కన్ను పడితే కాసులే..
- కూకట్పల్లి పరిధిలో ఇమాన్యుయేల్ అక్రమాలు
- ప్రముఖుల అండతో వసూళ్లు
కూకట్పల్లి : ఆయన కన్ను పడిందంటే వందలు, వేలు కాదు.. ఏకంగా లక్షల్లోనే బేరసారాలు.. లేదంటే అక్కడి వారి కలల సౌధం కాస్తా కల్లే.. ఇక అక్రమ నిర్మాణం వెలుస్తుందంటే ఆయనకు పంట పండినట్లే. అక్రమ నిర్మాణాల్లో ఏకంగా భాగస్వామి అయ్యేందుకు కూడా వెనుకాడడంటే ఆయన అవినీతి ఎంటో అర్థమవుతుంది. కూకట్పల్లి సర్కిల్ పరిధిలో టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్గా పనిచేసే ఇమాన్యుయేల్ బాగోతం చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. ఏసీబీ సోమవారం ఏకకాలంలో చేపట్టిన దాడుల్లో కళ్లుతిరిగే ఆస్తులు వెలుగుచూశాయి. ఒక్క కూకట్పల్లి మున్సిపాలిటీనే ఏళ్ల తరబడి అంటిపెట్టుకుని పెద్దమొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ దాడుల ద్వారా తేటతెల్లమవుతోంది.
సర్కిల్ మొత్తం చుట్టేసి...
కూకట్పల్లి సర్కిల్లో మొదట మోతీనగర్ సెక్షన్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇమాన్యుయేల్ ఆ ప్రాంతంలో లెక్కకు మిక్కిలిగా జరిగిన నిర్మాణదారులు ఆయనకు కాసుల రుచిని చూపించారు. ఆ సమయంలోనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఉన్నతాధికారులు బదిలీ వేటు వేయగా 24 గంటల్లోనే తనకున్న రాజకీయ, సామాజిక పలుకుబడితో బదిలీని నిలిపివేయించుకున్నారు.
ఈ విధంగా మూడు పర్యాయాలు అతడిపై వచ్చిన ఆరోపణలతో బదిలీ చేయాలని ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నప్పుడల్లా పైస్థాయిలో పైరవీలు చేయించుకున్నాడు. మోతీనగర్ నుంచి మూసాపేట్, ఆ తరువాత కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, వివేకానందనగర్‌కాలనీ డివిజన్లలో ఆయన అవినీతి ప్రస్థానం కొనసాగింది. అతడికున్న రాజకీయ పలుకుబడితో కింది స్థాయి సిబ్బందిని మార్చడమే కాకుండా పైస్థాయి అధికారులను సైతం తన సామాజిక అస్త్రంతో బెదిరింపులకు పాల్పడ్డాడన్న వార్తలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా చిన్న చిన్న ఇంటి నిర్మాణాలు చేపట్టాలనుకునేవారు అతడి చుట్టూ నెలల తరబడి చక్కర్లు కొట్టక తప్పని పరిస్థితి. పెద్ద మొత్తంలో కాసులు కురిపించే అక్రమ నిర్మాణదారులకు మాత్రం తివాచీ పరచడం తనకు తానే సాటి.
దందాలన్నీ బయటనే...
చిన్న చిన్న నిర్మాణాలు చేసుకునేవారు అనుమతుల కోసం సర్కిల్ కార్యాలయానికి వెళితే.. కంటికి కూడా కనిపించని పరిస్థితులు ఉండేవి. బడా నిర్మాణదారులతో మంతనాలు జరుపుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడూ కార్యాలయంలో దొరకకుండా బయటనే తన దందాలన్నీ సాగిస్తాడనేది సమాచారం. ఇదిలా ఉంటే నిర్మాణదారులు ముందుగా తనను కలిసిన తరువాతనే ఏ పనైనా చేయాలని డాక్యుమెంట్ రైటర్లకు సైతం హుకుం జారీ చేస్తారు. లేదంటే లెసైన్స్ రద్ధవుతుందన్న భయభ్రాంతులకు గురిచేసేవాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వేచి చూసి....ఆపై రంగంలోకి...
ఎవరైనా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ముందుగా తెలిసినప్పటికీ నిర్మాణ ప్రారంభ సమయంలో అటువైపు కన్నెత్తి కూడా చూడరు. నిర్మాణం కాస్తా పైకి లేచినప్పుడు రంగంలోకి దిగి కూల్చివేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతుంటాడు. . గతంలో ఇంటి నిర్మాణదారులకు బెదిరింపులకు పాల్పడిన సంఘటనల్లో ఇమానుయేల్పై పోలీస్‌స్టేషన్ వరకు ఫిర్యాదులు వెళ్లడం గమనార్హం.