మహిళను తన్నిన ఎంపీపీ గోపీ అరెస్టు!
సాక్షి, నిజామాబాద్: మహిళను కాలితో తన్ని అవమానించిన దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపీని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మహిళపై అనుచితంగా ప్రవర్తించి దాడి చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. భూతగాదాల విషయమై గొడవ జరగడంతో ఎంపీపీ ఇమ్మడి గోపీ దౌర్జన్యపూరితంగా వ్యవహరించాడు. మహిళ చెప్పుతో కొట్టడంతో విచక్షణ కోల్పోయిన అతను.. ఆమెను కడుపులో తన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇందల్ వాయి మండలం గౌరారంకు చెందిన ఒడ్డె రాజవ్వ దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపి వద్ద వ్యవసాయ భూమి, అందులోని మరో ఇంటిని కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అదనంగా నగదు ఇవ్వాలని ఇమ్మడి గోపి డిమాండ్ చేస్తున్నారని రాజవ్వ ఆరోపించారు.
ఈ మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఇందల్ వాయిలో నివాసం ఉంటున్న ఎంపీపీ గోపి ఇంటి వద్దకు వచ్చి గొడవకు దిగారు. అమ్మిన ఇంటిని అప్పగించకుండా, తాళాలు వేసి తమకు ఇవ్వకపోవడం బాధిత రాజవ్వకు ఆగ్రహం తెప్పించింది. మాటామాటా పెరిగి ఆగ్రహంతో బాధిత మహిళ రాజవ్వ, ఎంపీపీ గోపిపై చెప్పుతో దాడి చేశారు. వరండాపైన ఉన్న గోపి కింద ఉన్న రాజవ్వను గట్టిగా కాలితో తన్నాడు. దీంతో మహిళ కింద పడిపోయారు. పక్కనే ఉన్న రాజవ్వ బంధువు గోపిని అడ్డుకున్నారు.
బాధిత మహిళ రాజవ్వ వివరాల ప్రకారం.. ‘ఇందల్ వాయి వద్ద జాతీయ రహదారి పక్కనే గోపికి చెందిన 1125 గజాల స్థలం, అందులోని ఇల్లు కూడా 50 లక్షలకు ఇస్తాను అని చెప్తే 33 లక్షల 72 వేలకు ఒప్పందం కుదిరింది. డబ్బు మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యాక 11 నెలలుగా ఇల్లు వ్యవసాయ భూమి ఖాళీ చేయలేదు. ఎంపీపీ గోపి అదనంగా డబ్బులు చెల్లించాలని గోపి డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు చేసిన ఇంటికి వచ్చి ఇంట్లోని సామానును గోపి బయట పడేశారు. పోలీసులు అక్కడే ఉన్నా ప్రేక్షక పాత్ర పోషించడం విమర్శలకు దారి తీస్తోంది. మాజీ నక్సలైట్ ను అని తమతో పెట్టుకోవద్దని గోపి బెదిరిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. మా కొడుకులకు ఏం జరిగినా ఎంపీపీదే బాధ్యత. ఎస్సై, సీఐ, సీపీ, కలెక్టర్, ఎమ్మెల్యేలను కలిసి సమస్య చెప్పుకుంటే డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారు కనుక, అదే ఇంట్లో ఉండాలని చెప్పారు. కానీ మాకు అన్యాయమే జరిగిందంటూ’ ఆవేదన వ్యక్తం చేశారు.