నవంబర్‌లో ఐఎంఏ ఏపీ కాన్–2016
నవంబర్‌లో ఐఎంఏ ఏపీ కాన్–2016
Published Mon, Sep 12 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
అమలాపురం టౌన్:
ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఏటా రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట రాష్ట్ర స్థాయిలో వైద్యుల సదస్సు నిర్వహిస్తుంది. అయితే రాష్ట్రం విడిపోయి, నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక తొలి సదస్సును కోనసీమలో ఏర్పాటు చేసేందుకు ఐఎంఏ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. కోనసీమ ఐఎంఏ శాఖ ఈ సదస్సును నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. నవంబర్ 19, 20 తేదీల్లో అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాలలో ఐఎంఏ ఏపీ కాన్ –2016 పేరిట నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు వెయ్యి మంది వైద్యులు పాల్గొనే ఈ నవ్యాంధ్ర రాష్ట్ర వైద్యుల తొలి సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు కోనసీమ ఐఎంఏ శాఖ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గంధం రామం, డాక్టర్ పి.సురేష్‌బాబు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వేదికగా ఇంతకాలం పనిచేసిన రాష్ట్ర ఐఎంఏ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇటీవలే ఏపీ శాఖగా విడిపోయి విజయవాడలో కేంద్ర కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుందన్నారు. వైద్యరంగంలో వస్తున్న ఆధునాతన సాంకేతిక వైద్య ప్రక్రియలపై, ప్రాణాంతక వ్యాధులకు సంబంధించి జరుగుతున్న పరిశోధనలపై సదస్సు చర్చిస్తుందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వైద్యులకు కోనసీమ రుచులను చవి చూపించేలా, ఈ ప్రాంత అందాలను చూపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సీమ సంప్రదాయాలతో వినోద కార్యక్రమాలను నిర్వహిస్తామని, ఈ సీమలోని ప్రసిద్ధ దేవాలయాల దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఐఎంఏ ఏపీ కాన్–2016 బ్రోచర్ (ఆహ్వాన పత్రిక)ను కూడా కోనసీమలోని విశిష్ట ఆలయాలు, అందాలు, వంటకాల చిత్రాలతో ఆకర్షణీయంగా రూపొందించామని తెలిపారు. రాష్ట్ర ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ జీఎస్ మూర్తి, డాక్టర్ ఎంఏ రెహమాన్ సూచనలతో ఏర్పాట్లు చేస్తూ వైద్యులకు ఆహ్వానాలు పంపిస్తున్నామని చెప్పారు.
Advertisement