imo
-
లాక్టిక్ యాసిడ్ ద్రావణాల తయారీ ఇలా
ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు ఉపయోగించకుండా ప్రకృతిలో అందుబాటులో ఉన్న వనరులతో పంటలకు అవసరమైన పోషకాలను తయారు చేసి అందించే విధానమే డాక్టర్ చోహన్‌క్యు పద్ధతి. ఆయన వద్ద శిక్షణ పొందిన రోహిణీరెడ్డి సూచనలను అనంతపురంరైతులు పాటిస్తున్నారు. ఈ విధానంలో లాక్టిక్ ఆసిడ్ బ్యాక్టీరియా(ల్యాబ్), దేశీయ సూక్ష్మజీవులు (ఇండిజినిస్ మైక్రో ఆర్గానిజమ్స్ –ఐఎంవోలు) సహా పలు రకాల ద్రావణాలను పంటల సాగులో వాడతారు. వీటి వినియోగం వల్ల నేల ఆరోగ్యంగా ఉండి మొక్క ఎదుగుదల బావుంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మొక్క చీడపీడలను, తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ల్యాబ్ తయారీ పద్ధతి కిలో బియ్యంలో లీటరు నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి. ఆ నీళ్లను ప్లాస్టిక్ పాత్ర / బిందెలో నిల్వ ఉంచి పైన గుడ్డకప్పాలి. ఐదో రోజు 3 లీటర్ల పచ్చి పాలు కలపాలి. ఈ ద్రావణాన్ని ఐదు రోజులు పులియబెడితే పైన మీగడ తెట్టులా పొర కడుతుంది. దానిని తొలగించి చూస్తే.. ద్రావణం లేత పసుపు రంగులో ఉంటుంది. దీన్ని ఆ వెంటనే వాడుకోవచ్చు.æ కిలో బెల్లం కలుపుకుంటే 15–20 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఐఎంవో తయారీ.. పంటలకు మేలు చేసే పలు రకాల సూక్ష్మజీవులు వాతావరణంలో ఉంటాయి. వీటిని భూమిలోకి చేర్చి పంటలకు మేలు చేసేందుకు ఐఎంవో ఉపయోగపడుతుంది. ఒక చెక్కపెట్టెను తీసుకొని మూడొంతుల అన్నంతో నింపి మూతపెట్టాలి. అన్నం పొడిపొడిలాడుతూ ఉండాలి. లోపలికి గాలి చొరబడకుండా చెక్కపెట్టె చుట్టూ తెల్ల కాగితంతో చుట్టాలి. చెట్టు నీడ కింద గుంతను తవ్వి చెక్కపెట్టెను పూడ్చాలి. చెక్కపెట్టెలో అన్నం నింపిన భాగం భూమట్టానికి సమానంగానూ.. ఖాళీ ప్రదేశాన్ని భూమి మట్టం నుంచి పైకి ఉంచి గుంతలో పూడ్చాలి. చల్లటి వాతావరణం ఉండేందుకు బాగా చెట్లు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. 4 రోజులకు చెక్కపెట్టెలోని అన్నంపైన బూజు వస్తుంది. పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు ఆశిస్తే బూజు తెలుపు రంగులో ఉంటుంది. దీన్ని వెంటనే పంటలకు వేసుకోవచ్చు. నిల్వ ఉంచుకొని వాడుకోవాలంటే.. కిలో బెల్లం కలుపుకుంటే చాలు. అయితే నలుపు రంగు బూజు వస్తే.. అది పంటలకు పనికిరాదు. మళ్లీ తయారు చేసుకొనివేరే ప్రదేశంలో చెక్కపెట్టెను పూడ్చాలి. వాడుకునే విధానం ల్యాబ్, ఐఎంఓ రెంటినీ భూసారాన్ని పెంచుకోవడానికి ఎరువుగా వేసుకోవచ్చు. లేదా మొక్కలపై పిచికారీ చేయవచ్చు. డ్రిప్పు ద్వారానూ అందించవచ్చు. ముందుగా 200 లీటర్ల డ్రమ్ము తీసుకొని 100 లీటర్ల నీరు పోసి కిలో ఐఎంవో లేదా కిలో ల్యాబ్‌ను కలపాలి. సిద్ధం చేసుకున్న పశువుల ఎరువులో ఈ ద్రావణాన్ని కలిపి పొలంలో చల్లుకోవాలి. లేదా లీటరుకు 2 మి. లీ. (ఇంత తక్కువ మోతాదులో కూడా చక్కగా పనిచేస్తుంది) చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేసుకోవచ్చు. వీటిని 20 రోజుల దశ నుంచి ప్రతి 10 రోజులకోసారి భూమిలో వేసుకోవటం లేదా పిచికారీ చేయాలి. కినోవాలో అయితే పంటకాలంలో ఆరుసార్లు పిచికారీ చేయాలి. ఆకుల ద్రావణాలు, పండ్ల రసాల తయారీ కినోవా సాగులో పోషకాలను అందించేందుకు వివిధ రకాల పండ్లు, ఆకులతో చేసిన రసాలను వాడారు. అల్లం, వెల్లుల్లి, చేప, అరటి బోదె. ఆకులు, మాగిన పండ్లు, పొగాకు, మల్బరీ ఆకు, కంది కట్టెను కాల్చగా వచ్చిన బొగ్గు, కోడిగుడ్డు పెంకులు, వివిధ రకాల ఎముకలతో విడివిడిగా ద్రావణాలు తయారు చేస్తారు. నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి ప్రధాన పోషకాలతో పాటు ఇతర సూక్ష్మపోషకాలు ఈ ద్రావణాల్లో ఉంటాయి. 100 లీటర్ల నీటిలో ఈ ద్రావణాలన్నింటిని కలుపుకోవాలి. ఒక్కో ద్రావణాన్ని లీటరు నీటికి 2 నుంచి 3 మి. లీ. చొప్పున కలుపుకుంటే చాలు. ప్రతి పది రోజులకోసారి పంటలపై పిచికారీ చేసుకోవాలి. అన్ని రకాల పంటలపైనా వీటిని పిచికారీ చేసుకోవచ్చు. చీడపీడల నివారణకు దశపత్ర కషాయం, వేపనూనె, చౌమంత్ర (వేప, జిల్లేడు, ఆముదం, సీతాఫలం తదితర 5 రకాల ఆకుల కషాయం)ను వాడుతున్నారు. -
నవంబర్‌లో ఐఎంఏ ఏపీ కాన్–2016
అమలాపురం టౌన్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఏటా రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట రాష్ట్ర స్థాయిలో వైద్యుల సదస్సు నిర్వహిస్తుంది. అయితే రాష్ట్రం విడిపోయి, నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక తొలి సదస్సును కోనసీమలో ఏర్పాటు చేసేందుకు ఐఎంఏ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. కోనసీమ ఐఎంఏ శాఖ ఈ సదస్సును నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. నవంబర్ 19, 20 తేదీల్లో అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాలలో ఐఎంఏ ఏపీ కాన్ –2016 పేరిట నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు వెయ్యి మంది వైద్యులు పాల్గొనే ఈ నవ్యాంధ్ర రాష్ట్ర వైద్యుల తొలి సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు కోనసీమ ఐఎంఏ శాఖ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గంధం రామం, డాక్టర్ పి.సురేష్‌బాబు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వేదికగా ఇంతకాలం పనిచేసిన రాష్ట్ర ఐఎంఏ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇటీవలే ఏపీ శాఖగా విడిపోయి విజయవాడలో కేంద్ర కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుందన్నారు. వైద్యరంగంలో వస్తున్న ఆధునాతన సాంకేతిక వైద్య ప్రక్రియలపై, ప్రాణాంతక వ్యాధులకు సంబంధించి జరుగుతున్న పరిశోధనలపై సదస్సు చర్చిస్తుందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వైద్యులకు కోనసీమ రుచులను చవి చూపించేలా, ఈ ప్రాంత అందాలను చూపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సీమ సంప్రదాయాలతో వినోద కార్యక్రమాలను నిర్వహిస్తామని, ఈ సీమలోని ప్రసిద్ధ దేవాలయాల దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఐఎంఏ ఏపీ కాన్–2016 బ్రోచర్ (ఆహ్వాన పత్రిక)ను కూడా కోనసీమలోని విశిష్ట ఆలయాలు, అందాలు, వంటకాల చిత్రాలతో ఆకర్షణీయంగా రూపొందించామని తెలిపారు. రాష్ట్ర ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ జీఎస్ మూర్తి, డాక్టర్ ఎంఏ రెహమాన్ సూచనలతో ఏర్పాట్లు చేస్తూ వైద్యులకు ఆహ్వానాలు పంపిస్తున్నామని చెప్పారు. -
మనీ ఆర్డర్... మరి రాదు
టెలిగ్రామ్ బాటలోనే ఎంఓ సేవలకు స్వస్తి సెలైంట్‌గా నిలిపేసిన తపాలా శాఖ ఎలక్ట్రానిక్ వైపు మొగ్గు చూపుతుండటమే కారణం ఎక్కడో చదువుకునే పిల్లలు... ఉద్యోగం కోసం పిల్లల్ని దూరంగా పంపి సొంత ఊళ్లో కాలం వెళ్లదీసే తల్లిదండ్రులు. వీళ్లందరి కళ్లలో సంతోషాన్నిచ్చే నేస్తం ‘మనీ ఆర్డర్’. ఈ మనీ ఆర్డర్‌ను ఆధారం చేసుకుని పుట్టిన కథలు, సినిమాలకు లెక్కేలేదు. మనీ ఆర్డర్ రాక మారిపోయిన జీవితాలకూ అంతులేదు. అలాంటి మనీ ఆర్డర్... టెక్నాలజీ విప్లవానికి బలిపశువైపోయింది. రెండు నిమిషాల్లో ఆన్లైన్లోనే డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం... బ్యాంకు ఖాతా లేకపోయినా చేతిలో ఫోనుంటే ఒకరి డబ్బు మరొకరికి బదలాయించే వెసులుబాటు... బ్యాంకుకెళ్లి నేరుగా ఎవరి ఖాతాలోనైనా డిపాజిట్ చేసే సౌకర్యం... ఇవన్నీ కలిసి మనీ ఆర్డర్‌ను మట్టికరిపించేశాయి. అందుకే... ఇక దీని అవసరం లేదని భావించిన పోస్టల్ విభాగం... చడీచప్పుడూ లేకుండా దీనికి తెరదించేసింది. అంటే... మొన్నటికి మొన్న ఆగిపోయిన టెలిగ్రామ్ సరసన మరో తపాలా నేస్తం చేరిపోయింది. ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్లే (ఈఎంవో), ఇన్స్టంట్ మనీ ఆర్డర్ల (ఐఎంవో) లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో సంప్రదాయ ఎంవో సర్వీసులను నిలిపివేశామన్నది ఇండియా పోస్ట్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ (ఫైనాన్స్) శిఖా మాథుర్ కుమార్ మాట. శతాబ్దం పైగా చరిత్ర.. మనీ ఆర్డర్ది 135 ఏళ్ల చరిత్ర. తపాలా శాఖ సమాచారం ప్రకారం 1880లో మనీ ఆర్డర్ వ్యవస్థను ట్రెజరీ విభాగం నుంచి పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్కు బదలాయించారు. అప్పట్లో అలహాబాద్‌లో పోస్ట్‌మాస్టర్ జనరల్‌గా పనిచేసిన రాయ్ సాలిగ్రామ్ బహదూర్ హయాంలో ఇది జరిగింది. ఆ హోదాలో నియమితులైన తొలి భారతీయుడు ఆయనే. అప్పట్లో కేవలం 283 లావాదేవీలకు పరిమితం అయిన మనీ ఆర్డర్లు 1980లో వందేళ్లు పూర్తి చేసుకునే నాటికి 10.8 కోట్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్, ఇన్స్టంట్ మనీ ఆర్డర్లను ప్రవేశపెట్టాక 9.5 కోట్లకు తగ్గాయి. ఇప్పుడు మరింతగా పడిపోయాయి. ఆనాటి జ్ఞాపకాలు.. మనీ ఆర్డర్లను పోస్టల్ శాఖ నిలిపేయటంతో వాటితో అనుబంధంపై కొందరు సీనియర్ సిటిజన్లు స్పందిస్తూ... శ్రీకాకుళం జిల్లాలోని చిన్న గ్రామం మాది. అక్కడుండే మా కుటుంబానికి డబ్బు పంపాలంటే అప్పట్లో మనీ ఆర్డర్ తప్ప గత్యంతరం లేదు. ఇంట్లో వాళ్లంతా మనీ ఆర్డర్ కోసం ఎదురు చూస్తారన్న సంగతి తెలిసి నేను ప్రతినెలా ఎన్ని పనులున్నా 4వ తేదీకల్లా ఎంఓ చేసేసేవాణ్ణి... అంటూ గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం ముం బైలో సెటిల్ అయిన గోపాల రావు. ‘చాలా మందికి రెండేసి బ్యాంకు ఖాతాలుంటున్నా యి. మొబైల్ ఫోన్లు వచ్చేశాయి. అంతా కొత్త టెక్నాలజీమయం అయిపోయిం ది. అలాంటప్పుడు పాత పద్ధతులకు కాలం చెల్లక తప్పదు కదా’ అన్నారాయన. బ్యాంకరుగా పనిచేసి రిటైరయిన సత్యనారాయణ కూడా ఇలాగే పాత స్మ ృతులు గుర్తు చేసుకున్నారు. ‘‘అప్పట్లో మనీఆర్డర్లు తీసుకొచ్చే పోస్ట్‌మాన్‌కి ఎంతో గౌరవం ఉండేది. కుటుంబానికి ప్రతి నెలా పంపడంతో పాటు చుట్టాలు పక్కాలు, బంధువుల ఇళ్లలో శుభకార్యాలేమైనా జరిగితే రూ.11, రూ.21, రూ.51.. ఇలా ఎంతో కొంత మొత్తాన్ని శుభాకాంక్షలతో పంపించేవాళ్ళం’’ అంటూ వివరించారు. ‘నేను మా అమ్మానాన్నలకు డబ్బు పంపించేవాణ్ని. ఇప్పుడు మా అబ్బాయి సింపుల్‌గా మొబైల్ ఫోన్‌తో క్షణాల్లో పంపించేస్తున్నాడు’ అంటూ ప్రస్తుతం వచ్చిన మార్పును తెలియజేశారాయన. ఇన్స్టంట్ మనీ ఆర్డర్ ఇన్స్టంట్ ఎంఓ పద్ధతిలో రూ.1,000 నుంచి 50,000 దాకా డబ్బును తక్షణమే రెమిట్ చేయొచ్చు. దీనికి నిర్దిష్ట పోస్టాఫీసులను ఎంపిక చేశారు. వీటిల్లో గుర్తింపు ధ్రువీకరణ పత్రంతో పాటు ఈ-ఫారాన్ని అందజేయాలి. ఏదైనా సందేశం పంపదల్చుకుంటే అక్కడి 33 స్టాండర్డ్ మెసేజీల్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. నగదు బదిలీ పూర్తయ్యాక... దాన్ని అందుకునే వారు (పేయీ) దగ్గర్లోని పోస్టాఫీసుకు వెళ్లి, తమ ఐడీ ప్రూఫ్‌ను చూపించి డబ్బు తీసుకోవచ్చు. కావాలనుకుంటే ఆ మొత్తాన్ని పేయీకి చెందిన సేవింగ్స్ ఖాతాలోనైనా జమ చేస్తారు. ఎలక్ట్రానిక్ ఎంఓ నగదును నేరుగా తీసుకోవాల్సిన వ్యక్తి ఇంటికే పంపిస్తారు. గరిష్టంగా ఒకరోజులో రూ.5,000 దాకా పంపొచ్చు. 21 స్టాండర్డ్ మెసేజీల్లో ఏదో ఒకటి ఎంచుకుని ఈఎంవో బుక్ చేస్తే .. దాన్ని దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు 24 గంటల్లోపే డెలివరీ చేస్తాయి. ఈ లావాదేవీని ఇండియా పోస్ట్ వెబ్సైట్లో ట్రాక్ చేయొచ్చు కూడా. - సాక్షి, బిజినెస్ విభాగం