టీమిండియా కెప్టెన్ గా సురేష్ రైనా
ముంబై: టీమిండియా బ్యాట్స్మన్ సురేష్ రైనాకు ఊహించని అవకాశం దక్కింది. జాతీయ జట్టుకు నాయకత్వం వహించే ఛాన్స్ దక్కింది. అసలు జట్టులోనే అతడికి స్థానం దక్కకపోవచ్చని అందరూ భావించారు. అనుకోని విధంగా అవకాశం రావడంతో అతడిప్పుడు జట్టు నాయకుడయ్యాడు.
బంగ్లాదేశ్ తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ లో టీమిండియాకు రైనా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. సెలక్షన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విశ్రాంతి కోరుకోవడంతో రైనాకు కెప్టెన్ ఛాన్స్ దక్కింది. అశ్విన్, రవీంద్ర జడేజా కూడా విశ్రాంతి తీసుకోనున్నారు.
బంగ్లా సిరీస్ కు 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించింది. ఐపీఎల్-7లో టాప్ స్కోరర్ గా నిలిచిన రాబిన్ ఊతప్పతో పాటు మనోజ్ తివారి, వృద్ధిమాన్ సాహా, కేదార్ జాదవ్, పర్వేజ్ రసూల్ లను జట్టులోకి తీసుకున్నారు.