విద్యార్థులను పెంచేశారు..!
బీసీ, ఎస్సీ హాస్టళ్లలో అనూహ్యంగా పెరిగిన విద్యార్థులు
నెలలోనే 4 వేలకు చేరిన వారి సంఖ్య
సన్నబియ్యం పక్కదారి పట్టించేందుకేనా..?
వారి సంఖ్య ప్రకారమే బియ్యం సరఫరా
జనవరిలో మిగిలిన 2,536 క్వింటాళ్ల బియ్యం
నల్లగొండ : సంక్షేమ వసతి గృహాలకు సరఫరా చేస్తున్న సన్న బియ్యం పక్కదారి పడుతోందా..? కిలో రూ.1 చొప్పున ప్రభుత్వ పంపిణీ చేస్తున్న బియం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తోందా..? సంక్షేమ హాస్టళ్లలో అనూహ్యంగా పెరిగిన విద్యార్థుల సంఖ్యను చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. సంక్షేమ హాస్టల్స్‌లో సాధారణంగానే విద్యార్థుల హాజరు ఎక్కువ..తక్కువ చూపించే వార్డెన్లు సన్న బియ్యం అమల్లోకి వచ్చే సరికి విద్యార్థుల సంఖ్యను అనూహ్యంగా పెంచేశారు. దొడ్డు బియ్యం అప్పుడు లేని విద్యార్థులు సన్న బియ్యం వచ్చే సరికి వందల సంఖ్యలో పుట్టుకురావడంపైనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనవరిలో సంక్రాంతి సెలవులు, ఆదివారాలు మినహాయిస్తే చాలా వరకు విద్యార్థుల హాజరుశాతం హాస్టళ్లలో తక్కువగానే ఉంటుంది. కానీ విచిత్రమేమం టే జనవరిలో విద్యార్థులు పెరగడం వెనక మరమ్మమేమిటిన్నది అధికారులకే తెలియాలి.
మిగులుతున్న బియ్యం..
విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చూపిస్తున్న వార్డెన్లు ఆ మేరకు ఎక్కువ మొత్తంలో బియ్యాన్నే హాస్టళ్లకు డంప్ చేస్తున్నారు. దీంతో నెలాఖరు నాటికి బియ్యం నిల్వలు పేరుకు పోతున్నా యి. మరుసటి నెలకు అవసరమయ్యే బియ్యంలో నిల్వ ఉన్న బియ్యాన్ని మినహాయించి సివిల్ సప్లయ్ సరఫరా చేస్తోంది. కానీ విద్యార్థుల హాజరు శాతాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా హాస్టల్స్‌కు మంజూరు చేసిన విద్యార్థుల సంఖ్య ప్ర కారం బియ్యం పంపిణీ చేస్తున్నందునే నెలఖారునాటికి బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. ఆ తర్వాత కాలక్రమే ణ హాస్టల్స్‌లో విద్యార్థులు పెరిగినట్లుగా లెక్కలు చూపిస్తూ మిగిలిన బియ్యాన్ని కాజేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే పద్ధతి దొడ్డు బియ్యం అప్పుడు అమలు చేశారు కానీ అప్పుడు విద్యార్థుల హాజరు తక్కువ చే సి చూపించారు. జనవరిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లకు 8 వేల క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేశారు. దీంట్లో 5,464 క్వింటాళ్లు వినియోగం కాగా...2,536 క్వింటాళ్లు హాస్టల్స్‌లో నిల్వ ఉన్నట్లు లెక్కలు సమర్పించారు. వీటిని మినహాయించి ఫిబ్రవరి కోటాను సప్లయ్ చేస్తున్నారు.
దొడ్డు బియ్యానికి అలా...సన్న బియ్యానికి ఇలా...
ఎస్సీ సంక్షేమ హాస్టల్స్‌లో 122 ఉన్నాయి. దీంట్లో డిసెంబర్ లెక్కల ప్రకారం 10,427 మంది విద్యార్థులు హాస్టల్స్‌లో నమోదైనట్లు రికార్డులో పేర్కొన్నారు. ఈ మొత్తం విద్యార్థులకు 1020 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేశారు. హాస్టల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు 15 కేజీల బియ్యాన్ని వండిపెట్టాలి. ఈ లెక్కన 1.2 లక్షల కిలోల బియ్యాన్ని ఒక్కో విద్యార్థికి 15 కేజీల చొప్పున వండిపెట్టినట్లయితే 6,800 మంది విద్యార్థులకు సరిపోయింది. ఇక సన్న బియ్యం అమల్లోకి వచ్చిన జనవరిలో 10,232 మంది విద్యార్థులకు 1534 క్వింటాళ్లు సరఫరా చేశారు. ఈ లెక్క ప్రకారం చూసినట్లయితే 1.54 లక్షల కిలోల బియ్యాన్ని 10,226 మంది విద్యార్థులకు వండిపెట్టినట్లు తెలుస్తోంది. అంటే డిసెంబర్‌తో పోలిస్తే ఎస్సీ హాస్టల్స్ లో విద్యార్థులు 3,426 మంది పెరిగినట్లు దీనిని బట్టి అర్థమవుతోంది. ఒక్క నెల వ్యవధిలోనే 3 వేల మంది విద్యార్థులు పెరిగడమంటే అతిశయోక్తికాదు. బీసీ సంక్షేమ హాస్టల్స్ 68 ఉన్నాయి.
దీంట్లో మంజూరైన విద్యార్థులు మొత్తం 6,864 మంది ఉన్నారు. ఈ విద్యార్థులకు డిసెంబర్లో 911 క్వింటాళ్ల బియ్యం కావాల్సి ఉండగా..828 క్వింటాళ్లు సరఫరా చేశారు. 432 క్వింటాళ్లు వాడుకోగా ఇంకా 396 క్వింటాళ్లు మిగిలాయి. ఈ లెక్క ప్రకారం చూసినట్లయితే 43,200 కిలోల బియ్యాన్ని ఒక్కో విద్యార్థికి 15 కేజీల చొప్పున వండిపెట్టి నట్లయితే 2,880 విద్యార్థులకు సరిపోయింది. ఇక జనవరిలో సన్న బియ్యం 927 క్వింటాళ్లుకుగాను 928 క్వింటాళ్లు సరఫరా చేశారు. దీంట్లో 592 క్వింటాళ్లు వాడుకున్నారు. జనవరి నెలాఖరు నాటికి 336 క్వింటాళ్లు హాస్టళ్లలో నిల్వ ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం 59,200 కిలోల బియ్యాన్ని ఒక్కో విద్యార్థికి 15 కేజీల చొప్పున వండిపెట్టినట్లయితే 3946 మంది విద్యార్థులకు సరిపోతుంది. దీనిని బట్టి పరిశీలిస్తే.. మొత్తం హాస్టల్స్‌కు మంజూరైన 6,864 మంది విద్యార్థులనుంచి 3,946 మందిని తీసివేస్తే 2,918 మంది విద్యార్థులు జనవరిలో తగ్గారు. అదే దొడ్డు బియ్యం సరఫరా చేసిన డిసెంబర్ లెక్కలతో పోలిస్తే మాత్రం జనవరిలో 1,066 మంది విద్యార్థులు పెరిగారు. ఎస్టీ హాస్టల్స్ విషయానికొస్తే 4 వేల మంది విద్యార్థులు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. విద్యార్థుల రోజువారీ హాజరు ప్రకారం బియ్యం పంపిణీ చేస్తే తప్ప సన్నబియ్యం అక్రమాలకు అడ్డుకట్టవేయలేని పరిస్థితి ఉంది.