సోనమ్ అదుర్స్ కంగన కితాబు
న్యూఢిల్లీ: కంగనా రనౌత్, సోనమ్ కపూర్‌కు పొసగడం లేదని గుసగుసలు వినిపిస్తుండడం తెలిసిందే. కంగన మాత్రం సోనమ్‌ను ఆకాశానికి ఎత్తేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లలో అందరికంటే సోనమ్ దుస్తులు చాలా బాగుంటాయని కితాబిచ్చింది. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో సోనమ్ మాట్లాడుతూ అందంగా లేని వాళ్లకు కూడా మంచి నటులని పేరు వస్తోందని చెప్పింది. కంగన తాజా సినిమాలు రివాల్వర్ రాణి, క్వీన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు అందని చాలా మంది అనుకున్నారు.
కంగన మాత్రం ఇలాంటివేవీ పట్టించుకోకుండా బాగా కనిపించేవాళ్లలో సోనమ్ ఒకరని మెచ్చుకుంది. ‘ఈమధ్య హీరోయిన్లంతా మంచి దుస్తుల్లో కనిపిస్తున్నారు. జాక్వెలిన్ చాలా చక్కని దుస్తులు ఎంచుకుంటుంది. సోనమ్ కూడా అంతే. దీపికా పదుకొనే వస్త్రాల ఎంపిక కూడా అత్యద్భుతంగా ఉంటుంది’ అని వివరించింది. ఢిల్లీలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఇండియా కోషర్ వీక్ ఫ్యాషన్ షోలో డిజైనర్ అంజూ మోడీ వస్త్రాల్లో కంగన మెరిసింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పైమాటలు చెప్పింది. సంజయ్ లీలా భన్సాలీ తీస్తున్న బాజీరావు మస్తానీ కంగన తదుపరి సినిమా.