అతి పెద్ద మార్కెట్‌గా భారత్: ఉదయ్ కొటక్
డావోస్: రాబోయే కాలంలో ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద మార్కెట్‌గా అవతరించనుందని ప్రముఖ బ్యాంకరు ఉదయ్ కొటక్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్ ఆర్ధిక వ్యవస్థ మెరుగ్గా ఉందని తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రపంచీకరణతో ఇండియాకు అధిక లబ్ధి చేకూరతోందని, ఇప్పటికే సాఫ్ట్వేర్ విప్లవం నేపథ్యంలో దేశంలోకి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. అంతేకాక 300 బిలియన్ డాలర్ల పోర్ట్‌ఫోలియో పెట్టుబడులుగా వచ్చాయన్నారు.
అనిశ్చిత అంతర్జాతీయ పరిస్థితుల మధ్య భారత్‌ను వెలుగురేఖగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారని తెలిపారు. ‘అమెరికా వృద్ధిని పెంచేందుకు డొనాల్డ్ ట్రంప్ చర్యలు తీసుకుంటారన్న నేపధ్యంలో భారత్‌కు కూడా భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. తక్కువ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు అదుపులో వుండటం వంటి అంశాలతో భారత్ భారీ పెట్టుబడుల్ని ఆకర్షించగలుగుతుంది. విదేశీ ఇన్వెస్టర్లకు జనాభా పరంగా భారత్ అనువైన దేశంగా మారింది ’’అని వివరించారు.