సర్వే సమగ్రం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే లక్ష్యాన్ని మించింది. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సర్వే అర్ధరాత్రి వరకు సాగింది. జిల్లావ్యాప్తంగా 7,89,206 కుటుంబాలను సర్వే చేయాలని అంచనా వేయగా.. ఇది కాస్తా 8,33,592కు చేరింది. నగర శివార్లలో ఇబ్బడిముబ్బడిగా కుటుంబాల సంఖ్య పెరిగిపోవడంతో ఎన్యూమరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సగటున ఒక్కొక్కరికి 30 గృహాలనే కేటాయిస్తున్నట్లు అధికారయంత్రాంగం పేర్కొన్నా.. క్షేత్రస్థాయిలో వాటి సంఖ్య వందకుపైగా ఉండడంతో రాత్రి పొద్దుపోయేవరకు సర్వే కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు రోజుల క్రితం ఇళ్లకు అంటించిన స్టిక్కర్ల ఆధారంగా కుటుంబాల సంఖ్య నమోదు చేసినప్పటికీ.. చివరిరోజు కొత్త కుటుంబాల సంఖ్య పుట్టుకురావడం యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. కొన్నిచోట్ల సర్వే ఫారాలు కొరత ఏర్పడడంతో ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది.
దాదాపు ప్రతి మండలంలోనూ కుటుంబాల సంఖ్య భారీగా పెరిగింది. ప్రీ విజట్లో రికార్డుచేసిన ఇళ్లకంటే దాదాపు పది శాతం అధికంగా నమోదు కావడం విశేషం. మరోవైపు ఎన్యూమరేటర్లకు తగిన రవాణా, భోజన వసతి కల్పించకపోవడంతో చాలాచోట్ల ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కీసర, శామీర్పేట, ఇబ్రహీంపట్నం, పరిగి తదితర ప్రాంతాల్లో ఎన్యూమరేటర్లు..
ముఖ్యంగా ప్రైవేటు కాలేజీల విద్యార్థులు, ఉపాధ్యాయులు కనీస వసతులు కల్పించలేదని ఆందోళన చేశారు. ఇదిలావుండగా సర్వే ఆవశ్యకతపై విస్తృతంగా ప్రచారం చేయడంతోనే జిల్లాలో సమగ్ర సర్వే విజయవంతమైందని కలెక్టర్ ఎన్ .శ్రీధర్ అన్నారు. ఇక సమగ్ర కుటుంబ సర్వేలో మిగిలిపోయిన కుటుంబాల సర్వే విషయంలో ప్రభుత్వం మరో వారంలో నిర్ణయం తీసుకుంటుందని గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ బుధవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వివరించారు.