బొగ్గు ధరలపై విజయ్‌సాయిరెడ్డి సూటి ప్రశ్న
న్యూఢిల్లీ: దిగుమతి చేసుకుంటున్న బొగ్గు ధరల హెచ్చుతగ్గుల నుంచి ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్లను బయటపడేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందా లేదా అని బొగ్గు శాఖమంత్రిని రాజ్యసభలో వైఎస్సార్సీపీ నేత విజయ్ సాయి రెడ్డి ప్రశ్నించారు. ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్ల(యూఎంపీపీ)లో వాడుతున్న దిగుమతి బొగ్గుకు ఇండెక్స్ ధరలు నిర్ణయించడానికి ఏం ఫార్ములా వాడుతున్నారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త విధానంతో ముంద్రా, కృష్ణపట్నంలో ఉన్న పవర్ ప్లాంట్లకు లబ్ది చేకూరుతుందో లేదో తెలపాలని పేర్కొన్నారు.
విజయ్ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు విద్యుత్, బొగ్గు గనుల సహాయ మంత్రి సమాధానమిచ్చారు. వాటాదారుల సంప్రదింపులు, స్టాండర్డ్ బైండింగ్ డాక్యుమెంట్ల ప్రకారం నిపుణుల కమిటీ రిపోర్టును రూపొందించిందని, దేశీయ కోల్ బ్లాక్‌ల కేటాయింపులకు అనుగుణంగా ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్లకు మార్గదర్శకాలకు రూపొందించామని చెప్పారు. యూఎంపీపీల కోసం బొగ్గు దిగుమతులు ఇంకా ఖరారులోనే ఉన్నాయని పేర్కొన్నారు.