పాక్‌కు అమెరికా ఫైటర్ జెట్లు.. భారత్ తీవ్ర ఆగ్రహం
ఎవరు ఎంత వద్దని చెప్పినా.. పాకిస్థాన్‌కు 8 ఎఫ్-16 బ్లాక్ -52 విమానాలను అమ్మాలని ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. వీటి విలువ దాదాపు రూ. 4770 కోట్లు. అమెరికా విదేశాంగ శాఖ ఈ అమ్మకానికి ఆమోదం తెలిపిందని పెంటగాన్ డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ తెలిపింది. ఉగ్రవాదంపై పోరాడేందుకు, చొరబాట్లను ఎదుర్కొనేందుకు ఈ యుద్ధ విమానాలను పాకిస్థాన్‌కు ఇవ్వడం సమంజసమేనని అమెరికా అంటోంది.
కానీ అమెరికా చర్యను భారత్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై తన నిరసనను తెలియజేసేందుకు భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మను పిలిపించింది. ఉదయం 9.30 గంటల సమయంలో రిచర్డ్ వర్మ ఢిల్లీ సౌత్ బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. 26/11 దాడుల్లో పాకిస్థాన్ హస్తం ఉందన్న విషయం డేవిడ్ హెడ్లీ విచారణలో స్పష్టంగా తేలుతున్నా, అమెరికా నుంచే హెడ్లీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతున్నా కూడా ఇప్పుడు పాకిస్థాన్‌కు అమెరికా యుద్ధ విమానాలు అమ్మడాన్ని భారత్ తీవ్రంగా నిరసిస్తోంది. దీనివల్ల భారత ఉపఖండంలో ఆయుధపోటీకి మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తోంది.