Dun & Bradstreet
-
క్షీణించిన వ్యాపార విశ్వాసం...
• 31 త్రైమాసికాల కనిష్టానికి చేరిక • డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక న్యూఢిల్లీ: వ్యాపార విశ్వాసం క్షీణించింది. ఇది 2017 జనవరి–మార్చి క్వార్టర్‌కి 31 త్రైమాసికాల కనిష్ట స్థాయికి పడింది. కంపెనీలపై నోట్ల రద్దు అంశం తీవ్ర ప్రభావం చూపింది. నగదు కొరతతో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల వాటి వ్యాపార విశ్వాసం సన్నగిల్లింది. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ కంపొసైట్ బిజినెస్ ఆప్టిమిజమ్ ఇండెక్స్ 2017 తొలి త్రైమాసికంలో 65.4 వద్ద ఉంది. 2016 జన వరి–మార్చి త్రైమాసికంతో పోలిస్తే సూచీలో 23.9 శాతం క్షీణత నమోదయ్యింది. ‘కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల డిమాండ్ పడిపోయింది. అలాగే కంపెనీల ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం పడింది’ అని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ కుశాల్ సంపత్ తెలిపారు. డీమోనిటైజేషన్ వల్ల దీర్ఘకాలంలో పన్ను వసూళ్లు పెరుగుతాయని, నల్లధనం తగ్గుతుందని చెప్పారు. కానీ ప్రస్తుతం నగదు కొరత ఏర్పడటంతో డిమాండ్ తగ్గిందని పేర్కొన్నారు. అలాగే కంపెనీలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, వాటి వ్యాపార విశ్వాసం క్షీణించిందని తెలిపారు. జీఎస్టీ అమలుపై నెలకొని ఉన్న సందిగ్ధత కూడా వ్యాపార విశ్వాసాన్ని ప్రభావితం చేస్తోందని చెప్పారు. ‘ఆర్థిక వ్యవస్థలోని నగదు కొరత వల్ల పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు సామర్థ్యం తగ్గింది. దీని ప్రభావం 2017 తొలి త్రైమాసికంలో కంపెనీల నికర అమ్మకాలపై కనిపిస్తుంది. దీంతో వాటి వ్యాపార విశ్వాసం సన్నగిల్లింది’ అన్నారు. కార్పొరేట్ ఆదాయాలకు దెబ్బ: క్రిసిల్ మూడు వరుస త్రైమాసికాల వృద్ధి తర్వాత మోదీ సర్కారు తీసుకున్న కఠిన నిర్ణయం ఫలితంగా కార్పొరేట్ ఆదాయాలు... గతేడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో క్షీణ బాట పట్టనున్నాయి. 4 శాతం తగ్గుతాయని క్రిసిల్ అంచనా ప్రకటించింది. -
ఎస్బీఐకి ఐదు అవార్డులు
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ తాజాగా డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ‘ఇండియా టాప్ బ్యాంక్స్ అండ్ బ్యాకింగ్ అవార్డ్స్-2016’ పదవ ఎడిషన్‌లో ఐదు అవార్డులను పొందింది. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఎనిమిది కేటగిరిలకు గానూ ఐదింటిలో ఈ అవార్డులను కైవసం చేసుకుంది. రిటైల్ బ్యాంకింగ్, రూరల్ రీచ్, గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్, టెక్నాలజీ అడాప్షన్, ఓవరాల్ బెస్ట్ బ్యాంక్ అనేవి ఐదు కేటగిరిలు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఎస్బీఐ కీలకపాత్ర పోషిస్తోందనే అంశాన్ని ఈ అవార్డులు ప్రతిబింబిస్తున్నాయని ఎస్బీఐ తెలిపింది. -
పీఎఫ్సీ, ఎన్టీపీసీలకు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ కార్పొరేట్ అవార్డు
ప్రముఖ ఆర్థిక విశ్లేషణా సంస్థ డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్(డీఅండ్‌బీ) ప్రతిష్టాత్మక కార్పొరేట్ అవార్డులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)లు అందుకున్నాయి. గురువారం రాత్రి న్యూఢిల్లీలో డీఅండ్‌బీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ ‘ఇండియా టాప్ పీఎస్‌యూ అవార్డు-2015’ను పీఎఫ్సీ తరఫున ఫైనాన్స్ డెరైక్టర్ ఆర్ నాగరాజన్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డీ రవి సంయుక్తంగా అందుకున్నారు. ఐడీబీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ రాజేందర్ మోహన్ మల్లా అవార్డును ప్రదానం చేశారు. అలాగే ఎన్టీపీసీకి లభించిన ఇండియా టాప్ పీఎస్‌యూ-2015 అవార్డును ఐడీబీఐ ఆర్ఎం మల్లా, డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియూ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.గంగూలీ చేతుల మీదుగా ఎన్టీపీసీ డెరైక్టర్(ఆపరేషన్స్) కేకే.శర్మ అవార్డును అందుకున్నారు. -
డీఅండ్‌బీ టాప్500లో 21 తెలుగు కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ విడుదల చేసిన ‘ఇండియా టాప్ 500 కంపెనీస్- 2015’ నివేదికలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 21 కంపెనీలకు చోటు లభించింది. ఇందులో ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ 24వ స్థానం సంపాదించగా, డాక్టర్ రెడ్డీస్ (31), దివీస్ ల్యాబ్ (67), అపోలో హాస్పిటల్స్ (79), అమరరాజ బ్యాటరీస్ (129) టాప్-500 జాబితాలో ఉన్నాయి. ఇక మిగతా కంపెనీల విషయానికి వస్తే బిఎస్ లిమిటెడ్(209), సెయైంట్ (222), ఎన్సీసీ (259), ఆంధ్రాబ్యాంక్ (302), అరబిందో ఫార్మా (305), హెరిటేజ్ ఫుడ్స్ (316), హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ (391). స్టీల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (394), నవభారత్ వెం చర్స్ (404), అవంతి ఫీడ్స్ (417), రాంకీ ఇన్ఫ్రా (445), సంఘి ఇండస్ట్రీస్ (448), కావేరీ సీడ్స్ (480), గ్రాన్యూల్స్ (483), శ్రీకాళహస్తి పైప్స్ (485), ఎక్సల్ క్రాప్ కేర్ (493) ఉన్నాయి. 2014లో ఈ రెండు రాష్ట్రాల నుంచి 16 కంపెనీలకు మాత్రమే స్థానం లభించింది. ఈ టాప్ 500 కంపెనీల ఆదాయం జీడీపీలో 20 శాతానికి సమానమని, పన్నుల ఆదాయంలో మూడో వంతు ఈ కంపెనీల నుంచే వస్తున్నట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
డీఅండ్‌బీ టాప్500లో 16 హైదరాబాదీ కంపెనీలు.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్(డీఅండ్‌బీ) విడుదల చేసిన టాప్ 500 భారతీయ కంపెనీల్లో 16 హైదరాబాద్ కంపెనీలకు చోటు లభించింది. ఆదాయం, లాభాలు, నెట్‌వర్త్ వంటి అనేక ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకొని టాప్ -500 కంపెనీలను ఎంపిక చేసినట్లు డీఅండ్‌బీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందులో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రాబ్యాంక్, ఎన్ఎండీసీ, డాక్టర్ రెడ్డీస్, సైయంట్, కోరమాండల్ ఇంటర్నేషనల్, అరబిందో ఫార్మా, అమర్ రాజా బ్యాటరీస్, బీఎస్, గాయత్రీ, హెచ్‌బీఎల్, హెరిటేజ్, మధుకాన్, ఎన్సీసీ, ప్రిజిం సిమెంట్, రాంకీ ఇన్ఫ్రా, స్టీల్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 500 కంపెనీలు దేశ జీడీపీలో 20 శాతం వాటాను కలిగి ఉండగా, ఎగుమతుల్లో 30 శాతం, ఉద్యోగాల కల్పనలో 10 శాతం వాటాను కలిగి ఉన్నట్లు డీఅండ్‌బీ సీఈవో (ఇండియా) కుషాల్ సంపత్ తెలిపారు.2014 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో ఈ కంపెనీల ఆదాయాలు 8 శాతం వృద్ధిని నమోదు చేయగా, లాభాలు 7.5 శాతం నుంచి 7 శాతానికి తగ్గినట్లు డీఅండ్‌బీ పేర్కొంది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ఏడాది ఆదాయం, లాభాల్లో మరింత వృద్ధిని అంచనా వేస్తోంది. అలాగే దేశ జీడీపీ 5.5 శాతం ఉంటుందని డీఅండ్‌బీ లెక్కకట్టింది.