ఇరవై వసంతాల మహిళా చైతన్య ప్రస్థానం
సామ్రాజ్యవాద అమెరికాకు దేశాన్ని తాకట్టుపెట్టి, ప్రత్యక్ష దోపిడీకి దేశం తలుపుల్ని బార్లా తెరచిన రోజులవి. సామ్రాజ్యవాద సంస్కృతి స్త్రీని సెక్స్ సింబల్‌గా, సరుకుగా మార్చివేసిన రోజులవి. ప్రభుత్వాలు మహిళా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, సారాను ఏరుల్లా పారిస్తూ, మహిళల కన్నీళ్లను కాసులుగా చేసు కుంటున్న రోజులవి. స్త్రీల సమస్యలు పోవాలంటే, స్త్రీ విముక్తి సాధించాలని మహిళలు కదులుతున్న రోజులవి. ఆకాశంలో సగ మైన మేముపోరాటంలో సగమవుతామనే మహిళా చైతన్యమూ, శ్రమ విముక్తిలోనే స్త్రీ విముక్తి ఉందనే స్పృహా పెరుగుతున్న ఆ కాలంలో.. 20 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ చైతన్య మహిళా సమాఖ్య (సీఎంఎస్) ఆవిర్భవించింది నూతన ప్రజాస్వామిక విప్లవం లక్ష్యంగా ఉన్న వివిధ మహిళా సంఘాలు 1995లో సమాఖ్యగా ఐక్యమయ్యాయి.
15 ఏళ్లు ప్రయాణించిన తదుపరి సమాఖ్య, సంఘంగా రూపొందించింది. మొదటి మహాసభ నుంచీ రాజ్యం సీఎంఎస్‌పై నిర్బంధం ప్రయోగిస్తోంది. సంఘం కార్యవర్గ సభ్యురాలు లక్ష్మిని చంపడం దీనికి పరాకాష్ట. అన్ని నిర్బంధాల్ని, ఒడిదుడుకుల్నీ ఎదుర్కొంటూ సీఎంఎస్ నేడు 20వ మైలురా యిని దాటి ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. తన రాజకీయ, చైతన్య ప్రచార వేదికగా సంస్థ గత 25 ఏళ్లుగా ‘మహిళా మార్గం’ పత్రికను నడుపుతున్నది.
ప్రధానంగా శ్రామిక, విద్యార్థి, ఉద్యోగినుల్లో పనిచేస్తున్న సీఎంఎస్ పీడిత వర్గాల మహిళలందరి సమస్యలపైన స్పందిస్తోంది, ప్రశ్నిస్తోంది, పోరాడుతోంది. పోరాడితే పోయేదేమీ లేదు. మన సమస్యలు తప్ప అనే చైతన్యాన్ని మహిళల్లో పెంచింది. సీఎంఎస్ స్త్రీలపై అన్నిరకాల హిం సలకు వ్యతిరేకంగా ఉద్యమించింది. సారా వ్యతిరేక పోరాటం నుంచి సంక్షేమ పథకాల రద్దుకు వ్యతిరేకంగా, అశ్లీల సంస్కృ తికి వ్యతిరేకంగా పోరాడింది. వరకట్నం, కుటుంబ హింస, లైంగిక హింస, మత, కులపర హింస, సామాజిక హింస, రాజ్య హింస, అన్ని రకాల హింసలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పలు పోరాటాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దళిత, ముస్లిం, ఆదివాసీ మహిళలపై దాడులు జరిగినప్పుడు వారికి మద్దతుగా పోరాటాలు నిర్మించింది.
స్త్రీ సమస్య విడిగా లేదని, స్త్రీ విముక్తి శ్రమ విముక్తితోనే ముడిపడి ఉందనే లక్ష్యంతో పీడిత ప్రజల సమస్యలపై కూడా సంస్థ అనేక ఐక్య కార్యాచరణ ఉద్య మాల్లో పాల్గొన్నది. నేడు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామ్రాజ్యవాద దేశాల చుట్టూ తిరుగుతూ దేశ వన రులను మొత్తంగా వారికి అర్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చైతన్య మహిళా సంఘం తన ముందున్న సంక్లిష్ట లక్ష్యాలను, సరికొత్త సవాళ్లను సమీక్షించి, తన ప్రస్థానాన్ని కొనసాగించడానికి పునరంకితం అవుతోంది,
(నేడు చైతన్య మహిళా సంఘం 20వ వార్షికోత్సవం)
పి. జయ సీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు, మొబైల్: 9441119519