Imperial College London
-
మలేరియా వ్యాప్తిని నిరోధించే దోమలు
లండన్: మలేరియా.. మానవాళికి పెనుముప్పుగా మారిన అతిపెద్ద వ్యాధి. దోమల నుంచి వ్యాపించే మలేరియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. వ్యాధి నివారణకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. మలేరియా వ్యాప్తిని అరికట్టే దోమలను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందుకోసం సాధారణ దోమల్లో జన్యుపరమైన మార్పులు చేశారు. మలేరియాకు కారణమయ్యే పారాసైట్లు జన్యుపరంగా మార్పు చేసిన ఈ దోమల్లో వేగంగా పెరగవని చెబుతున్నారు. మలేరియాను అరికట్టడంలో ఇదొక శక్తివంతమైన ఆయుధం అవుతుందని పేర్కొంటున్నారు. యూకేలోని ఇంపీరియల్ కాలేజీ లండన్‌తోపాటు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు చెందిన ‘ఇన్స్టిట్యూట్ ఫర్ డిసీజ్ మోడలింగ్’ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. ఈ వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు. మలేరియా సోకిన వ్యక్తిని కుట్టిన ఆడ దోమ మరో వ్యక్తిని కుడితే అతడికి కూడా వ్యాధి సోకుతుంది. అంటే దోమల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. మలేరియా పారాసైట్లు తొలుత దోమ ఆంత్రంలోకి చేరుకుంటాయి. అక్కడే ఇన్ఫెక్షన్ కలిగించే స్థాయికి ఎదుగుతాయి. అనంతరం లాలాజల గ్రంథుల్లోకి చేరుకుంటాయి. ఆంత్రంలో పారాసైట్లు ఎదగడానికి ఎక్కువ సమయం పట్టేలా చేశారు. పారాసైట్లు అభివృద్ధి చెంది, మనిషిని కుట్టే లోపే దోమల జీవితకాలం ముగుస్తుందని చెబుతున్నారు. ప్రపంచంలో సగం జనాభాకు మలేరియా రిస్క్ పొంచి ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా 24.10 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. 6,27,000 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. -
డెల్టా కన్నా ఒమిక్రాన్ తీవ్రత తక్కువే!
లండన్: కరోనా డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ తీవ్రతకలదని, అందుకే ఇది సోకిన వారిలో కొద్దిమందే ఆస్పత్రిపాలవుతున్నారని రెండు వేర్వేరు అధ్యయనాలు వెల్లడించాయి. లండన్ ఇంపీరియల్ కాలేజీ, ఎడిన్బర్గ్ యూనివర్సిటీలు రోగులు, ఆస్పత్రులనుంచి గణాంకాలు సేకరించి ఈ అధ్యయనాలను రూపొందించాయి. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారు ఆస్పత్రిలో గడపాల్సిరావడం 40–45 శాతం తక్కువని ఇంపీరియల్ కాలేజీ నివేదిక తెలిపింది. గతంలో ఒకసారి కరోనా సోకి, మరలా ఇప్పుడు ఒమిక్రాన్ సోకినవారిలో ఆస్పత్రిలపాలయ్యే ఛాన్సులు తక్కువని తెలిపింది. టీకాలు తీసుకోనివారిలో హాస్పిటలైజేషన్ రిస్క్ అధికమేనని హెచ్చరించింది. ఒమిక్రాన్‌కు ఉన్న అధిక వేగం కారణంగా ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నివేదిక రూపకర్తల్లో ఒకరైన నీల్ ఫెర్గూసన్ చెప్పారు. ఈ అధ్యయనం కోసం 56వేల ఒమిక్రాన్, 2.69 లక్షల డెల్టా కేసులను పరిశీలించారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ ప్రభావం తక్కువేనని ఎడిన్బర్గ్ వర్సిటీ నివేదిక తెలిపింది. ఇది సంతోషకరమైన విషయమని, కానీ అంతమాత్రాన అశ్రద్ధ కూడదని ఆరోగ్యనిపుణులు అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న వేళ పండుగ సంబరాలపై నిబంధనలు విధిస్తున్నారు. దక్షిణాఫ్రికాదీ అదేమాట కరోనా గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ తీవ్రత తక్కువని దక్షిణాఫ్రికాలోని విట్వాటర్ర్సాండ్ యూనివర్సిటీ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ తీవ్రత చాలా తగ్గిందని యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర షెరిల్ కోహెన్ చెప్పారు. మిగిలిన ఆఫ్రికన్ దేశాల్లో కూడా ఒమిక్రాన్ ప్రభావం తగ్గవచ్చని అంచనా వేశారు. అయితే అధిక వ్యాక్సినేషన్ ఉన్న దేశాలతో పోలిస్తే అల్ప వ్యాక్సినేషన్ దేశాల్లో పరిస్థితి భిన్నంగా ఉండొచ్చన్నారు. దేశంలో నడుస్తున్న నాలుగో వేవ్ గత వేవ్స్ కన్నా తక్కువ ప్రమాదకారిగా తేలిందని దక్షిణాఫ్రికా ఆరోగ్య నిపుణులు వాసిలా జసాత్ చెప్పారు. ఈ వేవ్‌లో తొలి నాలుగు వారాల్లో భారీగా కేసులు నమోదయ్యాయని, అయితే వీటిలో 6 శాతం కేసులు మాత్రమే ఆస్పత్రికి చేరాయని వివరించారు. అలాగే సీరియస్ కండీషన్లోకి దిగజారిన పేషెంట్ల సంఖ్యకూడా గతం కన్నా తక్కువేనన్నారు. గత వేవ్స్‌లో కరోనా సోకిన వారిలో 22 శాతం మరణించగా, నాలుగో వేవ్‌లో మరణాలు 6 శాతానికి పరిమితమయ్యాయని తెలిపారు. ప్రజల్లో ఇమ్యూనిటీ పెరగడం, టీకాల విస్తృతి పెరగడం, వేరియంట్లో విరులెన్స్(విష తీవ్రత) తగ్గడం వంటి అనేక కారణాలు ఇందుకు దోహదం చేసిఉండొచ్చని, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సిఉందని చెప్పారు. గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్‌తో హాస్పటలైజేషన్ రిస్కు 80 శాతం తక్కువ కాగా తీవ్ర లక్షణాలు కనిపించే రిస్కు 70 శాతం తక్కువని దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల సంస్థ తెలిపింది. -
దక్షిణాఫ్రికా ‘దడ’.. కొమ్ములు విరుచుకుంటున్న కొత్త వేరియెంట్
లండన్/ జొహన్నెస్‌బర్గ్: అబ్బో... ఎన్నో వేరియెంట్లను చూసేశాం. అలసిపోయాం... ఇక కరోనాతో సహజీవనం మనకు అలవాటైపోయిందని ఒక రకమైన నిశ్చింతకు వచ్చాం. ఇంతలోనే దక్షిణాఫ్రికా మరో బాంబు పేల్చింది. ‘బి.1.1.529’ అనే ప్రమాదకరమైన వేరియెంట్ వెలుగుచూసిందని, పలు మ్యూటెంట్ల సమ్మేళనంగా (అసాధారణ ఉత్పరివర్తనాల సమూహంగా) ఇది కనపడుతోందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ వైరాలజిస్టు డాక్టర్ టామ్ పీకాక్ వెల్లడించారు. మానవ శరీరంలోని రోగనిరోధక శక్తిని ఏమార్చగలదని, మరింత వేగంగా వ్యాప్తిచెందగలదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దక్షిణాఫ్రికా, బోట్స్వనాల్లో ఈ రకానికి చెందిన 100 కేసులను గుర్తించినట్లు తెలిపారు. బి.1.1.529 ఎంతటి ప్రమాదకరం, దీని మూలంగా ఎదురయ్యే విపరిణామాలు ఎలా ఉండనున్నాయనేది అంచనా వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శాస్త్రవేత్తలు గురువారం సమావేశమయ్యారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న, హెచ్ఐవీ/ ఎయిడ్స్ సోకి చికిత్స పొందని వ్యక్తి శరీరంలో ఈ మ్యూటెంట్ అభివృద్ధి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఏమేరకు వేగంగా వ్యాప్తి చెందగలదు, ఎంతటి హానికరమనేది ప్రస్తుత దశలో ఏమీ చెప్పలేమని దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. తమ శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తూ.. దీని పరిణామక్రమాన్ని నిశితంగా గమనిస్తున్నారని పేర్కొంది. హాంగ్‌కాంగ్‌లోనూ ఈ వేరియెంట్ కేసులు బయటపడ్డాయి. ► దీంట్లో ఏకంగా 32 మ్యూటేషన్లు ఉన్నాయి. ► కె417ఎన్– కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలను ఏమార్చగలదు ► ఈ484ఏ– యాంటీబాడీలకు చిక్కదు ► ఎన్440కే– యాంటీబాడీలను బొల్తా కొట్టించగలదు ► ఎన్501వై.. వైరస్ వ్యాప్తిని వేగవంతం చేస్తుంది. ► ఈ వైరస్ కొమ్ముల్లో మరే దాంట్లోనూ లేనన్ని మ్యూటేషన్లు ఉన్నాయి. ► ప్రస్తుత వ్యాక్సిన్ల ద్వారా ఉత్పత్తయ్యే యాంటీబాడీలు ఇప్పటిదాకా వ్యాప్తిలో ఉన్న వేరియెంట్లనే (వైరస్‌పై ఉండే కొమ్ములనే) గుర్తుపట్టగలవు ► కాబట్టి ఇది తేలిగ్గా యాంటీబాడీలు కల్పించే రక్షణను తప్పించుకొని శరీరంలో వ్యాప్తి చెందగలదు. అక్కడి నుంచి వచ్చేవారితో జాగ్రత్త కొత్త వేరియెంట్ అనవాళ్లు బయటపడ్డ దక్షిణాఫ్రికా, బోట్వ్సానా, హాంగ్‌కాంగ్‌ల నుంచి వచ్చే ప్రయాణికులకు క్షుణ్ణంగా పరీక్షించాలని, టెస్టులు ముమ్మరం చేయాలని భారత ప్రభుత్వం గురువారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రదేశాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ దేశాల మీదుగా (వయా) వస్తున్న వారినీ కఠిన పరీక్షల తర్వాతే అనుమతించాలని సూచించింది. అందరి శాంపిల్స్ తీసుకొని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ల్యాబ్‌లకు పంపాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు రాసిన లేఖలో కోరారు. -
టీకా తీసుకున్న వారి ద్వారా కూడా కరోనా వ్యాప్తి
లండన్: కోవిడ్–19 వైరస్ నుంచి రక్షణ కోసం టీకా రెండు డోసులు తీసుకున్న వారి నుంచి కూడా ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతున్నట్టు లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక వెల్లడించింది. అయితే, వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే టీకా తీసుకున్న వారిలో వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నట్టు తెలిపింది. యూకేలోని ఇంపీరియల్ కాలేజీ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తల అధ్యయనం ఫలితాలను లాన్సెట్ వెలువరించింది. ‘‘టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా వైరస్ సోకుతోంది. అయితే వారు త్వరగానే కోలుకుంటున్నారు. కానీ వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించేవారు వ్యాక్సిన్ తీసుకోకపోతే మహమ్మారి వారిని బాగా వేధిస్తోంది’’ అని ఆ నివేదిక వెల్లడించింది. ‘‘కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో వ్యాక్సిన్లే అత్యంత కీలకం. మన చుట్టూ ఉన్నవారు టీకా వేసుకున్నారు, మనకేం కాదులే అన్న ధీమా పనికిరాదు. టీకా వేసుకున్న వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది’’ అని అధ్యయనం సహ రచయిత ప్రొఫెసర్ అజీ లల్వానీ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నప్పటికీ కరోనా కేసులు పెరిగిపోవడానికి ఇదే కారణమని వివరించారు. టీకా రెండో డోసు తీసుకున్న 3 నెలల తర్వాత నుంచి వారికి వైరస్ సోకి ఇతరులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించామన్నారు. -
'ముద్దులకు దూరంగా ఉండాల్సిందే!'
లండన్ : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలు పరస్పర కరచాలనాలకే కాకుండా సోషల్ కిస్సింగ్లతో పాటు ప్రేమ, ముద్దులకు కొంతకాలం దూరంగా ఉండాలంటూ లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ ప్రొఫెసర్, ప్రముఖ శాస్త్రవేత్త లార్డ్ విన్స్టన్ పిలుపునిచ్చారు. ఆయన కరోనా వైరస్పైపై లండన్‌లో మంగళవారం జరిగిన ఓ చర్చాగోష్ఠిలో మాట్లాడుతూ... ఈ రోజు తనకు ఇద్దరు మిత్రులు సోషల్ కిస్సింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే వారిని వారించానని చెప్పారు. కరచాలనం కంటే సోషల్ కిస్సింగ్ వల్ల వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. తన మాటలను తన భార్య కూడా వింటుండవచ్చని, ఆమెను ఉద్దేశించి కూడా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పారు. (హైటెక్ సిటీలో కరోనా కలకలం.. ఆఫీసులు ఖాళీ!) ఓ మనిష ముక్కును, కళ్లను రోజుకు 70 నుంచి వందసార్లు తాకే అవకాశం ఉందని ఆయన అన్నారు. చేతులతోని ముక్కు, నోరు, కళ్లను తాకకుండా జాగ్రత్త వహించాలని కూడా ఆయన సూచించారు. చేతులు శుభ్రంగా ఉంటే ఫర్వాలేదుగానీ లేకపోనట్లయితే ప్రమాదమే కదా! అని ఆయన చెప్పారు. 20 సెకండ్లకు తక్కువ కాకుండా తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ఆయన సూచించారు. (ఇరాన్లో 92కు చేరిన కరోనా మృతుల సంఖ్య) -
20 కోట్ల మంది భారతీయులకు హైబీపీ
లండన్: భారత్‌లో ప్రతి ఆరుగురిలో ఒకరికి హైబీపీ ఉందని, 20 కోట్ల మంది దీనితో బాధపడుతున్నారని లండన్ ఇంపీరియల్ కాలేజీ శాస్తవేత్తల సర్వేలో తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 113 కోట్లుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా హైబీపీ బాధితుల సంఖ్య 40 ఏళ్లలో రెట్టింపయ్యింది. 2015లో అధిక బీపీ ఉన్న ప్రజల్లో సగం మంది ఆసియావాసులే. చైనాలో సుమారు 2.26 కోట్ల మందికి హైబీపీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్త్రీల కన్నా పురుషుల్లోనే ఈ సమస్య అధికం. జనాభాలో రక్తపోటు ఉన్న వారి శాతాల పరంగా పరిశీలిస్తే పురుషుల్లో క్రొయేషియా(38%), స్త్రీలలో నైగర్(36%) తొలిస్థానంలో నిలిచాయి.