చదువుతోనే సామాజిక ప్రగతి
రంగారెడ్డి జిల్లా: విద్యారంగాభివృద్ధితోనే సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
శంషాబాద్లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో జనాభా అధికంగా ఉన్నా నైపుణ్యాలు కొరవడినపుడు అది శాపంగా పరిణమిస్తుందన్నారు. యువతలో నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. అణగారిన వర్గాలు చదువుకోవడానికి ఎన్నో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం చిన్న జిల్లాల ఏర్పాటుతోనే సమస్యలకు పరిష్కారం లభించదన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో మార్పుతోనే పురోగతి సాధ్యమని చుక్కా రామయ్య స్పష్టం చేశారు.