‘బస్తీ ఆస్తి...ఇకపై భారం జాస్తీ’
సాక్షి, కాకినాడ :సామాన్య, మధ్యతరగతి ప్రజలు నడ్డివిరిచేలా భూముల మార్కెట్ విలువలు పెంచేశారు. తమ భూములను వారసుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలన్నా భారం భరించాల్సిందే. నగర, పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువను 30 శాతం మేరపెంచుతూ రిజిస్ట్రేషన్ విలువల పెంపు నిర్ణాయక జిల్లా కమిటీ సమావేశంలో తీర్మానం చేశారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ పెంపు నిర్ణయాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
‘బస్తీ ఆస్తి...ఇకపై భారం జాస్తీ’
ప్రాంతాన్ని బట్టి మార్కెట్ విలువలను గరిష్టంగా పెంచుతూ బుధవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో పెంపుపై తుది నిర్ణయం తీసుకునేందుకు కమిటీ చైర్మన్, జేసీ ఆర్ ముత్యాలరాజు అధ్యక్షతన బుధవారం విడతల వారీగా సమావేశమైన కమిటీ ముమ్మర కసరత్తు చేసింది. జిల్లా పరిషత్ సీఈఒ సూర్యభగవాన్, కాకినాడ, రాజమండ్రి జిల్లా రిజిస్ట్రార్లు విజయలక్ష్మి, ఎం.శ్రీనివాసరావు, కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్లతో పాటు ఏడుమున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీల కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.
ఎంత శాతం పెంచాలి..ప్రభుత్వానికి ఏ మేరకు ఆదాయం సమకూరుతుంది? వంటి అంశాలపై సమీక్షించారు. తొలుత ప్రతిపాదించిన 50 నుంచి 60 శాతం మేర పెంచితే ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనున్నప్పటికీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని పలువురు కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు విడతల వారీగా ఈ వడపోత సాగింది. చివరకు భూముల మార్కెట్ విలువను 30 శాతం పెంచాలని కమిటీ నిర్ణయానికి వచ్చింది. నగర, పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో మార్కెట్ విలువలను పెంచడం వల్ల ప్రయోజనం ఉండదని నిర్ణయానికి వచ్చిన కమిటీ వాటి జోలికి పోలేదు. సెమీ స్లమ్ ప్రాంతాల్లో 2 నుంచి 10 శాతం విలువ పెంచారు.
ఆ తర్వాత ప్రాంతాల అభివృద్ధిని పరిగణనలోకి తీసుకొని పెంపును వర్తింప చేశారు. కనీసం 10 నుంచి 30 శాతం వరకు ఈ పెంపు ఉండాలని తీర్మానించారు. శరవేగంగా అభివృద్ధి చెందే నగరాలు, పట్టణాల్లో అవసరాన్ని బట్టి పెంపును సవరించుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఉదాహరణకు మార్కెట్ విలువ సెంటు భూమి రూ.లక్ష రూపాయలుంటే ఆగస్టు 1 నుంచి లక్షా 30వేలు పలుకనుంది. ఈపెంపు వల్ల భూముల రిజిస్ట్రేషన్ విలువ కూడా భారీగా పెరగనుంది. ఈ పెంపు వల్ల రూ.180 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకురూతుందని జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ అంచనా వేస్తోంది. కమిటీలో గరిష్టంగా 30శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నా..క్షేత్రస్థాయిలో ఈపెంపు కొన్ని ప్రాంతాల్లో 50 శాతం వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భూముల విలువ పెంపుపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు పెంచినా 10శాతానికి మించలేదని వారన్నారు.