మోదీతో మాటామంతికి అబే వస్తున్నారు
టోక్యో : జపాన్ ప్రధాని షింజో అబే గుజరాత్లో అడుగుపెట్టనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో ఆయన ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో చర్చలు చేయనున్నారు. ఈ వారంలోనే ఇరు నేతల మధ్య సమావేశం ఉండనున్నట్లు భారత విదేశాంగ వ్యవహారాల శాఖ సోమవారం ప్రకటించింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వివరించింది. బుధవారం నుంచి రెండు రోజులపాటు అబే పర్యటన ఉంటుందని తెలిపింది. ఇండియా - జపాన్ 12వ వార్షిక సదస్సు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటుచేస్తున్నారు.
ఉత్తర కొరియా వరుస అణు పరీక్షలు నిర్వహిస్తూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్న నేపథ్యంలో అవుతున్న ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది. మరోపక్క, దక్షిణ చైనా సముద్రంపై కూడా చైనా చేస్తున్న రాజకీయాలు జపాన్‌కు కొంత ఇబ్బందిని కలిగిస్తున్న నేపథ్యంలో కూడా ఈ భేటీ ఆసక్తిని రేపుతోంది. వ్యక్తిగతంగా చూస్తే ప్రధాని మోదీకి, అబేకు మధ్య భేటీ జరగడం ఇది నాలుగో సారి. ప్రస్తుతం భారత్, జపాన్ మధ్య వృద్ధి చెందిన సంబంధాలు, వ్యూహాత్మక సంబంధాలు, అంతర్జాతీయ వేదికపై ఉన్న భాగస్వామ్యం, భవిష్యత్‌లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే తదితర విషయాలను పరిశీలించనున్నారు.