రిలయన్స్ చేతికి ఐఎమ్జీ–ఆర్
న్యూఢిల్లీ: స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఫ్యాషన్ ఈవెంట్లను నిర్వహించే ఐఎమ్జీ–రిలయన్స్ లిమిటెడ్(ఐఎమ్జీ–ఆర్)లో ఐఎమ్జీ వరల్డ్‌వైడ్ కంపెనీకి ఉన్న 50 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయనున్నది. ఈ వాటా కొనుగోలు కోసం రూ.52.08 కోట్లు అంతా నగదు రూపంలోనే వెచ్చించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. డీల్‌లో భాగంగా ఐఎమ్జీ–ఆర్‌లో ఐఎమ్జీ సింగపూర్ పీటీఈ లిమిటెడ్‌కు షేర్లను కొనుగోలు చేయనున్నామని, ఈ మేరకు ఒక నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని వివరంచింది. ఈ డీల్ పూర్తయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పూర్తి అనుబంధ సంస్థగా ఐఎమ్జీ–ఆర్ మారుతుందని, దానిని రీబ్రాండ్ చేస్తామని తెలిపింది. ఈ డీల్‌కు ప్రభుత్వ, నియంత్రణ సంస్థల ఆమోదాలు అవసరం లేదని ఈ ఏడాదిలోనే ఈ డీల్ పూర్తవ్వగలదని పేర్కొంది.
2010లో ఏర్పాటు: ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మార్కెటింగ్, మేనేజ్మెంట్ కంపెనీ అయిన ఐఎమ్జీ వరల్డ్‌వైడ్ కంపెనీతో కలిసి రిలయన్స్ ఒక జాయింట్ వెంచర్‌ను 2010లో ఏర్పాటు చేసింది. ఐఎమ్జీ–రిలయన్స్ లిమిటెడ్(ఐఎమ్జీ–ఆర్) పేరుతో సమాన భాగస్వామ్యాలతో ఈ జేవీ ఏర్పాటైంది. భారత్‌లో స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఫ్యాషన్ ఈవెంట్స్‌ల అభివృద్ధి. మార్కెటింగ్, నిర్వహణ కోసం ఈ జేవీని ప్రారంభించారు.