మనీ ఆర్డర్... మరి రాదు | End of legacy: Money order goes telegram way | Sakshi
Sakshi News home page

మనీ ఆర్డర్... మరి రాదు

Published Sun, Apr 5 2015 1:10 AM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM

మనీ ఆర్డర్... మరి రాదు - Sakshi

మనీ ఆర్డర్... మరి రాదు

 టెలిగ్రామ్ బాటలోనే ఎంఓ సేవలకు స్వస్తి
 సెలైంట్‌గా నిలిపేసిన తపాలా శాఖ  ఎలక్ట్రానిక్ వైపు మొగ్గు చూపుతుండటమే కారణం
 
 ఎక్కడో చదువుకునే పిల్లలు... ఉద్యోగం కోసం పిల్లల్ని దూరంగా పంపి సొంత ఊళ్లో కాలం వెళ్లదీసే తల్లిదండ్రులు. వీళ్లందరి కళ్లలో సంతోషాన్నిచ్చే నేస్తం ‘మనీ ఆర్డర్’. ఈ మనీ ఆర్డర్‌ను ఆధారం చేసుకుని పుట్టిన కథలు, సినిమాలకు లెక్కేలేదు. మనీ ఆర్డర్ రాక మారిపోయిన జీవితాలకూ అంతులేదు. అలాంటి మనీ ఆర్డర్... టెక్నాలజీ విప్లవానికి బలిపశువైపోయింది. రెండు నిమిషాల్లో ఆన్‌లైన్లోనే డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం... బ్యాంకు ఖాతా లేకపోయినా చేతిలో ఫోనుంటే ఒకరి డబ్బు మరొకరికి బదలాయించే వెసులుబాటు...
 
  బ్యాంకుకెళ్లి నేరుగా ఎవరి ఖాతాలోనైనా డిపాజిట్ చేసే సౌకర్యం... ఇవన్నీ కలిసి మనీ ఆర్డర్‌ను మట్టికరిపించేశాయి. అందుకే... ఇక దీని అవసరం లేదని భావించిన పోస్టల్ విభాగం... చడీచప్పుడూ లేకుండా దీనికి తెరదించేసింది. అంటే... మొన్నటికి మొన్న ఆగిపోయిన టెలిగ్రామ్ సరసన మరో తపాలా నేస్తం చేరిపోయింది. ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్లే (ఈఎంవో), ఇన్‌స్టంట్ మనీ ఆర్డర్ల (ఐఎంవో) లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో సంప్రదాయ ఎంవో సర్వీసులను నిలిపివేశామన్నది ఇండియా పోస్ట్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ (ఫైనాన్స్) శిఖా మాథుర్ కుమార్ మాట.
 
 శతాబ్దం పైగా చరిత్ర..
 మనీ ఆర్డర్‌ది 135 ఏళ్ల చరిత్ర. తపాలా శాఖ సమాచారం ప్రకారం 1880లో మనీ ఆర్డర్ వ్యవస్థను ట్రెజరీ విభాగం నుంచి పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్‌మెంట్‌కు బదలాయించారు. అప్పట్లో అలహాబాద్‌లో పోస్ట్‌మాస్టర్ జనరల్‌గా పనిచేసిన రాయ్ సాలిగ్రామ్ బహదూర్ హయాంలో ఇది జరిగింది. ఆ హోదాలో నియమితులైన తొలి భారతీయుడు ఆయనే.  అప్పట్లో కేవలం 283 లావాదేవీలకు పరిమితం అయిన మనీ ఆర్డర్లు 1980లో వందేళ్లు పూర్తి చేసుకునే నాటికి 10.8 కోట్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్, ఇన్‌స్టంట్ మనీ ఆర్డర్‌లను ప్రవేశపెట్టాక 9.5 కోట్లకు తగ్గాయి. ఇప్పుడు మరింతగా పడిపోయాయి.
 
 ఆనాటి జ్ఞాపకాలు..
 మనీ ఆర్డర్లను పోస్టల్ శాఖ నిలిపేయటంతో వాటితో అనుబంధంపై కొందరు సీనియర్ సిటిజన్లు స్పందిస్తూ... శ్రీకాకుళం జిల్లాలోని చిన్న గ్రామం మాది. అక్కడుండే మా కుటుంబానికి డబ్బు పంపాలంటే అప్పట్లో మనీ ఆర్డర్ తప్ప గత్యంతరం లేదు. ఇంట్లో వాళ్లంతా మనీ ఆర్డర్ కోసం ఎదురు చూస్తారన్న సంగతి తెలిసి నేను ప్రతినెలా ఎన్ని పనులున్నా 4వ తేదీకల్లా ఎంఓ చేసేసేవాణ్ణి... అంటూ గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం ముం బైలో సెటిల్ అయిన గోపాల రావు. ‘చాలా మందికి రెండేసి బ్యాంకు ఖాతాలుంటున్నా యి. మొబైల్ ఫోన్లు వచ్చేశాయి. అంతా కొత్త టెక్నాలజీమయం అయిపోయిం ది. అలాంటప్పుడు పాత పద్ధతులకు కాలం చెల్లక తప్పదు కదా’ అన్నారాయన.
 
 బ్యాంకరుగా పనిచేసి రిటైరయిన సత్యనారాయణ కూడా ఇలాగే పాత స్మ ృతులు గుర్తు చేసుకున్నారు. ‘‘అప్పట్లో మనీఆర్డర్లు తీసుకొచ్చే పోస్ట్‌మాన్‌కి ఎంతో గౌరవం ఉండేది. కుటుంబానికి ప్రతి నెలా పంపడంతో పాటు చుట్టాలు పక్కాలు, బంధువుల ఇళ్లలో శుభకార్యాలేమైనా జరిగితే రూ.11, రూ.21, రూ.51.. ఇలా ఎంతో కొంత మొత్తాన్ని శుభాకాంక్షలతో పంపించేవాళ్ళం’’ అంటూ వివరించారు. ‘నేను మా అమ్మానాన్నలకు డబ్బు పంపించేవాణ్ని. ఇప్పుడు మా అబ్బాయి సింపుల్‌గా మొబైల్ ఫోన్‌తో క్షణాల్లో పంపించేస్తున్నాడు’ అంటూ ప్రస్తుతం వచ్చిన మార్పును తెలియజేశారాయన.
 
 ఇన్‌స్టంట్ మనీ ఆర్డర్
 ఇన్‌స్టంట్ ఎంఓ పద్ధతిలో రూ.1,000 నుంచి 50,000 దాకా డబ్బును తక్షణమే రెమిట్ చేయొచ్చు. దీనికి నిర్దిష్ట పోస్టాఫీసులను ఎంపిక చేశారు. వీటిల్లో గుర్తింపు ధ్రువీకరణ పత్రంతో పాటు ఈ-ఫారాన్ని అందజేయాలి. ఏదైనా సందేశం పంపదల్చుకుంటే అక్కడి 33 స్టాండర్డ్ మెసేజీల్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. నగదు బదిలీ పూర్తయ్యాక... దాన్ని అందుకునే వారు (పేయీ) దగ్గర్లోని పోస్టాఫీసుకు వెళ్లి, తమ ఐడీ ప్రూఫ్‌ను చూపించి డబ్బు తీసుకోవచ్చు. కావాలనుకుంటే ఆ మొత్తాన్ని పేయీకి చెందిన సేవింగ్స్ ఖాతాలోనైనా జమ చేస్తారు.
 
 ఎలక్ట్రానిక్ ఎంఓ
 నగదును నేరుగా తీసుకోవాల్సిన వ్యక్తి ఇంటికే పంపిస్తారు. గరిష్టంగా ఒకరోజులో రూ.5,000 దాకా పంపొచ్చు. 21 స్టాండర్డ్ మెసేజీల్లో ఏదో ఒకటి ఎంచుకుని ఈఎంవో బుక్ చేస్తే .. దాన్ని దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసులు 24 గంటల్లోపే డెలివరీ చేస్తాయి. ఈ లావాదేవీని ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో ట్రాక్ చేయొచ్చు కూడా.
  - సాక్షి, బిజినెస్ విభాగం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement