ఇచ్ఛాపురపు ఇక లేరు
సాక్షి, విశాఖపట్నం/ఎంవీపీకాలనీ : ప్రముఖ రచయిత, సావిత్రి బాయిపూలే ట్రస్ట్ సలహాదారు, ఆంధ్రప్రదేశ్ అవయవ దాతల సంఘం ముఖ్య కార్యకర్త ఇచ్ఛాపురపు రామచంద్రం (72) ఆకస్మికంగా మతి చెందారు. ఆయన గుండె సంబంధిత ఇబ్బందితో ఈ నెల 5న నగరంలోని ఇండస్ ఆస్పత్రిలో చేరడంతో ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. ఆయన పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం 11 గంటలకు మరణించారు. రామచంద్రం మరణంతో రచయితలు, కవులు, అవయవ దాతల సంఘం ప్రతినిధులు దిగ్భ్రాంతికి గురయ్యారు. రామచంద్రం భార్య ఇదివరకే కన్నుమూశారు. ఆయనకు కుమార్తె కవిత, కుమారుడు రాజేంద్ర ఉన్నారు. అనకాపల్లిలో జీవిత బీమా సంస్థలో పనిచేసిన ఆయన పదవీ విరమణ అనంతరం నగరంలోని ఎంవీపీకాలనీలో ఉంటున్నారు. ఇలావుండగా ఇచ్ఛాపురపు కోరిక మేరకు ఆయన కళ్లను మోహిసిన్ ఐ బ్యాంకుకు, పార్ధివదేహాన్ని ఆంధ్ర మెడికల్ కళాశాలకు గురువారం సాయంత్రం అందజేశారు. రామచంద్రం పార్ధివదేహానికి ఆలిండియా ఆర్గాన్, బాడీ డోనార్స్ అసోసియేషన్ చైర్పర్సన్ గూడూరు సీతామహలక్ష్మి, సి.ఎస్.రావు, ఆనంద్, కన్యాకుమారి, ఎస్.సుమతి, అట్లూరి జ్యోతి, కె.బాలభాను, తదితరులు నివాళులు అర్పించారు.
పలు రచనలు
ఇచ్ఛాపురపు రామచంద్రం 500లకు పైగా కథలు, కథానికలు, రేడియో నాటికలు రాసి ప్రజాదరణ పొందారు. కాశీమజిలీ కథలను అనువాదం చేశారు. అంతేగాక అవయవ దాన ఆవశ్యకతపై సాగిస్తున్న ఉద్యమాన్ని వెన్నుదన్నుగా నిలిచారు. ఈ నెల 6న ప్రపంచ అవయవదాన దినోత్సవానికి ప్రెస్‌నోట్ స్వయంగా ఆయనే తయారు చేశారు.
తీరని లోటు
రామచంద్రం మంచి రచయిత. ఆయన అకాల మరణం అవయవ దాన ఉద్యమానికి తీరని లోటు. అవయవదాన ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ముందుకు నడిపించారు. అవయవ దానంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు, వినతిపత్రాలు వంటివెన్నో ఆయనే రాసేవారు. ఈ నెల 6న జరిగిన ప్రపంచ అవయవదాన దినోత్సవానికి పత్రికా ప్రకటన కూడా ఆయనే తయారు చేశారు.
–గూడూరు సీతామహలక్ష్మి, ఆలిండియా అవయవదాతల సంఘం చైర్పర్సన్