ప్రాణం తీసిన వెలి
లంకమాలపల్లి (పెరవలి): కులపెద్దలు వెలి వేయడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెరవలి మండలం లంకమాలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మాతా సంజీవ్ (28)పై 2012లో పశువుల పాక దహనం చేసాడని ఆరోపణ ఉంది. దీనిపై నాలుగేళ్లుగా కుల పెద్దల వద్ద పంచాయితీ జరిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 11న సంజీవ్ కుటుం బాన్ని కుల పెద్దలు వెలి వేశారు. వీరితో ఎవరూ మాట్లాడకూడదని, సహాయం చేయకూడదని తీర్పు చెప్పారు. అయితే ఈనెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో జరిగిన వేడుకల్లో సంజీవ్ డ్యాన్సులు వేశాడు.
దీనిని చూసిన కుల పెద్దలు సంజీవ్‌ను రానివ్వద్దని హుకుం జారీ చేశారు. దీంతో సంజీవ్ కన్నీటి పర్యంతమయ్యాడు. అవమాన భారం భరించలేక రోజుపాటు ఇంటి నుం చి బయటకు రాలేదు. ఎవరితో మాట్లాడకుండా ఉండలేనని, ఈ బతుకు తనకు వద్దని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కుటుంబ సభ్యుల వద్ద ఆదివారం ఉదయం బోరున విలపించాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం 4 గంటల సమయంలో కుటుంబసభ్యులు తలుపులు బద్దలు కొట్టి సంజీవ్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెరవలి ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల ను విచారించారు.
‘కులపెద్దలే చంపేశారు’
తన తమ్ముడిని కులపెద్దలే పొట్టన పెట్టుకున్నారని మృతుని అన్న రాజీవ్ కన్నీరుమున్నీరుగా విలపించారు. అంబేడ్కర్ జయంతి వేడుకల్లో తన తమ్ముడు పా ల్గొంటే కుల పెద్ద బీరా చంద్రయ్య తీవ్రంగా అవమానపర్చాడని ఎస్సై నాగరాజుకు ఫిర్యాదు చేశాడు.
మిన్నంటిన రోదనలు
‘నాన్నా లే నాన్నా’ అంటూ మృతుని కుమారుడు, కుమార్తె బోరున విలపిం చారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతు ని భార్య అనూష ఉపాధి కోసం కువైట్‌లో ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు చెప్పారు.