భారత్ వృద్ధి అంచనాలకు ఐఎంఎఫ్ భారీ కోత
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి 2013లో కేవలం 3.75 శాతమేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనా వేసింది. క్రితం అంచనాలు (ఏప్రిల్లో) 5.7 శాతం నుంచీ ఐఎంఎఫ్ ఈ మేరకు కుదించింది. బలహీన డిమాండ్, తయారీ, సేవల రంగాల పేలవ పనితీరు అంచనాల కోతకు కారణమని తన తాజా వరల్డ్ ఎకనమిక్ అవుట్ లుక్ నివేదికలో సంస్థ మంగళవారం పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి కఠిన ద్రవ్య విధానం అనుసరించాల్సి రావాల్సిన దేశాల్లో భారత్ ఒకటని ఐఎంఎఫ్ విశ్లేషించింది. ఈ పరిస్థితి వల్ల డిమాండ్ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది.
వచ్చే ఏడాది 5 శాతం
కాగా వచ్చే ఏడాది అంటే 2014లో వృద్ధిరేటు అంచనాను సైతం ఇంతక్రితం 6.2 శాతం నుంచి 5 శాతానికి కుదించింది. సరఫరాల సమస్య కొంత కుదుటపడ్డం, ఎగుమతులు మెరుగుపడ్డం వల్ల 2013కన్నా 2014లో వృద్ధి కొంత మెరుగుపడవచ్చని (3.75 శాతం నుంచి 5 శాతానికి) వివరించింది. ఇక్కడ జరుగుతున్న ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల నేపథ్యంలో ఈ నివేదిక విడుదలయ్యింది.