imperialism
-
ఈ వక్రీకరణలు ఎందుకు?
మార్క్స్ 200వ జయంతి నాడు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సుధాకర రెడ్డి గారు ఓ వ్యాసం రాశారు. దానిలో ప్రతి వాక్యమూ ఒక ఆణి ముత్యమే. నేనిక్కడ కొన్ని ముత్యాలకే పరిమితమవుతాను. ‘‘సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత’’ సామ్రాజ్యవాదులు అనేక వక్రీకరణలకు పాల్పడ్డారు అంటారు రచయిత. అంతకుముందు మార్క్సిజం వక్రీకరణలకే గురి కాలేదా? వక్రీకరించినవాళ్లంతా సామ్రాజ్యవాదులేనా? కమ్యూనిస్టు పేరు తగిలించుకొన్నవాళ్లు వక్రీకరించనే లేదా? ‘‘మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం వైఫల్యం చెందిందని ... సామ్రాజ్యవాదులు విస్తృత ప్రచారం’’ చేశారంటారు రచయిత. నిజమే. మార్క్సిజం అజేయం అనడానికి సోవియట్ యూనియనే తార్కాణం అని మీరు లక్ష సార్లు చెప్పారు. అందుకే ఆ తార్కాణం కూలిపోగానే మార్క్సిజమే కూలిపోయిందని జనం అనుకొన్నారు. అదే శత్రువులు ప్రచా రం చేశారు. ‘‘సామ్రాజ్యవాదులకు ... విమర్శించే హక్కు లేదు’’ అని ఆయన ఒక ఫర్మానా జారీ చేశారు. అది సరే. కాని విమర్శించేవాళ్లందరూ సామ్రాజ్యవాదులేనా? ఒకరడిగినా అడగకపోయినా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కమ్యూనిస్టు నాయకులకు ఉండనే ఉండదా? తమ సొంత స్పష్టత కోసమైనా పొరపాటు ఎక్కడ జరిగిందో శోధించాల్సిన పనిలేదా? మార్క్స్‌నీ జయాపజయాల చరిత్రనీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారా? పోనీ ఆ దిశగా మీరు రెండడుగులయినా వేశారా, చెప్పండి. ‘‘1978 తదనంతరం మావో వారసుడు డెంగ్‌జియావో పింగ్ నాయకత్వంలో అనేక సంస్కరణలను తీసుకురావడం జరిగింది. తత్ఫలితంగా 80 కోట్ల ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారు.’’ అంటారు సుధాకర్జీ. ప్రపంచంలో నయా ఉదారవాదాన్ని సంస్కరణలనే పేరుతో అధికారికంగా ప్రారంభించిన ముగ్గురిలో థాచర్, రీగన్లతో పాటు డెంగ్ ఒకడు. సుధాకర్జీ, మీరూ మీ పార్టీ సంస్కరణలనబడే వాటిని వ్యతిరేకించారు. అదే పనిచేసిన డెంగ్‌ని ఎలా పొగుడుతారు? ‘‘సోవియట్ ప్రభుత్వం... బ్యాంకులను పరి శ్రమలను జాతీయం చేసి అనేక విజయాలను సాధించింది.’’ అన్నారు సుధాకర్జీ. కాని రష్యాలో చైనాలో జాతీయం చేయడానికీ మార్క్స్ ప్రేరణ, చైనాలో ప్రభుత్వ ఆస్తులను సొంత ఆస్తులుగా మార్చిన డెంగ్కీ మార్క్స్ ప్రేరణ అంటే ఎలా సుధాకర్జీ. ‘‘దక్షిణ అమెరికాలో వెనిజులా బొలీవియా నికరాగువా మరికొన్ని దేశాలు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల... ఒత్తిడులకు లొంగకుండా స్వంత బ్యాంకులను నిర్మించుకొన్నాయి’’ అన్నారు రచయిత. కాని ఆ దేశాలు బ్యాంక్‌లో ఇంతవరకూ డిపాజిట్లు కట్టనేలేదనీ అసలు పని మొదలే కాలేదనీ ఈ నాయకునికి తెలుసా? ఇంకో ఆణిముత్యం ‘ఈ నేపథ్యంలోనే రష్యాతో సహా అనేక తూర్పు యూరప్ దేశాల్లో కమ్యూనిస్టులు ముందుకు సాగుతూనే ఉన్నారు’. ఏమిటీ, అక్కడ కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారా ఈ అభినవ రిప్ వాన్ వింకిల్ నిద్ర లేచి ఎంత కాలమైంది? ‘తింటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, చేయడానికి ఒక గౌరవప్రదమైన ఉద్యోగం’’ ఇచ్చే సోషలిస్టు సమాజమట! సోషలిజం అంటే ఇదేనా? కార్మికోద్యమ లక్ష్యం వేతన వ్యవస్థని రద్దు చేయడమే అన్న మార్క్స్ ఈ రచయితకు తెలుసా? అంటే ఆ వ్యవస్థలో యజమానీ ఉండడు. కూలీ ఉండడు. పని చేసేవాడే యజమాని. పనిచేసేవాళ్లదే అధికారం. అటువంటి వ్యవస్థ సోవియట్‌లో గాని చైనాలో గాని ఇంక ఎక్కడా గాని ఏర్పడనేలేదు. ఎందుకో సమీక్షించుకోవాల్సిన ‘అధికార’ కమ్యూనిస్టులు మాత్రం గానుగెద్దుని ఆదర్శంగా తీసుకొన్నారు. ఆర్థిక సంక్షోభాలు వచ్చిన ప్రతిసారీ పెట్టుబడిదారీ ప్రపంచంలో దూరం చూడగలిగినవారంతా మార్క్స్‌ని తలుచుకొంటున్నారు. ఉలిక్కిపడుతున్నారు. అక్కడ మార్క్స్ సజీవంగా ఉన్నాడు. అధికార కమ్యూనిస్టులు మాత్రం మార్క్స్ విగ్రహాలను పూజిస్తున్నారు. ఆ పూజకు అర్థం లేదు. ఆ విగ్రహంలో ప్రాణం లేదు. అదే విడ్డూరం. అదే విషాదం. (మే 5న సాక్షిలో వచ్చిన సురవరం సుధాకర రెడ్డి ‘‘గమ్యం గమనం మార్క్సిజమే’’ వ్యాసంపై స్పందన. దీని పూర్తి పాఠం ఈ లింకులో చూడండి : https://bit.ly/2jLIhg3) – వ్యాసకర్త: ఎ. గాంధీ, సంపాదకుడు, పీకాక్ క్లాసిక్స్ మొబైల్ : 91605 20830 -
ఇరవై వసంతాల మహిళా చైతన్య ప్రస్థానం
సామ్రాజ్యవాద అమెరికాకు దేశాన్ని తాకట్టుపెట్టి, ప్రత్యక్ష దోపిడీకి దేశం తలుపుల్ని బార్లా తెరచిన రోజులవి. సామ్రాజ్యవాద సంస్కృతి స్త్రీని సెక్స్ సింబల్‌గా, సరుకుగా మార్చివేసిన రోజులవి. ప్రభుత్వాలు మహిళా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, సారాను ఏరుల్లా పారిస్తూ, మహిళల కన్నీళ్లను కాసులుగా చేసు కుంటున్న రోజులవి. స్త్రీల సమస్యలు పోవాలంటే, స్త్రీ విముక్తి సాధించాలని మహిళలు కదులుతున్న రోజులవి. ఆకాశంలో సగ మైన మేముపోరాటంలో సగమవుతామనే మహిళా చైతన్యమూ, శ్రమ విముక్తిలోనే స్త్రీ విముక్తి ఉందనే స్పృహా పెరుగుతున్న ఆ కాలంలో.. 20 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ చైతన్య మహిళా సమాఖ్య (సీఎంఎస్) ఆవిర్భవించింది నూతన ప్రజాస్వామిక విప్లవం లక్ష్యంగా ఉన్న వివిధ మహిళా సంఘాలు 1995లో సమాఖ్యగా ఐక్యమయ్యాయి. 15 ఏళ్లు ప్రయాణించిన తదుపరి సమాఖ్య, సంఘంగా రూపొందించింది. మొదటి మహాసభ నుంచీ రాజ్యం సీఎంఎస్పై నిర్బంధం ప్రయోగిస్తోంది. సంఘం కార్యవర్గ సభ్యురాలు లక్ష్మిని చంపడం దీనికి పరాకాష్ట. అన్ని నిర్బంధాల్ని, ఒడిదుడుకుల్నీ ఎదుర్కొంటూ సీఎంఎస్ నేడు 20వ మైలురా యిని దాటి ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. తన రాజకీయ, చైతన్య ప్రచార వేదికగా సంస్థ గత 25 ఏళ్లుగా ‘మహిళా మార్గం’ పత్రికను నడుపుతున్నది. ప్రధానంగా శ్రామిక, విద్యార్థి, ఉద్యోగినుల్లో పనిచేస్తున్న సీఎంఎస్ పీడిత వర్గాల మహిళలందరి సమస్యలపైన స్పందిస్తోంది, ప్రశ్నిస్తోంది, పోరాడుతోంది. పోరాడితే పోయేదేమీ లేదు. మన సమస్యలు తప్ప అనే చైతన్యాన్ని మహిళల్లో పెంచింది. సీఎంఎస్ స్త్రీలపై అన్నిరకాల హిం సలకు వ్యతిరేకంగా ఉద్యమించింది. సారా వ్యతిరేక పోరాటం నుంచి సంక్షేమ పథకాల రద్దుకు వ్యతిరేకంగా, అశ్లీల సంస్కృ తికి వ్యతిరేకంగా పోరాడింది. వరకట్నం, కుటుంబ హింస, లైంగిక హింస, మత, కులపర హింస, సామాజిక హింస, రాజ్య హింస, అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పలు పోరాటాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దళిత, ముస్లిం, ఆదివాసీ మహిళలపై దాడులు జరిగినప్పుడు వారికి మద్దతుగా పోరాటాలు నిర్మించింది. స్త్రీ సమస్య విడిగా లేదని, స్త్రీ విముక్తి శ్రమ విముక్తితోనే ముడిపడి ఉందనే లక్ష్యంతో పీడిత ప్రజల సమస్యలపై కూడా సంస్థ అనేక ఐక్య కార్యాచరణ ఉద్య మాల్లో పాల్గొన్నది. నేడు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామ్రాజ్యవాద దేశాల చుట్టూ తిరుగుతూ దేశ వన రులను మొత్తంగా వారికి అర్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చైతన్య మహిళా సంఘం తన ముందున్న సంక్లిష్ట లక్ష్యాలను, సరికొత్త సవాళ్లను సమీక్షించి, తన ప్రస్థానాన్ని కొనసాగించడానికి పునరంకితం అవుతోంది, (నేడు చైతన్య మహిళా సంఘం 20వ వార్షికోత్సవం) పి. జయ సీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు, మొబైల్: 9441119519 -
సామ్రాజ్యవాదం, మతోన్మాదం ఒక్కటయ్యాయి
ఐఎఫ్టీయూ బహిరంగ సభలో ప్రొ.హరగోపాల్ సాక్షి, హైదరాబాద్: ప్రపంచీకరణ పేరుతో అభివృద్ధి చెందుతున్న దేశాలను దోపి డీ చేస్తున్న సామ్రాజ్యవా దం, మనదేశంలోని మతోన్మాదం ఒక్కటై దేశానికి ప్రమాదకర పరిస్థితులను తీసుకొచ్చాయని ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. పౌరుల హక్కులను సంరక్షించాల్సిన మన పాలకులు విదేశీయులకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) 8వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో శుక్రవారం కార్మికుల బహిరంగ సభ జరిగింది. ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వీ కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ప్రొ.హరగోపాల్, ఐఎఫ్టీయూ జాతీయ అధ్యక్షుడు డీవీ కృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య ప్రసంగించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం మన దేశ సంపదను ఆంగ్లేయులు ఎలా దోచుకున్నారో, ప్రపంచీకరణ, సరళీకరణ పేర్లతో విదేశీ పెట్టుబడులను మన దేశానికి తీసుకొచ్చి మన సంపదనంతా తరలించేందుకు సామ్రాజ్యవాద దేశాలు కుట్ర పన్నుతున్నాయని అరోపించారు. మన పాలకులు సామ్రాజ్యవాదుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని ధ్వజమెత్తారు. పౌరుల జీవన ప్రమాణాలను పెంచాల్సిన కేంద్ర పాలక వర్గం దేశంలో మతకల్లోలం సృష్టిస్తూ, మతమార్పిడులు చేస్తోందని ఆరోపించారు. సంపన్నులకు కోట్లలో రాయితీలు ఇస్తున్న పాలకులు.. పేదవాడికి కనీస అవసరాలను తీర్చడంలో శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. ఆహార భద్రత, సంక్షేమం, విద్య, ఆరోగ్యం తదితర ప్రజలకు అసరమయ్యే రంగాలకు బడ్జెట్లో నిధులు తగ్గించడంలో అర్థమేంటని ప్రశ్నిం చారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం, ఉపాధ్యక్షుడు జే శ్రీనివాస్, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు గాదె ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణోదయ కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు సుందరయ్య పార్కు నుంచి వేలాది మంది కార్మికులు ర్యాలీగా ఇందిరా పార్కుకు తరలివచ్చారు. -
విప్లవ కవి జ్వాలాముఖికి జోహార్లు
తన జీవితం చివరిక్షణం వరకు పాలకవర్గాలపై, నేటి దోపిడీ వ్యవస్థపై నిప్పులు కురిపిస్తూ తన ప్రతిభా పాటవాలను, శక్తి సామర్థ్యాలను ప్రజల కోసం ధారపోసిన విప్లవ కవులలో జ్వాలాముఖి ప్రముఖుడు. ఆయన 14.12.2008న మరణించారు. నేడు ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయనకు విప్లవ జోహార్లు. జ్వాలాముఖి 12.4.1938లో హైద రాబా ద్‌లోని సీతారాంబాగ్ దేవాలయంలో జన్మించారు. చిన్నతనంలోనే తాను నివాసముండే దేవాలయ ప్రాంగణంలోని పేద అర్చకుల ఇండ్ల స్థలాల సమస్యపై పోరాటం చేసి పేద ప్రజల ప్రేమకు పాత్రుడయ్యారు. ఎన్నో రుగ్మతలకు ఆలవాలమైన వ్యవ స్థపై ‘దిగంబర కవి’గా తిరుగుబాటు బావు టాను ఎగురవేసిన ఆయన క్రమంగా తన నిరంతర అధ్యయనం, పరిశీలన ద్వారా నేటి సమాజంలోని ప్రజల కడగండ్లకు దేశంలో కొనసాగుతున్న భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ వ్యవస్థే మూలకారణమని, ఈ దోపి డీల నిర్మూలనకు మార్క్సిజం- లెనినిజం- మావో ఆలోచనా విధానమే శరణ్యమని గ్రహించారు. అంతేగాక భారత విప్లవోద్యమ నాయకులు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి, దేవుల పల్లి వెంకటేశ్వరరావుల సాంగత్యం తోను, వారి బోధనలు, రచనల తోను ప్రభావితులై భారతదేశంలో అనుసరించవలసిన విప్లవ మార్గం పట్ల స్పష్టతను ఏర్పరచుకున్నారు. అప్పటి నుంచి తన జీవితాంతం తాను నమ్మిన ఆశయాల కోసం అంకితమై కృషి చేశారు. ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ ఏర్పడిన నా టి నుంచి (1971-72) జ్వాలాముఖితో దాని అనుబంధం ప్రగాఢమైనది. సంస్థ మౌలిక లక్ష్యాలపట్ల, వాటిని సాధించే విప్లవ ప్రజాతం త్ర పద్ధతుల పట్ల ఏకీభావంతో ఏర్పడిన ఈ సంబంధ బాంధవ్యాలు ఆయన జీవితం చివ రివరకు కొనసాగాయి. నాలుగు దశాబ్దాల డీఎస్ఓ చరిత్రలో ఆయన అనేక సభల్లో, సమావేశాల్లో తన కంచుకంఠంతో విద్యార్థి లోకాన్ని, యువతను ఉర్రూతలూగించి వారి లో విప్లవోత్తేజం కలిగించి చెరగని ముద్రవే శారు. అంతేగాక అనేక సమస్యలపై డిఎస్ఓ చేపట్టిన మౌలిక అవగాహనతో ఏకీభవిస్తూ ఆ అవగాహనకు అనుగుణంగా తన వాగ్ధాటి ద్వారా, తనదైన శైలిలో వారిని నిరంతరం చైతన్యవంతులను చేశా రు. రిజర్వేషన్ సమస్య, భాషా సమ స్య, ప్రత్యేక తెలంగాణ సమస్య -ఇలాంటి క్లిష్ట సమస్యలపై సాధా రణ విద్యార్థులకు, ప్రజలకు అర్థ మయ్యే రీతిలో అనేక ఉపమానా లతో, కథలతో జోడించి చెప్పేవారు. ఉదాహ రణకు రిజర్వేషన్ వ్యతిరేక, అనుకూల ఉద్య మాలు చెలరేగిన సందర్భంలో ఆయన పాల కుల రిజర్వేషన్ల విధానం విఫలమైందని దాని బూటకత్వాన్ని వివరిస్తూ ‘కౌరవులు పాండవు లకిచ్చిన లక్క ఇల్లు లాంటిదే పాలకులు ప్రజ లకిచ్చిన రిజర్వేషన్లు’ అని వ్యాఖ్యానిస్తూ చీలిక ఉద్యమాల్లోకి పోకుండా విద్యార్థులను చైతన్య వంతులను చేశారు. ఆయన ఉపన్యాసాలు ఉత్తేజకరంగా, విజ్ఞానదాయకంగా ఉండటమేకాక విద్యార్థుల ను కర్తవ్యోన్ముఖులను చేసేవి. విద్యార్థులను, యువతీ యువకులను, భావి భారతదేశ ఆశా కిరణాలుగా జ్వాలాముఖి అభివర్ణించేవారు. నేటి అరాచక, అశ్లీల సంస్కృతి ప్రభావంలో పడకుండా విద్యార్థులు నిరంతరం అప్రమ త్తంగా ఉండాలని, చైతన్యశీలురు కావాలని నిత్యం ప్రబోధించేవారు. పురాణాలలోని, ఇతి హాస కథలలోని, స్వాతంత్య్ర పోరాటంలోని వీరుల త్యాగాలను తరచుగా ఉటంకిస్తూ ఆయన అటువంటి వీరుల నుండి నేటి విద్యార్థులు, యువకులు ప్రేరణ పొంది దేశంలో మౌలిక మార్పుల కోసం, మంచి సమాజ స్థాపన కోసం కృషిచేయాలని ప్రబోధించేవారు. పేదరి కం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం మొద లగు సమస్యలు చుట్టుముట్టినా లెక్క చేయ కుండా జ్వాలాముఖి విప్లవ ఆశయాల కోసం జీవితం అంతా పోరాడారు. త్యాగనిరతి, అంకి తభావం, విప్లవ లక్ష్యంపట్ల చిత్తశుద్ధి, ఉన్నత మైన విలువలు మొదలగు లక్షణాలతో మూర్తీ భవించిన జ్వాలాముఖి విప్లవకర జీవితం నుండి స్ఫూర్తిని, ప్రేరణను పొంది ఆయన ఆశించిన నూతన సమాజస్థాపన కోసం కృషి చేయటమే నేటి విద్యార్థుల, యువజనుల కర్తవ్యం. ఆ విప్లవ తపస్వికి మనమందించే ఉత్తమమైన నివాళులు ఇవే. (నేడు జ్వాలాముఖి ఆరవ వర్ధంతి) జె.ఉపేందర్ ప్రధాన కార్యదర్శి, ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ (డీఎస్ఓ)