నిస్వార్థ సేవ
రుజుమార్గం
సమాజ సేవలో ప్రధానమైనది మానవ సేవ. ఏరూపం లో అయినా సాటి మానవులకు చేసే ఉపకారాన్ని సేవ అనవచ్చు. సమాజంలో ప్రతినిత్యం మనకు రకరకాల మనుషులు తారసపడుతూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అవసరం. ఒకరిది చిన్న అవసరం కావచ్చు, మరొకరిది పెద్ద అవసరం కావచ్చు. కాని అందరికీ అందరితో అవసరాలు ఉంటాయి. ఎవరికీ ఎవరి తోనూ అవసరాల్లేకుండా మానవ మనుగడ సాగడం అసాధ్యం. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవడం, కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం తప్పనిసరి. ఈ పర స్పర సహకార భావనలో సేవా భావమే తప్ప, స్వార్థ భావన ఉండకూడదు.
కానీ ఇవాళ ప్రతిదీ వ్యాపారమే. నేటి మానవులు ప్రతి విషయంలోనూ స్వలాభమే తప్ప, ఎదుటి వారి ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. ‘సేవ’ అన్న పదానికి అర్థాన్నే మార్చేసి ఆ ముసుగులో స్వప్రయోజ నాలను కాపాడుకుంటూ ప్రజలను వంచిస్తున్నారు. త్యాగం, పరోపకారం లాంటి భావనలు అడుగంటి పోయాయి. ఈ సుగుణాలు లేని సేవాభావం స్వార్థ ప్రయోజనాలకే తప్ప, మరి దేనికీ కాదు.
ఈ రుగ్మత దూరం కావాలంటే మానవుల హృదయాల్లో ఆధ్యాత్మిక కుసుమాలు విరబూయాలి. మానవీయ పరిమ ళాలు వెల్లివిరియాలి. ప్రతి ఒక్కరూ తాము ఎవరికి ఏరూపంలో సహా యం అందించినా కేవలం దైవ ప్రస న్నత కోసమే అని భావించాలి. ఎలాంటి స్వార్థం, స్వలాభం ఆశించని నిస్వార్థ, నిష్కల్మష సేవను మాత్రమే దైవం అంగీకరిస్తాడు. మనసులో ఏమాత్రం మాలిన్యమున్నా దానిని స్వీకరించడు. దైవం మాన వుల బాహ్య ఆచరణలతోపాటు, ప్రధానంగా అంత రంగాన్ని చూస్తాడు.
అందుకే, ముహమ్మద్ ప్రవక్త (స) అల్లాహ్ మీ రూపురేఖల్ని చూడడు. ఆంతర్యాలను చూస్తాడు. ఎవరు ఏ ఉద్దేశంతో ఏపని చేస్తారో ఆ ప్రకారమే దైవం వారికి పుణ్యఫలం ప్రసాదిస్తాడు అని ప్రవచించారు. అంతేకాదు, ‘మీరు ఆచరించే కర్మల ప్రతిఫలం మీ సంకల్పాలపై ఆధారపడి ఉంద’ ని కూడా పేర్కొన్నారు.
అందుకని మనం చేసే ప్రతి పనిలో దైవ ప్రసన్నత ప్రధాన ప్రేరణగా ఉండాలి. అంటే ఎవరికి ఏరూపంలో సహాయం చేసినా, దైవం సంతోషిస్తే చాలని, ఆయన ప్రసన్నత కోసమే పని చేస్త్తున్నామన్న భావన ఉండాలి. అంతేగాని, ఈ సేవా కార్యక్రమాల వల్ల ఎంత ప్రాచు ర్యం వస్తుంది? ఎంత లాభం చేకూరుతుంది? అన్న ఆలోచన ఉండకూడదు. మంచి ఆలోచనా విధానం వల్లనే మానవుల మధ్య పరస్పర సహకారాలకు సార్థ కత ఉంటుంది. నిస్వార్థ సేవా భావనలకు బలమైన పునాది ఏర్పడి, సాటి మానవుల అవసరాలను తమ అవసరాలుగా భావించే సహృదయత కలుగుతుంది. ఇలాంటి నిజమైన సేవకే అల్లాహ్ వద్ద విలువా, గౌరవం. సమాజంలోనూ ఆదరణ. దైవం మనందరి హృదయాల్లో నిస్వార్థ సేవాభావాన్ని జనింపజేయాలి.
యం.డి. ఉస్మాన్ ఖాన్