పీడియాట్రీ కౌన్సెలింగ్
మా బాబు వయసు పదేళ్లు. వాడు ఇప్పటికీ పక్కతడుపుతూనే ఉంటాడు. రాత్రిళ్లు ప్రతి రెండు గంటలకోసారి యూరిన్‌కు వెళ్తుంటాడు. పగలు కూడా ఎక్కువగానే వెళ్తుంటాడు. ఈ సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటాడు. మావాడి సమస్యకు తగిన సలహా ఇవ్వండి.
- ధరణి, భీమవరం
మీ బాబుకు ఉన్న కండిషన్‌ను ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అని చెప్పవచ్చు. యూరిన్ పరిమాణం ఎక్కువ వస్తోంది కాబట్టి పాలీయూరియా అన్న కండిషన్ కూడా ఉందేమోనని కూడా అనుమానించాలి. ఈ సమస్యకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా తాగడం, యూరినరీ ఇన్ఫెక్షన్స్, మానసిక సమస్యలు, ఎండోక్రైన్ సమస్యలు, యూరినరీ బ్లాడర్ డిజ్‌ఫంక్షన్, దీర్ఘకాలికమైన కిడ్నీ సమస్యలు, మలబద్దకం వంటివి ముఖ్యమైనవి.
మీ బాబు సమస్యకు కారణాన్ని తెలుసుకోడానికి కంప్లీట్ యూరిన్ అనాలిసిస్, 24 గంటల్లో అతడు విసర్జించే మూత్రపరిమాణం పరీక్షలతో పాటు యూరిన్ ఆస్మనాలిటీ, అల్ట్రాసౌండ్ ఆఫ్ కేయూబీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. సాధారణంగా సాయంత్రం నుంచి రాత్రివరకు ఈ పిల్లలు నీళ్లు ఎక్కువగా తాగకుండా చూడటం, తియ్యటి పదార్థాలను ఎక్కువగా తినకుండా చూడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
యూరిన్ పాస్ చేసేటప్పుడు విసర్జన పూర్తిగా చేసేలా చూడటం ప్రధానం. ఇలాంటి మంచి విసర్జక అలవాట్లతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. అయితే పైన పేర్కొన్న కారణాలలో ఏవైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించండి. మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి.
- డాక్టర్ రమేశ్‌బాబు దాసరి,సీనియర్ పీడియాట్రీషియన్
స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్