పోరాటం..సఫలం
మెదక్, న్యూస్‌లైన్: చెరకు రైతులకు తీపి కబురు. నిజాం చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ నిర్ణయంతో ప్రైవేటీకరణ కోసం వేసిన ఎత్తులు చిత్తుకాగా, రైతుల పదేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. అన్నీ అనుకున్నట్లే జరిగితే జిల్లాలోని చెరకు రైతులకు మద్దతు ధర దక్కడంతో పాటు చెరకు సాగు విస్తీర్ణం కూడా భారీగా పెరగనుంది.
నష్టాల బూచి చూపి..
మెదక్ నియోజకవర్గంలోని మంభోజిపల్లిలో ఏర్పాటు చేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని నష్టాల బూచి చూపుతూ 2001లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కారుచౌకగా అమ్మేసింది. సుమారు రూ.600 కోట్ల విలువచేసే ఫ్యాక్టరీ ఆస్తులను కేవలం 67 కోట్లకే డెల్టా పేపర్ యజమాన్యానికి అప్పటి పాలకులు అమ్మేశారు. అదికూడా 8 ఏళ్లలో డబ్బులు చెల్లించే అవకాశాన్ని ఉదారంగా ప్రైవేట్ యాజమాన్యానికి కట్టబెట్టారు. 51 శాతం వాటాను ప్రైవేట్ యజమాన్యానికి 49 శాతం వాటా ప్రభుత్వ యాజమాన్యంలో ఉండేలా ఒప్పం దం చేసుకున్నారు. అప్పట్లో ఈ విషయంపై రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో అనంతరం అధికారంలోకి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఆగస్టు 31న జువ్వాడి రత్నాకర్‌రావు ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో కూడిన అసెంబ్లీ హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. సుమారు రెండేళ్లపాటు పరిశీలన జరిపిన ఈ కమిటీ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వ పరం చేసుకోవాలని సూచిస్తూ 2006 ఆగస్టు 31న 345 పేజీలతో కూడిన నివేదికను అసెంబ్లీకి సమర్పించింది. అయితే వైఎస్ మరణానంతరం ఆ నివేదికను అమలుకు నోచుకోకుండా పోయింది.
రైతుల పోరాటం
నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ కొంతమంది రైతులు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం కూడా ఫ్యాక్టరీ భవితవ్యం తేల్చేందుకు 2013 డిసెంబర్ 13న ఏడుగురు మంత్రులతో ఉప సంఘాన్ని నియమించింది. ఈ మేరకు జీవో నంబర్ 5435ను జారీ చేసింది. కాగా రైతుల నుంచి అభిప్రాయం కోరాలంటూ గత నెలలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని రైతులు తీర్మానించారు. ఇదే సమయంలో మంత్రివర్గ ఉప సంఘం ప్రైవేటీకరణ వైపు మొగ్గుచూపుతుందన్న అనుమానంతో రైతు సంఘాల నాయకులు హైకోర్టులో 5/2014 ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
దీంతో సర్కార్ ఇచ్చిన జీఓను హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లాలని, పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయిస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతులు తీర్మానం చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ ప్రజాఫ్రంట్ కార్యదర్శి, హైకోర్టులో పిల్ దాఖలు చేసిన న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, ఈటేల రాజేందర్, కోదండరాం, వేదకుమార్, శ్రీనివాస్‌గౌడ్, రైతు పోరాట కమిటీ నాయకులు నాగిరెడ్డి, దేవేందర్‌రెడ్డి, సీపీఎం నాయకులు రాంచంద్రారెడ్డి, సీపీఐ వెంకయ్య, బీజేపీ నుండి భూంరావు తదితరులు హాజరయ్యారు. ఈ పరిణామాలను గమనించిన మంత్రివర్గ ఉప సంఘం అప్పటికప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వపరం చేసుకోవాలని సిఫారసు చేసింది.
పదేళ్ల పోరాటం ఫలితమిది
పదేళ్లుగా చేస్తున్న పోరాటానికి నేడు ఫలితం లభించింది. మెదక్ ఫ్యాక్టరీ పరిధిలో 12 మండలాలకు చెందిన సుమారు 3,500 మంది రైతులకు ప్రయోజనం లభించనుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా రైతన్నల సహకారంతో పోరాటం చేశాం. ప్రభుత్వం వెంటనే మంత్రివర్గ ఉప సంఘం సిఫారసును ఆమోదించాలి.
- నాగిరెడ్డి, చెరుకురైతు పోరాట సమితి నాయకులు, మెదక్.