మచిలీపట్నం, న్యూస్‌లైన్ : మొహర్రం సందర్భంగా మహ్మద్ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్, ఆయన 72 మంది అనుచరులు దర్మ యుద్ధంచేసి ప్రాణత్యాగం చేసిన వైనాన్ని స్మరిస్తూ ముస్లింలు బందరు కోనేరుసెంటరులో శుక్రవారం రక్తం చిందించారు. యా హుస్సేన్... యా ఆలీ అంటూ నినాదాలు చేశారు. వేళ్ల మధ్య బ్లేడ్‌లు పెట్టుకుని చెస్ట్‌బీట్ నిర్వహించారు. బందరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచీ ముస్లింలు తరలివచ్చారు.
తొలుత గిరియోహజరత్‌హజ్జత్ (చిన్నపార్టీ) సభ్యులు చింతచెట్టు సెంటరులోని సాహెబ్ పంజా నుంచి రాజుపేట మీదుగా కోనేరుసెంటరు వరకు జుల్‌జనా (ర్యాలీ) నిర్వహించారు. కోనేరుసెంటరులో అబేద్ మౌలానా ఆధ్వర్యంలో నమాజ్ చేశారు. చిన్నపార్టీ కోనేరుసెంటరును వీడిన అనంతరం ఇనగుదురుపేటలోని బారేమాం పంజా నుంచి గిరియోహజరత్‌హజ్జత్ (పెద్దపార్టీ) సభ్యులు జవ్వారుపేట, బుట్టాయిపేట, వల్లూరిరాజా సెంటరు మీదుగా కోనేరుసెంటరుకు వచ్చి జుల్‌జనా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన మతభోధకులు కర్బలా మైదానంలో ఇమామ్ హుస్సేన్, ఆయన 72 మంది అనుచరులు ధర్మయుద్ధం చేసిన తీరును వివరించారు.
అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చెస్ట్‌బీటింగ్ జరిగింది. చిన్నారులకు సైతం నొసటిపై కత్తిగాటుపెట్టి రక్త తర్పణం చేయించారు. పవిత్ర యుద్ధంలో మరణించిన ఇమాం హుస్సేన్ మృతదేహం తీసుకువచ్చేందుకు ఆయన కుమార్తె బీసకీనా శవపేటికను అలంకరించి తీసుకువెళ్లడాన్ని గుర్తు చేస్తూ యువతులు, చిన్నారులు శవపేటికను తయారు చేసి ఊరేగింపుగా కోనేరు సెంటరు వరకు మోసుకువచ్చారు. ఇమాం హుస్సేన్ మరణానంతరం అలనాటి యుద్ధ వాతావరణంను గుర్తుకు తెస్తూ గుర్రాలపై వస్త్రాలను, కత్తులను ప్రత్యేకంగా అలంకరించి (జుల్‌జనా)ఊరేగింపు నిర్వహించారు.
పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి పీర్లను ఊరేగింపుగా కోనేరుసెంటరుకు తీసుకువచ్చి మళ్లీ వాటిని ర్యాలీగా తీసుకువెళ్లి పంజాల వద్ద ప్రతిష్టించారు. చెస్ట్‌బీటింగ్ కార్యక్రమం నేపథ్యంలో కోనేరుసెంటరులో ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేశారు. వైఎస్సార్ సీపీ బందరు నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రమయ్య (నాని), పట్టణ కన్వీనరు షేక్‌సలార్‌దాదా, ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మాదివాడ రాము, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొల్లు రవీంద్ర, పట్టణ అధ్యక్షుడు మోటమర్రి వెంకటబాబాప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పీర్లకు దట్టీ సమర్పించారు. అప్సర బాదంపాలు వారి ఆధ్వర్యంలో భోజనం, పాతిమా డ్రస్సెస్ ఆధ్వర్యంలో మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ కె.వి.శ్రీనివాసరావు, సీఐలు అప్పలస్వామి, కె వెంకటేశ్వరరావు, పట్టణ సీఐ మూర్తి, ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, సిబ్బంది శాంతిభద్రతలను పర్యవేక్షించారు.
అమర వీరులకు ముస్లింల రుధిర నివాళి
Published Sat, Nov 16 2013 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
Advertisement
Advertisement