అంపైర్లను తప్పు పట్టవద్దు
ధోనితో విభేదించిన లయోన్
మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో అంపైర్లు బాగానే పని చేస్తున్నారని, అనవసరంగా వారిపై విమర్శలు చేయవద్దని ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో భారత కెప్టెన్ ధోని చేసిన వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నానని అతను చెప్పాడు. ‘అంపైర్లు చాలా కఠినమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొన్ని నిర్ణయాలు అటు భారత్‌కు, ఇటు ఆసీస్‌కు కూడా వ్యతిరేకంగా వచ్చాయి. అలా అని అంపైర్లను తప్పు పట్టవద్దు. వారు సమర్థంగా పని చేస్తున్నారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇరు జట్లు కూడా ఇలాంటి అంశాల విషయంలో తమ భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి’ అని లయోన్ సూచించాడు. డీఆర్ఎస్ అమల్లో ఉన్నా దానికి కూడా రెండు వైపులా పదును ఉందని, ఏ జట్టుకైనా అది అనుకూలంగా మారే అవకాశం ఉండేదని గుర్తు చేశాడు.