
వీడుతున్న యువ వైద్యుడిపై హత్యాయత్నం కేసు మిస్టరీ
భార్యతోపాటు ఆమె స్నేహితుడే సూత్రధారులు
ఏడు అడుగులు.. ఏడేళ్ల వివాహేతర సంబంధం?
అడ్డు తొలగించుకోవాలని దాడి పోలీసుల అదుపులో
ముగ్గురు నిందితులు చావుబతుకుల్లో వైద్యుడు సుమంత్‌రెడ్డి
వరంగల్ క్రైం/ఖిలావరంగల్: వైద్యుడితో ఆమె ఏడడుగులు నడిచింది.. కానీ ఏడేళ్లనుంచి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఆ వివాహేతర సంబంధమే వారి కుటుంబంలో చిచ్చురేపింది. చివరికి భర్తను చంపేయాలన్న నిర్ణయానికి వచ్చింది. వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 20వ తేదీ రాత్రి జరిగిన యువ వైద్యుడు గాదె సుమంత్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును విచారిస్తున్న పో లీసులకు కేసు పూర్వాపరాలు ఓ సినిమా స్టోరీని తలపించినట్లు తెలిసింది. భార్య, ప్రియుడు సూత్రధారులుగా తేల్చి అదుపులోకి తీసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రేమ వివాహం..ఆపై వివాహేతర సంబంధం
కాజీపేట మండలం ఫాతిమానగర్‌లోని ఓ చర్చిలో గాదె సుమంత్‌రెడ్డి, ఫ్లోరింజాలకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటై ఏడడుగులు వేసి జీవితాన్ని ప్రారంభించిన ఆ జంట మధ్య వివాహేతర సంబంధం సమస్యలను తెచ్చిపెట్టింది. ఫోరింజ 2019లో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించింది. దానికంటే ముందు సంగారెడ్డిలో డాక్టర్ సుమంత్‌రెడ్డి ఆస్పత్రి నిర్వహించే క్రమంలో జిమ్‌కు వెళ్లిన ఆమెకు అందులో ఉద్యోగం చేసే సామేల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఆ తర్వాత ఆస్పత్రిని కాజీపేటకు మార్చారు. అయినా ఏడేళ్లుగా ఫోరింజ, సామేల్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇటీవల విషయం సుమంత్‌రెడ్డికి తెలియడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో సామేల్ .. ఫ్లోరింజలు కలిసి డాక్టర్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. దీనికి సంగారెడ్డిలో ప్లాన్ చేసి, భట్టుపల్లి దగ్గరలోని అమ్మవారిపేట వద్ద అమలు చేశారు. దాడి అనంతరం పారిపోయిన నిందితులను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. కాగా, వీరు అనేకసార్లు డాక్టర్‌పై దాడి ప్రయత్నాలు చేసి విఫలమైనట్లు తెలిసింది. ఓసారి డాక్టర్‌ను నేరుగా బెదిరించి వదిలేసినట్లు తెలుస్తోంది.
స్నేహితుడి కోసం వచ్చి..
ప్రియురాలు ఫ్లోరింజ కోసం హత్య చేయడానికి సిద్ధమైన సామేల్ వెంట వచ్చిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అడ్డంగా బుక్ అయ్యాడు. సుమంత్‌పై దాడి అనంతరం ఏఆర్ కానిస్టేబుల్‌ను హైదరాబాద్‌లో వదిలేసి సామేల్ బెంగళూరు పారిపోయాడు. కాల్ డేటా అధారంగా పోలీసులు నిందితులను త్వరగా పట్టుకోగలిగారు.
ప్రాణాపాయ స్థితిలో వైద్యుడు సుమంత్
వైద్యుడు సుమంత్‌రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెడ, తలకు బలమైన గాయాలు కాగా, ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం.
కోడలిపై అనుమానం.. ఫిర్యాదు..
డాక్టర్ సుమంత్‌రెడ్డిపై దాడి జరిగిన వెంటనే తల్లిదండ్రులు కోడలు ఫ్లోరింజాపై అనుమా నం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కాల్ డేటా వివరాలను పరిశీలించారు. అందులో కొన్ని నెలలుగా గంటల తరబడి మాట్లాడుతున్న ఫోన్ నంబర్, హత్యాయత్నం జరిగిన రోజు ఎక్కడ ఉంది అని చూశారు. హత్యాయత్నం జరిగిన సంఘటన స్థలానికి మ్యాచ్ అయినట్లు సమాచారం. దీంతో సూత్రధారి అయిన భార్యను అరెస్టు చేయకుండా ఫోన్‌నంబర్ అధారంగా పోలీసులు రెండు రోజులు బెంగళూర్‌లో గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకొని వరంగల్‌కు తీసుకువచ్చారు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించడంతో అసలు నిందితురాలిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో అరెస్టు చూపే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment