ప్రాధాన్యతా రంగాలపై త్వరలో ఎగ్జిబిషన్
ఏలూరు (మెట్రో)
జిల్లాలో రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాధాన్యతా రంగాల శాఖలతో డిసెంబరు నెలలో భారీ ఎత్తున ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం వ్యవసాయం, మత్స్యశాఖ, ఉద్యానవనశాఖ, పశుసంవర్ధక శాఖ, ఏపి డైయిరీ, మార్కెటింగ్ ప్రాధాన్యతా రంగాల అధికారులతో ఎజెసి షరీఫ్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతులందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో వ్యవసాయ, ఉద్యానవనం, మత్స్యశాఖ రైతులకు ఉపయోగపడే విధంగా ఉపకరణాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వివిధ కంపెనీలను భాగస్వాములను చేయనున్నట్లు చెప్పారు. కంపెనీలు ఎగ్జిబిషన్లో వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, స్ప్రేయర్లు వంటివి ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్టాల్స్ ఏర్పాటు చేసి అందించనున్నట్లు చెప్పారు. అధికారులు కిందిస్థాయి సిబ్బందికి సమావేశాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు అవసమరైన సహాయ సహకారాలు సూచనలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు కూడా తరచూ క్షేత్రస్థాయికి వెళ్లి రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు అందించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఒ డిడీ సాంబశివరావు, వ్యవసాయశాఖ జెడి సాయిలక్ష్మీశ్వరి, పశుసంవర్ధకశాఖ జెడి జ్ఞానేశ్వర్, ఫిషరీస్ డిడి జాకబ్ భాషా, ఉద్యానవనశాఖ ఎడిలు విజయలక్ష్మి, దుర్గేష్, మార్కెఫెడ్ జిల్లా మేనేజరు నాగమల్లిక పాల్గొన్నారు.