కరుణానిధి సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్వహిస్తోన్న శాఖలను ఆర్థిక మంత్రి ఓ. పన్నీర్ సెల్వంకు అప్పగించడంపై డీఎంకే చీఫ్ కరుణానిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. సెల్వంకు కొత్త బాధ్యతలు కట్టబెడుతూ మంగళవారం రాత్రి రాజ్ భవన్ విడుదల చేసిన ప్రకటనలోని అంశాలపై విస్మయం వ్యక్తం చేశారు.
బుధవారం చెన్నైలో మాట్లాడిన కరుణానిధి.. 'సీఎం జయలలిత సూచన మేరకు మంత్రి పన్నీర్ సెల్వంకు అదనపు బాధ్యతలు ఇస్తున్నామని గవర్నర్ ప్రకటనలో పేర్కొన్నారు. గడిచిన 19 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను దూరంగానైనా చూసేందుకు ఏఒక్కరినీ అనుమతించడం లేదు. అలాంటిది 'సీఎం సూచన మేరకు'అని గవర్నర్ ఎలా చెబుతారు? ఇన్ చార్జి గవర్నర్ జారీచేసిన ఆదేశాలు చదివిన ఏఒక్కరికైనా ఇలాంటి సందేహాలు రావని అనుకోను' అని అన్నారు. (చదవండి.. అమ్మ నిర్ణయం: తమిళనాడులో కీలక పరిణామం)
సీఎం జయలలితను పరామర్శించిన ఇన్ చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు, కేరళ సీఎం పినరయి విజయ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా ఇతరులు ఎవ్వరు కూడా కనీసం ఆమెను చూడలేదని, కేవలం వైద్యులతో మాట్లాడివచ్చారని కరుణానిధి అన్నారు. సీఎం ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాలని మొదటి నుంచీ తాను డిమాండ్ చేస్తున్నట్లు గుర్తుచేశారు.