India Company
-
ఐటీ కంపెనీలపై వీసా ఫీజుల మోత
హెచ్1బీ, ఎల్1 వీసాలపై రూ. 3 లక్షల ప్రత్యేక ఫీజు విధించిన అమెరికా పదేళ్ల పాటు అమలు! * భారత కంపెనీలపై ఏటా రూ. 10 వేల కోట్ల భారం వాషింగ్టన్: అమెరికాకు ఉద్యోగులను తీసుకెళ్లే భారత ఐటీ సంస్థలే లక్ష్యంగా ఆ దేశం హెచ్1బీ, ఎల్1 వీసాలపై స్పెషల్ ఫీజును భారీగా పెంచింది. హెచ్1బీ వీసాపై సుమారు రూ. 2.6 లక్షలు(4,000 డాలర్లు), ఎల్1 వీసాపై దాదాపు రూ. 3.2 లక్షలు(4,500 వేల డాలర్లు) ప్రత్యేక ఫీజు విధిస్తూ అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. పదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ ఫీజు.. 50 మందికిపైగా ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో సగం మందికిపైగా హెచ్1బీ, ఎల్1 వీసాలు ఉన్న ఉద్యోగులు ఉంటే వర్తిస్తుంది. ఈ లెక్కన అమెరికాలోని భారత ఐటీ కంపెనీలన్నీ ఈ నిబంధన కిందకు వస్తాయి. 2010 నుంచి 2015 వరకు ఒక్కో వీసాపై వసూలు చేసిన ఈ ప్రత్యేక ఫీజు దాదాపు రూ. 1.3 లక్షలే కావడం గమనార్హం. నాస్కామ్ అంచనా ప్రకారం భారత ఐటీ కంపెనీలు ఇప్పటివరకు అమెరికాకు ఏటా సుమారు రూ. 5వేల కోట్లు చెల్లిస్తున్నాయి. తాజా పెంపుతో ఏటా రూ. 10 వేల కోట్లకు పైగా కట్టాల్సిరావచ్చు. -
భారత్ కంపెనీలతో సంబంధాల పటిష్టతకు యూబీఆర్‌డీ అసక్తి
న్యూఢిల్లీ: భారత్ కంపెనీలతో కలిసి పనిచేయడానికి బహుళజాతి రుణ సంస్థ యూరోపియన్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (యూబీఆర్‌డీ) ఆసక్తి కనబరిచింది. భారత్ కంపెనీల్లో పెట్టుబడులకు తాము సిద్ధమని, అయితే ఆయా కంపెనీలు తప్పనిసరిగా తమ దేశాల్లో విస్తరణ కార్యకలాపాలు చేపట్టాలన్న అభిప్రాయాన్ని యూబీఆర్‌డీ మేనేజింగ్ డెరైక్టర్ రికార్డో పులిట్టి వ్యక్తం చేశారు. అసోచామ్ సో మవారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మేనేజింగ్ డెరైక్టర్ పాల్గొన్నారు. టాటా పవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రేయి ఇన్ఫ్రా ఫైనాన్స్‌సహా ఇప్పటికే దాదాపు 10 కంపెనీలతో యూబీఆర్‌డీ ఇప్పటికే ‘విదేశాల్లో పెట్టుబడులు, విస్తరణకు’ సంబంధించి సంబంధాలను కలిగి ఉందని, మరిన్ని కంపెనీలతో ఇలాంటి భాగస్వామ్యాన్ని కలిగి ఉండడానికి సిద్ధమని అన్నారు. -
డీఅండ్‌బీ టాప్500లో 16 హైదరాబాదీ కంపెనీలు.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్(డీఅండ్‌బీ) విడుదల చేసిన టాప్ 500 భారతీయ కంపెనీల్లో 16 హైదరాబాద్ కంపెనీలకు చోటు లభించింది. ఆదాయం, లాభాలు, నెట్‌వర్త్ వంటి అనేక ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకొని టాప్ -500 కంపెనీలను ఎంపిక చేసినట్లు డీఅండ్‌బీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందులో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రాబ్యాంక్, ఎన్ఎండీసీ, డాక్టర్ రెడ్డీస్, సైయంట్, కోరమాండల్ ఇంటర్నేషనల్, అరబిందో ఫార్మా, అమర్ రాజా బ్యాటరీస్, బీఎస్, గాయత్రీ, హెచ్‌బీఎల్, హెరిటేజ్, మధుకాన్, ఎన్సీసీ, ప్రిజిం సిమెంట్, రాంకీ ఇన్ఫ్రా, స్టీల్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 500 కంపెనీలు దేశ జీడీపీలో 20 శాతం వాటాను కలిగి ఉండగా, ఎగుమతుల్లో 30 శాతం, ఉద్యోగాల కల్పనలో 10 శాతం వాటాను కలిగి ఉన్నట్లు డీఅండ్‌బీ సీఈవో (ఇండియా) కుషాల్ సంపత్ తెలిపారు.2014 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో ఈ కంపెనీల ఆదాయాలు 8 శాతం వృద్ధిని నమోదు చేయగా, లాభాలు 7.5 శాతం నుంచి 7 శాతానికి తగ్గినట్లు డీఅండ్‌బీ పేర్కొంది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ఏడాది ఆదాయం, లాభాల్లో మరింత వృద్ధిని అంచనా వేస్తోంది. అలాగే దేశ జీడీపీ 5.5 శాతం ఉంటుందని డీఅండ్‌బీ లెక్కకట్టింది.