డీఅండ్‌బీ టాప్500లో 16 హైదరాబాదీ కంపెనీలు.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్(డీఅండ్‌బీ) విడుదల చేసిన టాప్ 500 భారతీయ కంపెనీల్లో 16 హైదరాబాద్ కంపెనీలకు చోటు లభించింది. ఆదాయం, లాభాలు, నెట్‌వర్త్ వంటి అనేక ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకొని టాప్ -500 కంపెనీలను ఎంపిక చేసినట్లు డీఅండ్‌బీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందులో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రాబ్యాంక్, ఎన్‌ఎండీసీ, డాక్టర్ రెడ్డీస్, సైయంట్, కోరమాండల్ ఇంటర్నేషనల్, అరబిందో ఫార్మా, అమర్ రాజా బ్యాటరీస్, బీఎస్, గాయత్రీ, హెచ్‌బీఎల్, హెరిటేజ్, మధుకాన్, ఎన్‌సీసీ, ప్రిజిం సిమెంట్, రాంకీ ఇన్‌ఫ్రా, స్టీల్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 500 కంపెనీలు దేశ జీడీపీలో 20 శాతం వాటాను కలిగి ఉండగా, ఎగుమతుల్లో 30 శాతం, ఉద్యోగాల కల్పనలో 10 శాతం వాటాను కలిగి ఉన్నట్లు డీఅండ్‌బీ సీఈవో (ఇండియా) కుషాల్ సంపత్ తెలిపారు.2014 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో ఈ కంపెనీల ఆదాయాలు 8 శాతం వృద్ధిని నమోదు చేయగా, లాభాలు 7.5 శాతం నుంచి 7 శాతానికి తగ్గినట్లు డీఅండ్‌బీ పేర్కొంది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ఏడాది ఆదాయం, లాభాల్లో మరింత వృద్ధిని అంచనా వేస్తోంది. అలాగే దేశ జీడీపీ 5.5 శాతం ఉంటుందని డీఅండ్‌బీ లెక్కకట్టింది.