విలువలతోనే సార్థకత | Rujumargam - 10.04.2015 | Sakshi
Sakshi News home page

విలువలతోనే సార్థకత

Published Fri, Apr 10 2015 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM

విలువలతోనే సార్థకత

విలువలతోనే సార్థకత

 రుజుమార్గం
 
 గతంతో పోల్చుకుంటే ఈనాడు మానవుడు బాగా అభివృద్ధి సాధించాడు. ఆధునిక పరిజ్ఞానాన్ని ఔపోసన పట్టి, అనేక నూతన ఆవిష్కరణలకు నాంది పలికాడు. ఎన్నో కొత్త విషయాలు కనిపెడుతూ, భౌతికంగా ఎం తో ప్రగతి సాధించాడు. అయినా నైతికంగా, విలువల పరంగా తిరోగమనంలోనే ఉన్నాడన్నది జీర్ణించుకో లేని వాస్తవం.

 పైకి ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ ఈనా డు మానవ సమాజం ఎంతగానో దిగజారి పోయింది. ఏ రంగంలోనూ నైతికత, విలువలు కనిపించడం లేదు. కుటుంబం, సమాజం, విద్యా, ఉద్యోగం, వ్యాపా రం, ఆర్థికం, ఆధ్యాత్మికం, రాజకీయం, ఇలా అన్ని రంగాలూ కలుషితమై పోయాయి. కుటుంబ వ్యవస్థను గమనిస్తే గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే, మాన వ సమాజ సౌధానికి కుటుంబమే మూలస్తంభం. ఆలు మగల అనుబంధంతో కుటుంబం ఏర్పడి కౌటుంబిక వ్యవస్థ పునాదులను పటిష్టం చేస్తుంది. కాని ఈనాడు ఆలుమగల మధ్య ప్రారంభమయ్యే అనుబంధ లేమి కుటుంబ వ్యవస్థ పునాదులను బలహీనపరుస్తోంది. బంధాలు, అనుబంధాలు అపహాస్యం పాలవుతు న్నాయి. ఈ విధంగా కుటుంబంలో, సమాజంలో ఆత్మీ య, మానవీయ విలువలు మృగ్యమైపోతున్నాయి.

 ఇక విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోనూ నీతినిజాయితీ, విశ్వస నీయత లోపించాయి. తమ విద్యుక్త ధర్మాలను ఏ ఒక్కరూ నిర్వర్తించడం లేదు.అందిన కాడికి దండుకోవడమే తెలివైన పనిగా పరిగణించే దుస్థితి దాపురించింది. ఈ రంగాల్లోని ఎక్కువ మందికి ఈ సూత్రం వర్తిస్తుంది. ఏదో ఒకటి చేసి సంపాదించడమే నీతి అయిపోయింది. ఇక రాజకీయాల సంగతి సరేసరి. బాధ్యత, జవాబు దారీతనం మచ్చుకైనా కనిపించవు. ప్రజాసేవ అనేది ప్రజల్ని మోసం చేయడానికి వాడే పదం మాత్రమే.

 ఇదీ... నైతికత, ఆధ్యాత్మికతలను పక్కన పెట్టి ఆధునికత, భౌతికత సాధించిన ప్రగతి. కాబట్టి ఈ దుస్థితి దూరం కావాలంటే, దైవం నిర్దేశించిన జీవన విధానాన్ని అవలంబించాలి. ఆయన ఏర్పరచిన కార్యాచరణ పరిధుల్ని అతిక్రమించకుండా నిర్దేశిత హద్దులో్ల జీవితం గడపాలి. ఇష్టానుసారంగా వ్యవహ రిస్తే, ఈ ప్రపంచంలో ఎవరూ అడిగేవారు లేకపో యినా దైవం మాత్రం వదిలి పెట్టడని, తప్పకుండా ప్రశ్ని స్తాడని విశ్వసించాలి.

 మానవుడు పుట్టింది మొదలు మరణించేవరకు జీవితంలోని అన్ని దశల్లో, అన్ని రంగాల్లో అల్లాహ్ మానవుడికి మార్గదర్శకం అందించాడు. ముహమ్మద్ (స)ను యావత్ మానవాళికి ఆచరణాత్మక నమూనా గా ప్రభవింపజేశాడు. కనుక ప్రవక్త మార్గదర్శకంలో నడుచుకుంటే జీవితంలోని అన్నిరంగాల్లో విలువలు తొణికిసలాడతాయి. అవినీతి, అన్యాయం, ఐనైతికత లాంటి అనేక దుర్మార్గాలు అంతమైపోతాయి. మానవీ య విలువలతో కూడిన సత్సమాజం ఉనికిలోకొస్తుం ది. దైవం సమస్త మానవాళికీ విలువలతో కూడిన జీవి తం గడిపే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.
 యండి.ఉస్మాన్ ఖాన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement