ఇన్ఫోసిస్‌.. ప్చ్‌! | Infosys Q3 Results 2024 | Sakshi
Sakshi News home page

Infosys Q3 Results: ఇన్ఫోసిస్‌.. ప్చ్‌!

Published Fri, Jan 12 2024 7:56 AM | Last Updated on Fri, Jan 12 2024 8:17 AM

Infosys Q3 Results 2024 - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ.. ఇన్ఫోసిస్‌ నిరుత్సాహకరమైన ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (2023–24, క్యూ3)లో కంపెనీ రూ. 6,106 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో లాభం రూ.6,586 కోట్లతో పోలిస్తే 7.3% తగ్గింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 1.3% పెరుగుదలతో రూ. 38,821 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో ఆదాయం రూ. 38,318 కోట్లుగా నమోదైంది. క్లయింట్ల నుండి డిమాండ్‌ మందగించడం ఫలితాలపై ప్రభావం చూపింది.

గైడెన్స్‌ కట్‌..
2023–24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫోసిన్‌ ఆదాయ వృద్ధి అంచనాలను (గైడెన్స్‌) కుదించింది. 1.5–2 శాతానికి తగ్గించింది. గత ఫలితాల సందర్భంగా ఆదాయ వృద్ధిని 1–2.5 శాతంగా అంచనా వేసింది.

‘ఇన్‌సెమీ’ కొనుగోలు..
బెంగళూరుకు చెందిన సెమీకండక్టర్‌ డిజైన్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ ఇన్‌సెమీ కొనుగోలు ప్రతిపాదనకు ఇన్ఫోసిస్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.280 కోట్లకు దీన్ని దక్కించుకోనుంది. 2024 మార్చిలోపు ఈ కొనుగోలు పూర్తయ్యే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది.

మూడో త్రైమాసికంలో మా పనితీరు నిలకడగానే ఉంది. బడా డీల్స్‌ దన్నుతో 3.2 బిలియన్‌ డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకున్నాం. జెనరేటివ్‌ ఏఐ, డిజిటల్, క్లౌడ్‌ తదితర విభాగాల్లో మా పోర్ట్‌ఫోలియో పటిష్టతకు ఇది నిదర్శనం. స్థూల ఆర్థిక పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. ఫైనాన్షియల్‌ సర్వీసులు, టెల్కోలు, హైటెక్‌ రంగాల్లో ప్రభావం కొనసాగవచ్చని భావిస్తున్నాం. - సలీల్‌ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ

ఇతర ముఖ్యాంశాలు..

  • క్యూ3లో ఇన్ఫీ 3.2 బిలియన్‌ డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకుంది. ఇందులో నికరంగా 71% కొత్త డీల్స్‌ ఉన్నాయి.
  • డిసెంబర్‌ 31 నాటికి కంపెనీలో 3,22,663 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. క్యూ2తో పోలిస్తే (3,28,764) నికరంగా 6,101 మంది (1.8 శాతం) సిబ్బంది తగ్గారు. క్రితం ఏడాది డిసెంబర్‌ క్వార్టర్‌ నాటికి ఉన్న 3,46,845 మందితో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 7% తగ్గింది. క్యూ3లో ఉద్యోగుల వలసల (అట్రిషన్‌) రేటు 12.9%గా ఉంది. కాగా, ఉద్యోగుల వినియోగాన్ని నిశితంగా పరిశీలిస్తామని సీఎఫ్‌ఓ నీలాంజన్‌ రాయ్‌ చెప్పారు. క్యాంపస్‌ హైరింగ్‌ అనేది క్లయింట్ల డిమాండ్‌పై ఆధారపడి ఉంటుందని, ప్రస్తుతానికి దీని అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.
  • రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ. 18 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. 

ఫలితాల నేపథ్యంలో షేరు ధర 1.62% నష్టంతో రూ.1,495 వద్ద ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement