మనకు రకరకాల మనుషులు తారసపడుతూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అవసరం. ఒకరిది చిన్న అవసరం కావచ్చు, మరొకరిది పెద్ద అవసరం కావచ్చు. కాని అందరికీ అందరితో అవసరాలు ఉంటాయి. ఎవరికీ ఎవరి తోనూ అవసరాల్లేకుండా మానవ మనుగడ సాగడం అసాధ్యం. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవడం, కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం తప్పనిసరి. ఈ పర స్పర సహకార భావనలో సేవా భావమే తప్ప, స్వార్థ భావన ఉండకూడదు. కానీ ఇవాళ ప్రతిదీ వ్యాపారమే. నేటి మానవులు ప్రతి విషయంలోనూ స్వలాభమే తప్ప, ఎదుటి వారి ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. ‘సేవ’ అన్న పదానికి అర్థాన్నే మార్చేసి ఆ ముసుగులో స్వప్రయోజ నాలను కాపాడుకుంటూ ప్రజలను వంచిస్తున్నారు. త్యాగం, పరోపకారం లాంటి భావనలు అడుగంటి పోయాయి. ఈ సుగుణాలు లేని సేవాభావం స్వార్థ ప్రయోజనాలకే తప్ప, మరి దేనికీ కాదు. ఈ రుగ్మత దూరం కావాలంటే మానవుల హృదయాల్లో ఆధ్యాత్మిక కుసుమాలు విరబూయాలి. మానవీయ పరిమ ళాలు వెల్లివిరియాలి. ప్రతి ఒక్కరూ తాము ఎవరికి ఏరూపంలో సహా యం అందించినా కేవలం దైవ ప్రస న్నత కోసమే అని భావించాలి. ఎలాంటి స్వార్థం, స్వలాభం ఆశించని నిస్వార్థ, నిష్కల్మష సేవను మాత్రమే దైవం అంగీకరిస్తాడు. మనసులో ఏమాత్రం మాలిన్యమున్నా దానిని స్వీకరించడు. దైవం మాన వుల బాహ్య ఆచరణలతోపాటు, ప్రధానంగా అంత రంగాన్ని చూస్తాడు. అందుకే, ముహమ్మద్ ప్రవక్త (స) అల్లాహ్ మీ రూపురేఖల్ని చూడడు. ఆంతర్యాలను చూస్తాడు. ఎవరు ఏ ఉద్దేశంతో ఏపని చేస్తారో ఆ ప్రకారమే దైవం వారికి పుణ్యఫలం ప్రసాదిస్తాడు అని ప్రవచించారు. అంతేకాదు, ‘మీరు ఆచరించే కర్మల ప్రతిఫలం మీ సంకల్పాలపై ఆధారపడి ఉంద’ ని కూడా పేర్కొన్నారు. అందుకని మనం చేసే ప్రతి పనిలో దైవ ప్రసన్నత ప్రధాన ప్రేరణగా ఉండాలి. అంటే ఎవరికి ఏరూపంలో సహాయం చేసినా, దైవం సంతోషిస్తే చాలని, ఆయన ప్రసన్నత కోసమే పని చేస్త్తున్నామన్న భావన ఉండాలి. అంతేగాని, ఈ సేవా కార్యక్రమాల వల్ల ఎంత ప్రాచు ర్యం వస్తుంది? ఎంత లాభం చేకూరుతుంది? అన్న ఆలోచన ఉండకూడదు. మంచి ఆలోచనా విధానం వల్లనే మానవుల మధ్య పరస్పర సహకారాలకు సార్థ కత ఉంటుంది. నిస్వార్థ సేవా భావనలకు బలమైన పునాది ఏర్పడి, సాటి మానవుల అవసరాలను తమ అవసరాలుగా భావించే సహృదయత కలుగుతుంది. ఇలాంటి నిజమైన సేవకే అల్లాహ్ వద్ద విలువా, గౌరవం. సమాజంలోనూ ఆదరణ. దైవం మనందరి హృదయాల్లో నిస్వార్థ సేవాభావాన్ని జనింపజేయాలి. యం.డి. ఉస్మాన్ ఖాన్ -
జీవన సాఫల్యం
రుజుమార్గం ప్రాపంచిక జీవితం తాత్కాలికం. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టవలసిందే. అందుకని తాత్కాలికమైన ఈ ప్రాపం చిక జీవితంలో శాశ్వత జీవితానికి పనికొచ్చే కర్మ లను ఆచరించాలి. నీతి, నిజాయితీతో ఆచరించిన సత్కర్మలే పరలోకంలో పనికొస్తాయి. ఇహలోక జీవన సుఖసంతోషాల కోసం అడ్డదారులు తొక్కితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. మానవుడి శ్వాస ఆగిన మరుక్షణమే అతని కర్మల క్రమం తెగిపోతుంది. ఫలితం కనిపించకుండా పోతుంది. కాని మూడు రకాల కర్మలకు సంబంధిం చిన ఫలితాలు మాత్రం సదా అతని ఖాతాలో జమ అవుతూనే ఉంటాయి. వాటి పుణ్యఫలం నిరంతరం అందుతూనే ఉంటుంది. అవే ప్రజలకు ప్రయోజనం చేకూర్చే సత్కార్యాలు. అంటే, మంచినీటి బావి తవ్విం చడం, పాఠశాల నిర్మాణం, మసీదు నిర్మాణం, సత్రం కట్టించడం, వాగులు, వంకల మీద వంతెన నిర్మిం చడం, మరే విధంగానైనా ప్రజలకు దీర్ఘకాలిక, శాశ్వ త ప్రయోజనం కలిగే పనులు చేయాలి. మరొకటి, ధార్మిక విద్యా విజ్ఞానాలు. ప్రజలను నైతికంగా, ఆధ్యా త్మికంగా తీర్చిదిద్దే విద్యాబోధన. ముఖ్యంగా ఖురాన్ ప్రవచనాలు; ప్రవక్త వారి హితవచ నాలు, ఉత్తమ సాహిత్య సృజన, వా టి ప్రచురణ, పంపిణీ. ఇవి కూడా సత్కార్యాలే. ప్రజలు ఈ బోధనల ద్వారా, సాహిత్యం ద్వారా ప్రయోజ నం పొందుతున్నంత కాలం తరతరాల పుణ్య ఫల మంతా వారి కర్మల చిట్టాలో చేరుతూనే ఉంటుంది. ఉత్తమ సంతానం. తల్లిదండ్రులు జీవించి ఉన్నం తకాలం వారికి ఏ విధమైన లోటు రాకుండా ప్రేమతో సేవలు చేస్తూ, వారి పర్యవేక్షణలో, శిక్షణలో ఉత్తము డిగా, దైవభక్తి పరాయణునిగా ఉంటారో, అలాంటి వారి కర్మల పుణ్యం కూడా నిరంతరం వారి తల్లిదం డ్రులకు లభిస్తూనే ఉంటుంది. అంటే, తమ పర్యవే క్షణలో సంతానం ఉత్తములుగా తయారై సత్కార్యాలు ఆచరిస్తే ఆ పుణ్యఫలం వారితోపాటు వీరికీ లభిస్తూనే ఉంటుంది. అందుకని, ప్రజల తాత్కాలిక అవసరాలు తీర్చ డంతో పాటు, దీర్ఘకాలిక, శాశ్వత సంక్షేమ కార్యకలా పాలలో అధికంగా పాల్గొనాలి. పవిత్ర గ్రంథ బోధ నలు, ప్రవక్త ప్రవచనాలను ప్రజలకు పరిచయం చేసి, నైతికంగా, ఆధ్యాత్మికంగా ఎదిగేలా ప్రోత్సహించాలి. మానవీయ విలువలు ప్రజా బాహుళ్యంలో ప్రోది చేయ డానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలి. తల్లిదం డ్రులను కంటికి రెప్పలా చూసుకుంటూ, వారిసేవలో తరించాలి. వారికోసం తరచుగా ప్రార్థిస్తూ ఉండాలి. మరణం ఒక పచ్చి నిజం. దీనికి ఎవరూ అతీ తులు కాదు. అది ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో ఎవ రికీ తెలియదు. కాబట్టి, తాత్కాలికమైన ఈ చిన్న జీవి తంలో నీతినిజాయితీలతో బతకాలి. ధర్మబద్ధమైన జీవనవిధానం అవలంబించాలి. అప్పుడే మానవ జీవి తం సార్థకమవుతుంది. యండి.ఉస్మాన్ ఖాన్ -
కింది వారిని చూడాలి
రుజుమార్గం ఈనాడు సమాజంలో నైరాశ్యం రాజ్య మేలుతోంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విధమైన అసంతృప్తి, ఎంత ఉన్నా ఇంకేదో లేదన్న బాధ, మరేదో కావాలన్న ఆశ వారిని ఊపిరి సలపనివ్వడం లేదు. దీనికి కారణం దైవం తమకు ప్రసాదించిన వరాల పట్ల సరైన అవ గాహన, కృతజ్ఞతా భావం లేక పోవడమే. ఒకసారి షేక్ సాది (ర) అనే పండితుడు కాలి నడకన ప్రయాణం చేస్తూ ఓ ఊరికి చేరుకున్నాడు. ఈలోపు ఆయనగారి కాలి జోళ్లు తెగిపోయాయి. కొత్తవి కొనుక్కుందా మంటే జేబులో డబ్బులు ఖాళీ.. ఊరు కాని ఊరిలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా బోసి కాళ్లతో ఎలా నడవడం, ఎంత పనైపోయిందీ...? అని పెద్దాయన చాలా బాధపడ్డాడు. అంతలోనే అస లు కాళ్లే లేని ఓ యాచకుడు నేలపై దేకుతూ వెళుతు న్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన షేక్ గారికి జ్ఞానోదయమ యింది. తన కాళ్లకు చెప్పులు లేకపోతేనేం, సలక్షణ మైన రెండు కాళ్లను దైవం తనకు ప్రసాదించాడు. కళ్లు, కాళ్లు, ముక్కు, చెవులు, నోరు తదితర అన్ని అవ యవాలను ఎలాంటి లోపం లేకుండా తయారు చేశా డు. అందమైన ఆకృతితోపాటు, చక్కని ఆరోగ్యాన్నీ అనుగ్రహించాడు. ఈ భావన మదిలో కదలగానే అంతకు ముందు కాళ్లకు చెప్పుల్లే వని బాధ పడ్డందుకు షేక్ సాబ్ సిగ్గుతో చితికిపొయ్యాడు. దైవం పట్ల కృతజ్ఞతతో ఆయన మనసు పొంగిపోయింది, విన మ్రతతో శిరస్సు వంగిపోయింది. మానవుడి మనస్సు చాలా సంకుచితమైనది. ఎంత ఉన్నా ఇంకా ఏదో లేదన్న వెలితి అతని మన సును కెలుకుతూనే ఉంటుంది. ఒక్కసారి మనం మన చుట్టూ ఉన్న సమాజంపై దృష్టి సారిస్తే, కళ్లులేని వాళ్లు, కాళ్లులేని వాళ్లు, రకరకాల అంగవైకల్యాలతో బాధ పడేవారు, మానసికస్థితి బాగా లేనివాళ్లు, కనీసం ఒక్కపూట తిండికీ నోచుకోని అభాగ్యులు, ఒంటినిం డా బట్టలు, తలదాచుకోడానికి గూడూ లేని వాళ్లు ఎంతటి దీనస్థితిలో బతుకులు వెళ్లదీస్తున్నారో మనకు అర్థమవుతుంది. అలాంటి వారితో పోల్చుకుంటే మనం ఎంత అదృష్టవంతులమో తెలిసివస్తుంది. బుద్ధిజీవులమైన మనం ఈ విషయాలను గురిం చి ఆలోచించగలిగితే, సమాజంలోని నిరుపేదలు, నిస్సహాయులు, నిత్యదారిద్య్రంలో భారంగా జీవితాలు వెళ్లదీస్తున్న అభాగ్యుల పట్ల మన బాధ్యత ఏమిటో కూడా తెలుస్తుంది. అందుకని, లేనిదాని కోసం అర్రు లు చాచకుండా, దైవం మనకు ప్రసాదించిన అను గ్రహాలను సద్వినియోగం చేసుకుంటూ, ఆయన పట్ల కృతజ్ఞతతో ఉండాలి. నైతిక, ఆధ్యాత్మిక విషయాల్లో మనకంటే పైవారిని, ప్రాపంచిక విషయాల్లో మన కంటే కిందిస్థాయిలో ఉన్నవారిని చూడాలన్న ప్రవక్త హితోపదేశాన్ని గమనంలో ఉంచుకోవాలి. మనం గనక ఈ విధమైన మంచి ఆలోచనా దృక్పధాన్ని అల వరచుకోగలిగితే ఇహలోక జీవితమూ ధన్యమవుతుం ది, పరలోక జీవితంలోనూ సాఫల్యం సిద్ధిస్తుంది. ఎం.డి.ఉస్మాన్ ఖాన్ -
ఉత్తమ విద్య
రుజు మార్గం విద్య విలువైన భూషణం, అమూల్యమైన వరం. మానవుడికి ఎన్ని ఉన్నా విద్య లేకపోతే అన్నీ వ్యర్థం. విద్య లేని వాడు వింత పశువు అన్న నానుడి మనకు తెలిసిందే. అందుకే విద్య, విజ్ఞానాలకు పెద్ద పీట వేసింది దైవధర్మం. దైవవాణి అయిన పవిత్ర ఖురాన్ అవతరణ ‘ఇఖ్ రా’ అంటే, ‘చదువు’ అన్న వాక్యంతో ప్రారంభమైంది. విద్యాభ్యాసం స్త్రీ, పురుషులందరికీ విధి అన్నారు ముహమ్మద్ ప్రవక్త(స). విద్యార్జన నిమిత్తం, విజ్ఞాన అన్వేషణలో ఎంత దూరమైనా వెళ్లండి, భూమి చివరి అంచుల వరకైనా వెళ్లండి అని ప్రోత్సహించారు. జ్ఞానం జీవితం, అజ్ఞానం మరణం అన్నారాయన. ఈ వాక్యాలూ, ప్రవచనాల ద్వారా విద్య విజ్ఞానాలకు ఎంత ప్రాముఖ్యం ఉందో మనం అంచనా వేయవచ్చు. ఒకసారి ముహమ్మద్ ప్రవక్త(స) మదీనాలో మసీదు ముందు నుండి వెళుతున్నారు. అప్పుడక్కడ పక్కపక్కనే రెండు సమావేశాలు జరుగుతున్నాయి. ప్రవక్త అది చూసి, ‘ఇవి రెండూ మంచి సమావేశాలే. ఇరు సమావేశాల్లోని వారూ చాలా మంచి పనే చేస్తున్నారు. కాని ఒకరు చేస్తున్న దాని కంటే, మరొకరు చేస్తున్నది ఇంకా మంచి పని. ఒక సమావేశంలోని వారు దైవధ్యానంలో, దైవారాధనలో నిమగ్నమై ఉన్నారు. క్షణకాలం కూడా వృథా చేయకుండా దైవాన్ని స్మరిస్తున్నారు. మరో సమావేశంలోని వారు విద్యా బోధ చేస్తున్నారు. ప్రజలకు మంచీచెడుల విచక్షణ నేర్పుతున్నారు. కనుక మొదటి వారు చేస్తున్న దానికంటే వీరు చేస్తున్న పని చాలా గొప్పది, ఉత్తమమైనది. నేను కూడా బోధకుడిగానే వచ్చాను’ అని చెబుతూ, ఆయన కూడా విద్యాబోధన సమావేశంలోనే కూర్చున్నారు. ఒక సందర్భంలో ప్రవక్త... గురువు లేదా బోధకుడి ప్రాముఖ్యతను చెబుతూ, ప్రజలకు మంచిని బోధించి, విద్యాగంధాన్ని పంచేవాడి కోసం దైవ దూతలతో సహా భూమ్యాకాశాలలో ఉన్న సమస్త సృష్టిరాసులు - చివరికి రంధ్రాల్లో నివసించే చీమలు, సముద్ర గర్భాల్లో ఉండే చేపలు, ఇతర జలచరాలన్నీ ప్రార్థిస్తాయని సెలవిచ్చారు. కనుక విద్యా విజ్ఞానాల ప్రాముఖ్యతను తెలుసుకొని, నైతిక, మానవీయ, ప్రేమామృత విలువలు వికసింపజేసే విద్యను ఆర్జించడానికి, తమ సంతానానికి అలాంటి ఉత్తమ విద్యను అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. తల్లిదండ్రులు తమ సంతానానికి ఇచ్చే కానుకలన్నిటిలో ఉత్తమ విద్యకు మించిన కానుక మరొకటి లేదని ముహమ్మద్ ప్రవక్త(స) సూచించారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, వ్యాపార దృక్ప థంతో కూడిన ప్రాపంచిక విద్య ఈనాడు మన సమా జాన్ని కలుషితం చేస్తున్న స్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి, ప్రాపంచిక విద్యతోపాటు, నైతిక, మానవీయ విలువలు బోధించే విద్య ఈ తరానికి నేర్పించాల్సిన అవసరం ఉంది. విద్యా ప్రవీణులు, ధార్మిక విద్వాం సులు ఈ దిశగా ఆలోచిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎం.డి.ఉస్మాన్‌ఖాన్ -
ఆనందంలో హద్దులు దాటొద్దు
రుజు మార్గం సంతోషం మానవ నైజంలో ఉన్న సహజ గుణం. సంతోష సమయాల్లో కొత్త వస్త్రాలు ధరించడం, రుచి కరమైన వంటలు ఆరగించడం, నిషిద్ధాలకు దూరంగా ఇతర పద్ధతుల్లో కూడా సంతోషకర భావాలను వ్యక్తం చేయడం తప్పుకాదు. ధర్మం మానవుల సహజ అవస రాలను గుర్తించి, కొన్ని ధర్మసమ్మతమైన మార్గాల్లో వాటిని తీర్చుకునే విధంగా ప్రోత్సహిస్తుంది. కృత్రిమ త్వాన్ని, లేని గాంభీర్యాన్ని తెచ్చి పెట్టుకొని, ఆనందానికి దూరంగా ఉండమని ధర్మం చెప్పదు. అలా అని, హద్దు ల్ని అతిక్రమించి, అధర్మ, అవాంఛనీయ కార్యకలాపా లకు పాల్పడటాన్నీ అది సమ్మతించదు. ఎందుకంటే ధర్మంలో ప్రతిదానికి ఒక హద్దు, పరిధి ఉన్నాయి. ఉదాహరణకు ఒక పండుగనే తీసుకుందాం. ఆనందతరంగాల్లో తేలియాడుతూ సంబరం చేసుకునే సందర్భం. అయితే ఆ సమయాన తాగితందనాలాడ తానంటే, జూదంలో మునిగి తేలతానంటే కుదరదు. ధర్మం సమ్మతించదు. ధార్మికంగానే కాకుండా, సామాజికంగా కూడా ఇది నేరమే. దైవిక చట్టాలేకాదు, ప్రపంచంలోని శాసనాలు కూడా ఇలాంటి చేష్టలను హర్షించవు. కనుక ధార్మిక పరిధుల్ని అతిక్రమించకుండా, ధర్మసమ్మతమై న మార్గాల్లో సంబరాలు జరుపుకోవ డం సమ్మతమే. దైవధర్మం మానవు ల్ని సంతోషంగా, నూతనోత్సాహంతో, ప్రపుల్ల భావాలతో ఉంచాలని అభిలషిస్తుంది. అందుకే అది ఒక పరిధి మేర మానవులకు స్వేచ్ఛను, స్వయం నిర్ణయాధికారాలను ప్రసాదించింది. నూతన సంవత్సర వేడుకైనా ఇంతే. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కాల ప్రవాహంలో కొత్త వత్సరాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. క్యాలెండర్లు మారుతూనే ఉంటాయి. కాలం ఎవరి కోసం ఆగదు. దాని వెంట పరుగెత్తలేని వారు మరుగున పడిపోతారు. రాజులు, రారాజులు, మాన్యులు, సామాన్యులు, పండి తులు, పామరులు- అందరూ కాలగర్భంలో కలసిపో వలసినవారే. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేట ప్పుడు ఈ వాస్తవాలను గమనంలో ఉంచుకోవాలి. గత కాలం నుండి గుణపాఠం నేర్చుకుంటూ, భవిష్యత్తుకు స్వాగతం పలకాలి. నిస్సందేహంగా కొత్త సంవత్స రాన్ని సంతోషంగా స్వాగతించవలసిందే. కాని ఆ సం తోషంలో హద్దుల అతిక్రమణ జరగకుండా చూసుకో వాలి. మందు, చిందు ఇంకా ఇతరేతర నిషిద్ధ కార్యా లతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడం ఎంత వరకు సమంజసం అన్న స్పృహ జాగృతం కావాలి. గత ఏడాది ఏమేమి చేశామన్నది ఆత్మపరిశీలన చేసుకో వాలి. మంచిపనులు చేసి ఉంటే, ఈ ఏడాది వాటిని ఇంకా అధికంగా, ఉత్తమంగా చేయాలని సంకల్పిం చుకోవాలి. తప్పులు, పాపాలు దొర్లి ఉంటే, వాటి పట్ల పశ్చాత్తాపం చెంది, భవిష్యత్తులో వాటి జోలికి పోనని నిజాయితీగా ప్రతిజ్ఞ చేసిన వారిని అల్లాహ్ అమితంగా ప్రేమించి, గత పాపాలను క్షమిస్తాడని ముహమ్మద్ ప్రవక్త(స) ప్రవచించారు. ఎవరి జీవితం ఎప్పుడు సమా ప్తమో ఎవరికీ తెలియదు కనుక, ఆనంద సమయమని హద్దుల్ని అతిక్రమించక, ధర్మబద్ధంగా సంతోష, సంబ రాలు జరుపుకుంటే ఇహలోక జీవితమూ ఆనందమ యమవుతుంది. పరలోక జీవితమూ సఫలమవుతుంది. యం.డి.ఉస్మాన్‌ఖాన్ -
అతిథి మర్యాద
పూర్వకాలంలో మానవులమధ్య సత్సంబంధాలు, ఆప్యాయత, ప్రేమానురాగాలు మెండుగా ఉండేవి. ఇప్పుడు లేవనికాదు, గతంతో పోల్చుకుంటే సన్నగిల్లా యి. ఆ రోజుల్లో ఎవరైనా అతిథి వస్తే సంతోషించేవారు. ఆప్యాయంగా స్వాగతం పలికేవారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం వారి కోసం కేటాయించేవారు. ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. అతిథి మర్యాద ఇస్లామియ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన అంశం. ఒకసారి దైవప్రవక్త ముహ మ్మద్ (స) సన్నిధిలో ఒక వ్యక్తి హాజరై, ‘అయ్యా! నేను నిరుపేదను. ఆకలి దహించివేస్తోంది’ అని అభ్యర్థిం చాడు. ఆ రోజు ప్రవక్త వారి ఇంట కూడా పచ్చి మంచి నీళ్లు తప్ప మరేమీలేదు. అందుకని, ప్రవక్త మహనీ యులు అక్కడున్న సహచరులతో, ‘ఈ పూట ఇతని కెవరైనా ఆతిథ్యం ఇవ్వగలరా?’ అని అడిగారు. ఓ సహ చరుడు స్పందించి, ‘దైవ ప్రవక్తా! నేనిస్తాను’ అన్నాడు. అతిథిని వెంట బెట్టుకొని ఇంటికి వెళ్లాడు. ‘ఈ రోజు మన ఇంటికి ఓ అతిథి వచ్చారు. తినడానికి ఏమైనా ఉందా?’ అని శ్రీమతిని సంప్రదించారు. ‘పిల్లల కోసమని ఉంచిన కాస్తంత భోజనమే తప్ప మరేమీ లేదు. అది కూడా వచ్చిన అతిథి ఒక్కరికైతేనే సరిపోతుందేమో!’ అని బదులిచ్చారామె. ‘అతిథిని గౌర వించడం మన విధి. పిల్లలకు ఏదో ఒక సాకు చెప్పి నిద్రపుచ్చు. పిల్లలు నిద్రపోగానే భోజనం వడ్డించు. మేము భోజనానికి కూర్చున్న తరువాత, వడ్డన సమయంలో దీపాన్ని సరిచేస్తున్నట్టు నటించి, ఆర్పి వెయ్యి. చీకట్లో అతిథితోపాటు మనం కూడా తింటున్నట్లే నటిద్దాం’ అని చెప్పారాయన. అనుకున్నట్లుగానే ఆ ఇల్లాలు పిల్లలను నిద్ర పుచ్చి, భోజనం వడ్డించింది. అందరూ కూర్చున్నారు గాని, అతిథి మాత్రమే భోజనం చేశాడు. తాము కూడా తింటున్నట్లే నటించిన ఆ దంపతులిద్దరూ, పిల్లలతో సహా పస్తులే ఉన్నారు. మరునాడుదయం ఆతిథ్యం ఇచ్చిన సహచరుడు ప్రవక్త మహనీయుల వారి సన్నిధిలో హాజరైనప్పుడు, ప్రవక్త వారు ‘అబూతల్హా’ అంటూ ఆయన పేరును, ఆయన సతీమణి పేరునూ ఉచ్ఛరిస్తూ, ‘దైవానికి తన ఫలానా భక్తుడు, భక్తురాలి తీరు నచ్చింది. అతిథి పట్ల వారు చూపిన మర్యాద, త్యాగభావనకు అల్లాహ్ అమి తంగా సంతోషించాడు’ అని శుభవార్త వినిపించారు. ‘వారు స్వయంగా అగత్యపరులైనప్పటికీ, తమ కంటే ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు’ అని పవిత్ర ఖురాన్ ఈ త్యాగగుణాన్ని అభివర్ణించింది. తమ అవస రాల కంటే ఇతరుల అవసరాలకు ప్రాధాన్యమివ్వడం, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం, అతిథులను గౌరవించడం అత్యున్నత పుణ్యకార్యాలు. కాని ఈనాడు అతిథి పట్ల మొహమాటపు పలకరింతలే కాని, ఆప్యాయత ఉట్టి పడటంలేదు. ఈ ఉరుకులు, పరుగుల మధ్య ఒకర్ని గురించి ఒకరు పట్టించుకునేంత తీరిక లభించడం లేదు. ఇలాంటి సుగుణాలు లోపించబట్టే శాంతి లేకుండా పోతోంది. అందుకని సాధ్యమైనంత ఎక్కువగా సత్సంబంధాలు నెరపడానికి, స్నేహధర్మా న్ని, అతిథి మర్యాదను గౌరవించడానికి ప్రాధాన్యతని వ్వాలి. అప్పుడే దైవ ప్రసన్నతా భాగ్యం కలుగుతుంది. - యం.డి.ఉస్మాన్‌ఖాన్ -
అత్యంత ప్రాముఖ్యమైన రోజు యౌమె ఆషూరా
ఎవరైతే ఆషూరా రోజున ఉపవాసం (రోజా) పాటిస్తారో, వారు చాలా సుదీర్ఘకాలంపాటు ఉపవాస వ్రతం పాటించిన దానితో సమానం. దీనికి ప్రతిఫలంగా అమితమైన పుణ్యం లభిస్తుంది. ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, వస్త్ర విహీనులకు దుస్తులు సమకూర్చడం, ప్రేమగా అనాథల తలనిమరడం, దాహార్తుల దాహం తీర్చడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, రోగులను పరామర్శించడంలాంటి మంచిపనులు చేసినవారికి దైవం స్వర్గంలో అమితమైన గౌరవమర్యాదలు ప్రసాదిస్తాడు. ముహర్రం మాసం పదవతేదీని ‘యౌమె ఆషూరా’ అంటారు. ఇస్లామీ ధర్మంలో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆరోజు ముస్లింలు రోజా ((ఉపవాసం) పాటిస్తారు. ఎందుకంటే ముహమ్మద్ ప్రవక్త (స) రమజాన్ రోజాల తర్వాత మళ్లీ అంత శ్రద్ధగా ‘ఆషూరా’ రోజానే పాటించేవారు. ప్రజాస్వామ్య ప్రేమికుడైన ఇమా మె హుసైన్ (రజి) ధర్మపోరాటంలో అమరులైంది ఈ రోజే. పూర్వచరిత్రలో కూడా దీనికి ప్రత్యేక ప్రాముఖ్యమే ఉంది. ఆరోజు దైవం ఆదిమానవుడైన హ . ఆదం(అ)పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. హ. ఇద్రీస్ (అ)కు ఆకాశంలో ఉన్నతస్థానాన్ని అదే రోజు దైవం హ. మూసా(అ)తో సంభాషించాడు. ఆయనకు ‘తౌరాత్’ గ్రంథాన్ని బహూకరించాడు. హ.అయ్యూబ్ (అ), హ. యూసుఫ్ (అ) లు కలుసుకున్నది ఈరోజే. హ. యూనుస్ (అ)ను దైవం చేప కడుపు నుండి రక్షించింది కూడా ఈ రోజే. ఫిరౌన్ బారినుండి హ.మూసా(అ) జాతి జనులను నీల్ సముద్రంలో ప్రత్యేకమార్గం ఏర్పాటుచేసి రక్షించింది కూడా ఈ రోజే. ఇదే రోజు దైవం హ. దావూద్ (అ)ను కనికరించి క్షమించి వేశాడు. ఇదేరోజు హ. సులైమాన్ (అ) కు మరోసారి అధికార పీఠం అప్పగించాడు. ఈ రోజే హ. ఈసా (అ)ను దైవం ఆకాశం పైకి ఎత్తుకున్నాడు. హ. జిబ్రీల్ (అ) దైవ కారుణ్యాన్ని తీసుకుని దివినుంచి భువికి దిగివచ్చింది కూడా ఈ రోజే. ఇదేరోజు ముహమ్మద్ ప్రవక్త (స) ముద్దుల మన వడు హ. ఇమామె హుసైన్ (రజి)తోపాటు, ఆయన సహచరులు, కుటుంబీకులు మొత్తం సుమారు డెబ్భయి రెండుమంది అమరులయ్యారు. ఈ ఆషూరా రోజునే దైవం ఈ సృష్టిని సృజించాడు. మొట్టమొదటిసారి ఆకాశం నుండి వర్షం కురిసింది కూడా ఈ రోజే. దైవకారుణ్యం భూమిపై అవతరించింది కూడా ఈరోజునే. ఎవరైతే ఆషూరా రోజున ఉపవాసం (రోజా) పాటిస్తారో, వారు చాలా సుదీర్ఘకాలంపాటు ఉపవాస వ్రతం పాటించిన దానితో సమానం. దీనికి ప్రతిఫలంగా అమితమైన పుణ్యం లభిస్తుంది. ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, వస్త్ర విహీనులకు వస్త్రాలు సమకూర్చడం, ప్రేమగా అనాథల తలనిమరడం, దాహార్తుల దాహం తీర్చడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, రోగులను పరామర్శించడంలాంటి మంచిపనులు చేసినవారికి దైవం స్వర్గంలో అమితమైన గౌరవమర్యాదలు ప్రసాదిస్తాడు. స్వర్గ దస్తర్ఖాన్ దృష్ట్యా ముహర్రం మాసం పదవ తేదీని యౌమె ఆషూరా అంటారు. అసలు ముహర్రం అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేర్లు హసన్, హుసైన్. (ర). ముస్లింలకే కాదు, ముస్లిమేతర సోదరులకు కూడా ఆ మహనీయుల త్యాగాలు మనసులో మెదులుతాయి. ఆనాడు జరిగిన కర్బలా దుర్ఘటన, దుర్మార్గుల దురాగతాలు, ఆ మహనీయుల అనుచరులపై జరిగిన దౌర్జన్యాలు, వారికుటుంబీకుల దీనస్థితి, పసిబిడ్డల హాహాకారాలు, శాంతి, సామరస్యాలకు వారు చేసిన ప్రయత్నాలు, రాచరిక నిర్మూలనకు, ప్రజాస్వామిక పరిరక్షణకు వారు చేసిన అవిరళ కృషి, వేలాది శతృసైన్యాన్ని గడగడలాడించి యుద్ధరంగంలోనే అమరులైన ఆ వీర ఘట్టం, మృతవీరుల కళేబరాలతో దుష్టులు, దుర్మార్గులు అయిన యజీద్ సైన్యం అవలంబించిన జుగుప్సాకరమైన వైఖరి, వారి ఫాసిస్టు చరిత్ర ఒక్కసారిగా అందరి హృదయాల్లో కదలాడుతుంది. ఎప్పుడైతే, ఎక్కడైతే న్యాయం, ధర్మం అనేది కాలు మోపుతుందో అప్పుడే, అక్కడే అన్యాయం, అధర్మం కూడా రంగప్రవేశం చేస్తుంది. న్యాయాన్ని, ధర్మాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి ప్రయత్నిస్తుంది. కుయుక్తిని, కుటిలబుద్ధిని ప్రయోగిస్తుంది. ఇది మనకు చరిత్ర చెప్పే సత్యం. మంచీ చెడుల మధ్య సంఘర్షణ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. గతంలోనూ జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతోంది. ముందు ముందు కూడా జరుగుతూనే ఉంటుంది. ఇది నిప్పులాంటి నిజం. ఈ విధంగా సత్యాసత్యాలకు, ధర్మాధర్మాలకు మధ్య జరిగిన సంఘర్షణా ఫలితమే కర్బలా దుర్ఘటన. - యండీ ఉస్మాన్ ఖాన్