ఇన్ఫీ ఫలితాలు భేష్, షేర్ బేర్
ముంబై: ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వరుస లాభాలతో దూసుకుపోతోంది. ఇన్ఫీ రెండో త్రైమాసికంలో మార్కెట్ అంచనాలకు మించి ఆర్థిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో 7.5 శాతం వృద్ధిని సాధించి తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకుంది. రూ. 3,398 కోట్ల నికరలాభాన్ని ఆర్జించి తన హవా కొనసాగించింది. రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఆదాయం మొత్తం రూ.29,989 కోట్లుగా నమోదైంది. గత జూన్, 2015తో ముగిసిన మొదటి త్రైమాసిక లాభాలతో పోలిస్తే ఇంకా మెరుగ్గా కనిపించింది.
కాగా సాప్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో, (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బన్సాల్ తన పదవికి రాజీనామా చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన స్థానంలో ఎండీ రంగనాథ్ సీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టనున్నారు. మూడేళ్లపాటు సంస్థకు సేవలందించిన ఆయన సోమవారం రాజీనామా చేయనున్నారని ఆయన స్థానంలో ఎండీ రంగనాథ్ కొనసాగుతారని తెలిపింది. దీంతో మార్కెట్లో ఈ షేరు ఫలితాలకు భిన్నంగా స్పందిస్తోంది. నష్టాల్లో ట్రేడవుతోంది. అటు షేరుకు 10 రూపాయల చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వనున్నట్టు ఇన్ఫీ ప్రకటించింది.
రెండు మూడేళ్ల కిత్రం వరకు దేశీయ ఐటీ రంగంలో దిగ్గజంగా వెలుగొందిన ఇన్ఫోసిస్ పలు పరిణామాల కారణంగా ఓ దశలో ప్రత్యర్ధుల తాకిడికి నిలబడలేని పరిస్థితికి చేరింది. టీసీఎస్, హెచ్‌సీఎల్ లాంటి సంస్థల ధాటికి ఎదురొడ్డి నిలబడ్డంలో తడబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏడాది క్రితం విశాల్ సిక్కా సీఈఓగా రంగంలోకి వచ్చారు. 2020 నాటికి 2000 కోట్ల డాలర్ల రెవెన్యూ సాధిస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. సిక్కా సీఈఓ అయినప్పటి నుంచి ఆయన నాయకత్వంలో మంచి టీమ్ ఏర్పడిందని. కంపెనీని ఆయన సరైన దిశలో నడిపించాని ఎనలిస్టులు వ్యాఖ్యానించారు. అంచనాలకు అనుగుణంగానే గత కొంతకాలంగా నష్టాలను చవిచూస్తున్న సంస్థ గత రెండు త్రైమాసికాల్లో భారీ లాభాలను ఆర్జించింది. అయితే సీఎఫ్ఓ రాజీనామాతో ఎనలిస్టులు కూడా పెదవి విరుస్తున్నారు.