ఉత్తమ విద్య
రుజు మార్గం
విద్య విలువైన భూషణం, అమూల్యమైన వరం. మానవుడికి ఎన్ని ఉన్నా విద్య లేకపోతే అన్నీ వ్యర్థం. విద్య లేని వాడు వింత పశువు అన్న నానుడి మనకు తెలిసిందే. అందుకే విద్య, విజ్ఞానాలకు పెద్ద పీట వేసింది దైవధర్మం. దైవవాణి అయిన పవిత్ర ఖురాన్ అవతరణ ‘ఇఖ్ రా’ అంటే, ‘చదువు’ అన్న వాక్యంతో ప్రారంభమైంది. విద్యాభ్యాసం స్త్రీ, పురుషులందరికీ విధి అన్నారు ముహమ్మద్ ప్రవక్త(స). విద్యార్జన నిమిత్తం, విజ్ఞాన అన్వేషణలో ఎంత దూరమైనా వెళ్లండి, భూమి చివరి అంచుల వరకైనా వెళ్లండి అని ప్రోత్సహించారు. జ్ఞానం జీవితం, అజ్ఞానం మరణం అన్నారాయన. ఈ వాక్యాలూ, ప్రవచనాల ద్వారా విద్య విజ్ఞానాలకు ఎంత ప్రాముఖ్యం ఉందో మనం అంచనా వేయవచ్చు.
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త(స) మదీనాలో మసీదు ముందు నుండి వెళుతున్నారు. అప్పుడక్కడ పక్కపక్కనే రెండు సమావేశాలు జరుగుతున్నాయి. ప్రవక్త అది చూసి, ‘ఇవి రెండూ మంచి సమావేశాలే. ఇరు సమావేశాల్లోని వారూ చాలా మంచి పనే చేస్తున్నారు. కాని ఒకరు చేస్తున్న దాని కంటే, మరొకరు చేస్తున్నది ఇంకా మంచి పని. ఒక సమావేశంలోని వారు దైవధ్యానంలో, దైవారాధనలో నిమగ్నమై ఉన్నారు. క్షణకాలం కూడా వృథా చేయకుండా దైవాన్ని స్మరిస్తున్నారు.
మరో సమావేశంలోని వారు విద్యా బోధ చేస్తున్నారు. ప్రజలకు మంచీచెడుల విచక్షణ నేర్పుతున్నారు. కనుక మొదటి వారు చేస్తున్న దానికంటే వీరు చేస్తున్న పని చాలా గొప్పది, ఉత్తమమైనది. నేను కూడా బోధకుడిగానే వచ్చాను’ అని చెబుతూ, ఆయన కూడా విద్యాబోధన సమావేశంలోనే కూర్చున్నారు.
ఒక సందర్భంలో ప్రవక్త... గురువు లేదా బోధకుడి ప్రాముఖ్యతను చెబుతూ, ప్రజలకు మంచిని బోధించి, విద్యాగంధాన్ని పంచేవాడి కోసం దైవ దూతలతో సహా భూమ్యాకాశాలలో ఉన్న సమస్త సృష్టిరాసులు - చివరికి రంధ్రాల్లో నివసించే చీమలు, సముద్ర గర్భాల్లో ఉండే చేపలు, ఇతర జలచరాలన్నీ ప్రార్థిస్తాయని సెలవిచ్చారు. కనుక విద్యా విజ్ఞానాల ప్రాముఖ్యతను తెలుసుకొని, నైతిక, మానవీయ, ప్రేమామృత విలువలు వికసింపజేసే విద్యను ఆర్జించడానికి, తమ సంతానానికి అలాంటి ఉత్తమ విద్యను అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
తల్లిదండ్రులు తమ సంతానానికి ఇచ్చే కానుకలన్నిటిలో ఉత్తమ విద్యకు మించిన కానుక మరొకటి లేదని ముహమ్మద్ ప్రవక్త(స) సూచించారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, వ్యాపార దృక్ప థంతో కూడిన ప్రాపంచిక విద్య ఈనాడు మన సమా జాన్ని కలుషితం చేస్తున్న స్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి, ప్రాపంచిక విద్యతోపాటు, నైతిక, మానవీయ విలువలు బోధించే విద్య ఈ తరానికి నేర్పించాల్సిన అవసరం ఉంది. విద్యా ప్రవీణులు, ధార్మిక విద్వాం సులు ఈ దిశగా ఆలోచిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
ఎం.డి.ఉస్మాన్‌ఖాన్