'మణిశంకర్ కు మతి తప్పింది'
గువాహటి: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ దేశాన్ని అగౌరవపరిచారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. పాకిస్థాన్ టీవీ చానల్ తో మాట్లాడినప్పుడు ఆయన మానసిక సమతుల్యం కోల్పోయారని ధ్వజమెత్తారు. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభమయితే ప్రధాని నరేంద్ర మోదీని తప్పించాల్సిన అవసరముందని పాక్ టీవీ చానల్ తో అయ్యర్ అన్నారు.
అయ్యర్ చేసిన వ్యాఖ్యలు మోదీనే కాకుండా యావత్ జాతిని అవమానించేలా ఉన్నాయని జవదేకర్ విమర్శించారు. మంగళవారం గువాహటిలో విలేకరులతో మాట్లాడుతూ... చర్చల పునరుద్ధరణపై ముందడుగు వేయాల్సింది పాకిస్థానేనని అన్నారు. ఇతర దేశాలతో సత్సంబంధాల కోసం మోదీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
పారిస్ లో ఐఎస్ఎస్ ఉగ్రవాదులు జరిపిన దాడిని సమర్థిస్తూ యూపీ మంత్రి ఆజంఖాన్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలను సమాజ్ వాది పార్టీ ఖండించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలపై తమకు సంబంధం లేదని చేతులు దులుపుకుందని తెలిపారు.