ప్రతీకాత్మక చిత్రం
ముస్లిం సమాజం జరుపుకునే రెండు ముఖ్యమైన పండుగల్లో ఈదుల్ ఫిత్ర్ అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో ముస్లింలు ఎంతో నియమనిష్టలతో రోజా వ్రతం పాటిస్తారు. భక్తిశ్రధ్ధలతో రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. పవిత్ర ఖురాన్ గ్రంధాన్ని భక్తితో పారాయణం చేస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స) వారిపై సలాములు పంపుతూ ఉంటారు. ప్రతిరోజూ తరావీహ్ నమాజులో పాల్గొని తన్మయులవుతుం టారు. దానధర్మాలు చేస్తారు, ఫిత్రాలు చెల్లిస్తారు. ఈ విధంగా రమజాన్ చంద్రవంక దర్శనంతో ప్రారంభమైన ఉపవాస దీక్షలు నెలరోజుల తరువాత షవ్వాల్ మాసం నెలవంక దర్శనంతో సమాప్తమవుతాయి.
షవ్వాల్ మొదటి తేదీన జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినాన్నే మనం రమజాన్ పండుగ అంటున్నాము. రమజాన్ ఉపవాసదీక్షలు, పవిత్ర ఖురాన్ అవతరణతో దీని సంబంధం పెనవేసుకుపోయిఉంది. మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాన్ని, మానవీయ విలువల్ని జనింపజేయడానికి సృష్టికర్త ఉపవాస వ్రతాన్ని విధిగా నిర్ణయించాడు. రమజాన్ ఉపవాసవ్రతం మనిషిని ఒక క్రమశిక్షణాయుత జీవనవిధానానికి, బాధ్యతాయుతమైన జీవనవిధానానికి, దైవభక్తి పరాయణతతో కూడుకున్న జీవన విధానానికి అలవాటుచేస్తుంది.
మానవుల్లో మహోన్నత విలువలను, సుగుణాలను జనింపజేసే వ్రతాన్ని పరాత్పరుడైన అల్లాహ్ వారికి అనుగ్రహించినందుకు, వాటిని వారు నెలరోజులూ మనోవాక్కాయ కర్మల ద్వారా త్రికరణశుధ్ధిగా పాటించ గలిగినందుకు సంతోష సంబరాల్లో తేలిపోతూ కృతజ్ఞతా పూర్వకంగా భక్తిశ్రధ్ధలతో పండుగ జరుపుకుంటారు. ఈ విధంగా రమజాన్ నెల ఆరంభం నుండి అంతం వరకు ఒక క్రమ పద్ధతిలో ధర్మం చూపిన బాటలో నడుస్తూ, దైవప్రసన్నత, పుణ్యఫలాపేక్షతో గడిపినవారు ధన్యులు. అందుకే ‘ఈద్’ (పండుగ)ను శ్రామికుని వేతనం (ప్రతిఫలం) లభించే రోజు అంటారు.
ఆ రోజు ముస్లిములందరూ ఈద్ నమాజ్ ముగించుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారుచేసిన సేమియా పాయసాన్ని తమ హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు సోదరులందరికీ ఆప్యాయంగా రుచిచూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు. ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుంటారు. ఈ విధంగా రమజాన్ పర్వదినం మనిషిని ఉన్నత మానవీయ విలువలు కలవాడుగా తీర్చిదిద్ది, సమాజంలో శాంతి, సమానత్వం, సామరస్యం, సోదర ‡భావాలకు పునాది వేస్తుంది. ప్రేమ తత్వాన్ని ప్రోది చేస్తుంది. ఇదీ ఈదుల్ ఫిత్ర్ – రమజాన్ పర్వదిన పరమార్థం.
– యండి.ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment