ఐటీ కంపెనీలపై వీసా ఫీజుల మోత
హెచ్1బీ, ఎల్1 వీసాలపై రూ. 3 లక్షల ప్రత్యేక ఫీజు విధించిన అమెరికా
పదేళ్ల పాటు అమలు!
* భారత కంపెనీలపై ఏటా రూ. 10 వేల కోట్ల భారం
వాషింగ్టన్: అమెరికాకు ఉద్యోగులను తీసుకెళ్లే భారత ఐటీ సంస్థలే లక్ష్యంగా ఆ దేశం హెచ్1బీ, ఎల్1 వీసాలపై స్పెషల్ ఫీజును భారీగా పెంచింది. హెచ్1బీ వీసాపై సుమారు రూ. 2.6 లక్షలు(4,000 డాలర్లు), ఎల్1 వీసాపై దాదాపు రూ. 3.2 లక్షలు(4,500 వేల డాలర్లు) ప్రత్యేక ఫీజు విధిస్తూ అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
పదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ ఫీజు.. 50 మందికిపైగా ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో సగం మందికిపైగా హెచ్1బీ, ఎల్1 వీసాలు ఉన్న ఉద్యోగులు ఉంటే వర్తిస్తుంది. ఈ లెక్కన అమెరికాలోని భారత ఐటీ కంపెనీలన్నీ ఈ నిబంధన కిందకు వస్తాయి. 2010 నుంచి 2015 వరకు ఒక్కో వీసాపై వసూలు చేసిన ఈ ప్రత్యేక ఫీజు దాదాపు రూ. 1.3 లక్షలే కావడం గమనార్హం.
నాస్కామ్ అంచనా ప్రకారం భారత ఐటీ కంపెనీలు ఇప్పటివరకు అమెరికాకు ఏటా సుమారు రూ. 5వేల కోట్లు చెల్లిస్తున్నాయి. తాజా పెంపుతో ఏటా రూ. 10 వేల కోట్లకు పైగా కట్టాల్సిరావచ్చు.