మోక్ష మార్గం
దైవం తరువాత మానవుడికి అత్యంత ఆదరణీ యులు, గౌరవనీయులు తల్లిదండ్రులే. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, సేవాభావం లేని మానవ జన్మ నిరర్థకం. కాని దురదృష్టవశాత్తు ఈనాడు తల్లిదండ్రుల్ని సంతా నం పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు తరచుగా వినబడుతున్నాయి. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లి, రక్తాన్ని చెమటను ఏకం చేసి అహర్నిశలూ శ్రమ పడి, ప్రతి అవసరాన్ని తీర్చి ప్రయోజకుడిగా చేసిన నాన్న ఈనాడు సంతానానికి భారమైపోతున్నారు. కొంతమంది దౌర్భాగ్యులు కన్నవారిని వృద్ధాప్యంలో ఆశ్రమాల్లో చేర్చడం, వంతులేసుకొని తల్లినొక దగ్గర, తండ్రినొక దగ్గర ఉంచడం, ‘తలా ఒక నెల’ అని పంచుకోవడం లాంటి దురదృష్టకర చేష్టలకు పాల్పడడం మనం చూస్తున్నాం.
వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన సమయంలో వంతుల పేర ఆ వృద్ధ దంపతుల్ని భౌతికంగా విడదీసి, వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్న సంతానాన్నీ మనం చూస్తున్నాం. బాగా చదువుకున్నవాళ్లు, ఉన్నత హోదాలు వెలగబెడుతున్నవాళ్లు, హితబోధలు వల్లె వేసేవాళ్లు కూడా వృద్ధ తల్లిదండ్రుల మానసిక స్థితిని పట్టించుకోకుండా, నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా ప్రవర్తిస్తున్నారంటే అలాంటి వారిని ఏమనాలి? కొంత మంది, తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు వారిని పట్టించు కోరు. ప్రేమగా చూడరు, పట్టెడన్నం పెట్టరు. వారి ఆరోగ్యం పట్టించుకోరు. కాని చనిపోయిన తరువాత వేలు, లక్షలు ఖర్చుచేసి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఖరీదైన సమాధులు కట్టిస్తారు. వాటిపై పరిచే పూలకే వేల రూపాయలు వెచ్చిస్తారు. దీనివల్ల ప్రయో జనం? వారి జీవితకాలంలో ఆప్యాయంగా ప్రేమగా చూసుకోకుండా తదనంతరం ఎన్ని చేసినా వ్యర్థమే.
అందుకే మమతల మూర్తి ముహమ్మద్ (స) ‘తల్లి పాదాల చెంత స్వర్గమున్నదని, తండ్రి స్వర్గానికి సింహ ద్వారమని, వారిసేవ చేసి వారి ప్రేమను, వారి ఆశీర్వా దాలను పొంది, వారిని ప్రసన్నం చేసుకోకపోతే స్వర్గప్రవేశం అసాధ్యమని’ ఉపదేశించారు. కాబట్టి బాల్యంలో వారు మనల్ని ఎంత కరుణతో, వాత్స ల్యంతో పెంచి పోషించారో, వారి వృద్ధాప్యంలో మనం వారిని అంతకంటే ఎక్కువ ప్రేమానురాగాలతో సేవలు చేయాలి. వారి బాగోగుల్ని, వారి ఆరోగ్యాన్ని, వారి మానసిక స్థితిగతుల్ని పట్టించుకోవాలి. వారిని ఎప్పుడూ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించాలి. వారు నొచ్చుకునే విధంగా, వారి మనసుకు కష్టం కలిగే విధంగా ఎట్టి పరిస్థితిలోనూ ప్రవర్తించకూడదు. దైవం మనందరికీ తల్లిదండ్రుల సేవ చేసి, వారి ప్రేమ ఆశీర్వాదాలు పొంది తన కృపకు పాత్రులయ్యే భాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం.
– యండి. ఉస్మాన్ ఖాన్