రియల్టీలో ఆన్లైన్ హవా
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ నిర్ణయాలపై ఇంటర్నెట్ ప్రభావం పెరుగుతోంది. ఇటీవలి 4,300 కోట్ల డాలర్ల విలువైన రియల్టీ నిర్ణయాలకు ఇంటర్నెట్ రీసెర్చ్ కారణమైందని ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ తెలిపింది. రియల్ ఎస్టేట్ నిర్ణయాలపై ఇంటర్నెట్ ప్రభావంపై జిన్నోవ్ సంస్థతో ఒక సర్వేను నిర్వహించామని వివరించింది. మెట్రో నగరాలు, పుణే, లక్నో, అహ్మదాబాద్లతో పాటు మొత్తం 15 నగరాల్లో 6,196 మందిపై ఈ సర్వే నిర్వహించామని పేర్కొంది. ఈ సర్వే వివరాలను గూగుల్ ఇండియా ఇండస్ట్రీ డెరైక్టర్ నితిన్ బవన్కులే వెల్లడించారు.
కొన్ని ముఖ్యాంశాలు...,
* రియల్ ఎస్టేట్ కొనుగోలుదారుల నిర్ణయాల్లో 50 శాతానికి పైగా ఇంటర్నెట్ ప్రభావం చూపుతోంది.
* ఏదైనా రియల్ ఎస్టేట్ ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు ఆన్లైన్లో రీసెర్చ్ చేయడమనేది మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు. టైర్ టూ నగరాలకు కూడా ఇది విస్తరిస్తోంది.
* ఇంటర్నెట్ ప్రభావం ఉన్న నివాసిత రియల్టీ నిర్ణయాల విలువ 3,100 కోట్ల డాలర్లుకాగా, వాణిజ్య రియల్టీ నిర్ణయాలు 1,200 కోట్ల డాలర్లు.
* రియల్టీ నిర్ణయాల నిమిత్తం కొనుగోలుదారులు వివిధ అంశాల కోసం ఇంటర్నెట్ సంప్రదిస్తున్నారు. సంబంధిత ఆస్తి సమాచారం, మార్కెట్ ట్రెండ్స్ తెలుసుకోవడానికి ఇంటర్నెట్ యాక్సెస్ 60% ఉపకరిస్తోందని పలువురు భావిస్తున్నారు.
* రియల్టీపై సెర్చింగ్ మూడేళ్లలో 3 రెట్లు పెరిగింది.
* కొనుగోలుదారులతో కనెక్ట్ కావడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్లకు, బ్రోకర్లకు ఇంటర్నెట్ అద్భుతమైన అవకాశాలను కల్పిస్తోంది.
* మకాన్డాట్కామ్, మ్యాజిక్బ్రిక్స్డాట్కామ్ వెబ్సైట్లు తగిన సమాచారాన్ని అందిస్తున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.
* రియల్టీ బ్రోకర్ల సైట్లు, బ్లాగ్లు, ఫోరమ్లను విజిట్ చేశామని 45 శాతం మంది పేర్కొన్నారు.
* అయితే ఆన్లైన్ ద్వారా సరైన, తాజా సమాచారం దొరకదన్న అసంతృప్తి కూడా వ్యక్తం అవుతోంది.