భూమాత మాట్లాడగలిగితే..!
రేప్ అయిన అమ్మాయి గురించిఆత్మ వచ్చి సాక్ష్యం చెప్పలేదు. ఎందుకంటే.. తను చనిపోయింది.హతురాలైన ఆ అమ్మాయి గురించి పిపిలీ గ్రామం సాక్ష్యం చెప్పలేదు. ఎందుకంటే ఆమె దళితురాలు.పొలంలో ఆమెపై రేప్ జరిగింది కనుక.. ఆ భూమాత మాట్లాడితే కానీ నిజం బయట పడదా?! ఆమెకు న్యాయం చేకూరదా?
గొల్లుమని ఏడుపు.. ఆసుపత్రి బయట!
తల్లి గుండెలు బాదుకుంటోంది. తండ్రి చేష్టలుడిగి పోయాడు. ఆమె కుప్పకూలి పోతుండగా అతడు ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. లోపల ఒక అమ్మాయి చనిపోయింది.చనిపోయిన ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్లు. అప్పటికి ఏడు నెలలుగా ఆ అమ్మాయి చావుబతుకుల మధ్య సెమీ–కోమాలో రెపరెపలాడుతోంది. కళ్లు తెరుస్తోంది. చూస్తోంది. వెంటనే స్పృహ కోల్పోతోంది. ఒక్క మాటైనా మాట్లాడగలిగే స్థితిలో లేదు. ఇరవై మూడేళ్ల ‘నిర్భయ’పై బస్‌లో గ్యాంగ్ రేప్ జరగడానికి ఐదు నెలల ముందు.. కటక్‌లోని శ్రీరామ చంద్ర భాంజా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో పందొమ్మిదేళ్ల ఆ ఒడిశా అమ్మాయి కోమాలోంచి మరణంలోకి జారుకున్న సంగతి.. నిర్భయ ఘటన వచ్చినంతగా నేటికీ ప్రపంచం దృష్టికి రాలేదు!‘‘బాడీని తీసుకెళ్లండి’’.. లోపల్నుంచి ఎవరో వచ్చి చెప్పారు. 2012 జూన్ 21 ఆ రోజు.
చెడ్డ రోజు అది ఆ తల్లిదండ్రులకు. అయితే వారి జీవితంలో అంతకన్నా చెడ్డ రోజు.. నవంబర్ 28, 2011.‘‘వరి పొలాల్లో పడి ఉంది. ఒంటి మీద బట్టల్లేవు. చూస్తుంటే... మనమ్మాయిలా ఉంది’’ఉదయాన్నే ఇంటి ముందుకు కబురు! తల్లికి కడుపులో దేవినట్లుగా అయింది. ‘భగవంతుడా.. నా కూతురు కాకూడదు’.. చెప్పులైనా వేసుకోకుండా పొలాల్లోకి పరుగులు తీసింది. వెనకాలే ఆమె భర్త. పొలాల్లో పడి ఉన్నది వాళ్ల కూతురే! ‘నా కూతురు కాకూడదు దేవుడా’ అని అంతకుముందే వేడుకున్న ఆ తల్లి.. కూతుర్ని ఆ స్థితిలో చూసి.. ‘ఏ కూతురికీ ఇలా కాకూడదు దేవుడా’ అని అక్కడే కూలబడిపోయింది. కూతురి ఒంటి మీద బట్టలు చిరిగి ఉన్నాయి. దేహంపై కొన్ని చోట్ల బట్టలు పక్కకు తప్పి ఉన్నాయి. తీవ్రమైన గాయాలున్నాయి. రక్తం మరకలున్నాయి. కాస్త ఊపిరి కూడా ఉంది.‘అమ్మా.. నా తల్లీ’ అని కూతుర్ని చేతుల్లోకి ఎత్తుకున్నాడు తండ్రి. దళిత కుటుంబం వారిది. అర్జునగొడ వాడ వారుండేది.
అర్జునగొడ íపిపిలీ గ్రామంలో ఉంటుంది. పిపిలీ గ్రామం పూరి జిల్లాలో ఉంటుంది. పూరి జిల్లా ఒడిశాది. ఒడిశా నవీన్ పట్నాయక్‌ది. ముఖ్యమంత్రి ఆయన. ఆయన వరకు వెళ్లింది విషయం.ఇక్కడ.. లోకల్ ఆసుపత్రి నుంచి పై ఆసుపత్రికి, పై ఆసుపత్రి నుంచి ఆ పై ఆసుపత్రికి.. అక్కడి నుంచి కటక్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి చేరింది.. కొన ఊపిరితో ఉన్న ఆ యువతి దేహం. ఎవరు చేశారు? నలుగురు యువకులు. ఏం చేశారు? ఆ కన్న హృదయాలు చెప్పలేకపోయాయి. పోలీసులు చెప్పారు. కిడ్నాప్, అత్యాచారం, హత్యాయత్నం. ఢిల్లీ యువతి నిర్భయ, ఆ ఒడిశా యువతి.. ఇద్దరూ డెత్బెడ్ మీద ఉండి ఇంటికి చేరకుండానే కన్ను మూసినవారే.
నిర్భయ తన ప్రాణాలతో పద్నాలుగు రోజులు పోరాడి ఓడిపోయింది. ఆ పద్నాలుగు రోజుల్లోనూ మెలకువ వచ్చిన ప్రతిసారీ ఆమె అన్నమాట ఒక్కటే.‘వాళ్లను వదిలిపెట్టొద్దు.. వాళ్లను వదిలిపెట్టొద్దు.’వదిలిపెట్టలేదు న్యాయస్థానం. మొత్తం ఆరుగురు. రామ్‌సింగ్, ముఖేశ్‌సింగ్, వినయ్‌శర్మ, ఒక మైనర్, పవన్‌గుప్త, అక్షయ్ ఠాకూర్! మైనర్కి తప్ప అందరికీ మరణశిక్ష పడింది. కేసు విచారణలో ఉన్నప్పుడే రామ్‌సింగ్ తీహార్ జైల్లో చనిపోయాడు. మైనర్ని కోర్టు విడుదల చేసింది. కోర్టు నిబంధనల ప్రకారం మైనర్ పేరు బయట పెట్టకూడదు. కానీ పేరు బయటికి వచ్చి ఉంది. అతడికి రెండు పేర్లు ఉన్నాయి. మహ్మద్ అఫ్రోజ్, రాజు.
నిర్భయ అయినా ‘వాళ్లను వదిలిపెట్టొద్దు’ అని అనగలిగింది కానీ, ఆ పందొమ్మిదేళ్ల ఒడిశా అమ్మాయికి అలా అనే ఓపిక కూడా లేకపోయింది. తనసలు ఈ లోకంలోనే లేదు. నిర్భయ ఘటన జరగడానికి ముందే.. అలాంటి దారుణమైన అకృత్యానికే గురైన అభాగ్యురాలు ఆమె. న్యాయస్థానాలు ఆమె పేరును బయట పెట్టకూడదని ఆంక్షలు విధించాయి కనుక ‘నిర్భాగ్య’ అనే పిలుచుకుందాం. ఆమెకు జరిగిన ‘న్యాయం’ ఏమిటో తెలుసుకుంటే ఆమెను నిర్భాగ్య అనకపోవడం అన్యాయమే అనిపిస్తుంది.
గొల్లుమని ఏడుపు.. కోర్టు బయట!
తల్లి గుండెలు బాదుకుంటోంది. తండ్రి చేష్టలుడిగి పోయాడు. ఆమె కుప్పకూలి పోతుండగా అతడు ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. లోపల ఒక అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది. అన్యాయం జరిగిన ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్లు. నిర్భయ కేసులో తొమ్మిది నెలలకు తీర్పు వచ్చింది. ఈ ‘నిర్భాగ్య’ కేసులో ఏడేళ్లకు తీర్పు వచ్చింది! నిర్భయ కేసులో అందరికీ ఉరిశిక్ష పడింది. నిర్భాగ్య కేసులో అందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు! అందరూ అంటే నలుగురు. ప్రశాంత్ ప్రధాన్, సుకాంత్, గుణస్వాయిన్, ప్రేమానంద నాయక్. మొదటి ఇద్దరూ అన్నదమ్ములు. వాళ్లిద్దర్నీ సరైన సాక్ష్యాధారాలు లేవని డిసెంబర్ 24న కోర్టు విడుదల చేసింది.
తీర్పు విన్న వెంటనే నిర్భాగ్య తల్లిదండ్రులు అచేతనులయ్యారు. ‘నా కూతురు ఆత్మ శాంతించదు’ అని ఆ తల్లి బోరున విలపించింది. మిగతా ఇద్దరి పేర్లు అసలు చార్జిషీటులోనే లేవు! అయితే పాత పోలీస్ రికార్డుల్లో ఉన్నాయి.2008లో పిపిలీ గ్రామంలో జరిగిన ఒక లైంగిక వేధింపుల కేసులో వీళ్లు నలుగురూ నిందితులు. వాళ్లు చేసిన తప్పుడు పనికి సాక్ష్యమిచ్చింది నిర్భాగ్య. అప్పుడు ఆ అమ్మాయి వయసు పదహారేళ్లు. అప్పుడే ఆమె మీద ఆ నలుగురి కన్నుపడింది. పడిన విషయం ఐదో కంటికి తెలీదు. ఇప్పుడు కోర్టు కంటికీ తెలియలేదు. తెలియనివ్వలేదు.
సత్యమేవ జయతే : ఒడిశా మంత్రి!
పద్దెనిమిదేళ్లుగా ఒడిశాకు నవీన్ పట్నాయకే సీఎం. ఆయన పార్టీ బి.జె.డి. (బీజూ జనతాదళ్’). 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో ముఖ్యమంత్రి పార్టీకి ప్రస్తుతం ఉన్న సీట్లు 118. కాంగ్రెస్‌కు పదిహేను, బీజేపీకి పదీ ఉన్నాయి. ఉన్న కొద్ది సీట్లోతోనే ‘నిర్భాగ్య’ కోసం పోరాడుతున్నాయి ప్రతిపక్షాలు. అయితే ‘నిర్భాగ్య’ను చంపిన హంతకులను కింది కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడంపై ‘స్టేట్ క్రైమ్ బ్రాంచి’ హైకోర్టుకు వెళుతోంది కాబట్టి అంతకుమించి ప్రభుత్వమైనా చేయవలసింది ఏముంటుందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రదీప్ మహారథి అంటున్నారు. దోషులను రక్షిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో 2012లోనే ఆయన తన మంత్రి పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది.
ఇప్పుడు మళ్లీ అదే మంత్రి పదవిలో ఉండి, ‘సత్యమేవ జయతే. బాధితురాలికి న్యాయం జరగాలి’ అని అనడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ‘మహారథి మెదడు లోపల ఏముందో మాకు తెలియడం లేదు. ఆయన పలికిన ‘న్యాయం’ అనే మాటకు అర్థమేమిటో ఆయన చెప్పాలి’’ అని మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుమిత్రా జెనా అన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ నాయకురాలు ప్రభాతీ పరిదా విమర్శిస్తున్నారు.