India-Pakistan border
-
అంగుళం భూమి కూడా వదులుకోం
భుజ్: దేశ సరిహద్దుల్లో మన భూభాగంలో ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. మన భూభాగాన్ని కాపాడుకొనే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు. దేశాన్ని కాపాడే విషయంలో సైనిక దళాల శక్తిసామర్థ్యాలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. భారత సైనిక దళాలను చూస్తే శత్రువులకు వణుకు తప్పదని అన్నారు. దుష్ట శక్తుల ఆటలు సాగవని హెచ్చరించారు. గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలో భారత్–పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని సర్ క్రీక్‌లో ప్రధాని మోదీ గురువారం బీఎస్ఎఫ్తోపాటు త్రివిధ దళాల సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన ప్రతిఏటా సైనికులతోపాటు దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. సర్ క్రీక్‌లో వేడుకల సందర్భంగా జవాన్లను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఈ ప్రాంతాన్ని యుద్ధక్షేత్రంగా మార్చడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయని చెప్పారు. శత్రు దేశం ఈ ప్రాంతంపై చాలా ఏళ్లుగా కన్నేసిందని, ఆక్రమించుకొనేందుకు కుట్రలు చేస్తోందని పరోక్షంగా పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ‘ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్’ ఏర్పాటు చేస్తాం ‘‘దౌత్యం పేరుతో సర్ క్రీక్‌ను ఆక్రమించడానికి గతంలో కుట్రలు జరిగాయి. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నేను శత్రుదేశం కుట్రలపై గొంతు విప్పాను. దేశాన్ని రక్షించే విషయంలో మన సైనిక దళాల సామర్థ్యంపై ప్రభుత్వానికి విశ్వాసం ఉంది. మన దేశాన్ని శత్రువుగా భావించేవారి మాటలు మేము నమ్మడం లేదు. సైన్యం, నావికాదళం, వైమానిక దళం వేర్వేరు విభాగాలు. కానీ, ఆ మూడు దళాలు ఒక్కటైతే దేశ సైనిక బలం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఇందుకోసమే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనే పదవిని సృష్టించాం. త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం కోసం ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ఏర్పాటు చేయబోతున్నాం’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. -
59th Raising Day : పాక్, బంగ్లా సరిహద్దుల్లో పటిష్ట భద్రత
హజారీబాగ్: భారత్–పాకిస్తాన్, భారత్–బంగ్లాదేశ సరిహద్దుల్లో అత్యంత పటిష్టమైన భద్రత కల్పించబోతున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో సరిహద్దులను దుర్భేద్యంగా మార్చబోతున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో అసంపూర్తిగా ఉన్న 60 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. శుక్రవారం జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) 59వ రైజింగ్ డే వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. జవాన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిదేళ్లలో భారత్–పాకిస్తాన్, భారత్–బంగ్లాదేశ సరిహద్దుల్లో 560 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన కంచెలో అక్కడక్కడా ఖాళీలు ఉండేవని, ఆ ఖాళీల గుండా చొరబాటుదారులు, స్మగ్లర్లు సులభంగా మన దేశంలోకి ప్రవేశించేవారని గుర్తుచేశారు. ఆ ఖాళీల్లోనూ కంచె నిర్మాణం పూర్తయ్యిందని, తూర్పు, పశి్చమ సరిహద్దుల్లో మరో 60 కిలోమీటర్లే కంచె ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. -
దొంగదెబ్బ కొడుతున్న చైనా
న్యూఢిల్లీ : పాకిస్తాన్-చైనా మధ్య ఆర్థిక, సైనిక సంబంధాలు రోజురోజుకూ బలోపేతమవుతున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా డ్రాగన్ కంట్రీ పాక్‌కు అన్ని రకాల సహకారాలు అందిస్తోంది. తాజాగా పొరుగుదేశానికి అవసరమైన సైనిక సౌకర్యాలను కల్పిస్తోంది. అందులో భాగంగా సైనికులకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కమ్యూనిస్ట్ కంట్రీ అందిస్తోంది. కశ్మీర్ నుంచి గుజరాత్ వరకూ ఉన్న సరిహద్దు వెంబడి.. పాకిస్తాన్ సైనికుల కోసం చైనా అత్యాధునిక బంకర్లను నిర్మిస్తోంది. కీలకమైన రాజస్తాన్ సరిహద్దు వద్ద ఎయిర్ బేస్‌ను ఆధునీకరించడంతో పాటు, 350 స్టోన్ బంకర్లను డ్రాగన్ దేశం నిర్మించింది. అంతేకాక బోర్డర్ అవుట్ పోస్ట్‌లను కలుపుతూ.. రోడ్నెర్క్ను సైతం అభివృద్ధి చేస్తోంది. ఒక వేళ యుద్ధం సంభవిస్తే.. సైన్యానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా సరిహద్దు వెంబడి బంకర్స్‌తో పాటు కెనాల్స్‌కు చైనా ఏర్పాటు చేస్తోంది. భారత్ సరిహద్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖైరాపూర్ ఎయిర్‌బేస్‌లో కొన్ని నెలలుగా చైనా సైన్యం తిష్ట వేసింది. ఈ ఎయిర్బేస్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చైనా అభివృద్ధి చేస్తోంది. ఇదిలావుండగా.. పాక్‌కు అవసరమైన సహజవాయువు, ముడిచమురు, ఖనిజ వనరులను చైనానే అందిస్తోంది. -
ఒక పాట.. ఒక హత్య
న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో ఇరు వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 200 ముస్లిం కుటుంబాలు గ్రామాన్ని వదలి వలస వెళ్లినట్లు పోలీసులు బుధవారం ప్రకటించారు. నెల రోజుల కిందట జానపద గాయకుడిని ఒక అర్చకుడు, అతని మిత్రులు హత్య చేయడంతో అక్కడ ఉద్రిక్తతలు ఏర్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చెబుతున్నవివరాలివి. రాజస్థాన్‌లోని జైసల్మీర్ జిల్లా, ఫోఖ్రాన్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది దంతాల్ గ్రామం. ఈ పల్లెటూరు భారత్-పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉండడం గమనార్హం. హిందూ దేవీదేవతల స్త్రోత్రాలు, మంత్రాలు, శ్లోకాలకు గాయకుడు అహ్మద్ ఖాన్ (45) రాగయుక్తంగా పాడేవాడు కాదు. ఇలా పాడడం తప్పని ఆలయ పండితుడు రమేష్ సుథార్ పలుసార్లు ఆతనికి వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అర్చకుడు రమేష్ సుథార్, అతని మిత్రులు కలిసి అహ్మద్‌ఖాన్‌పై సెప్టెంబర్27 దాడి చేశారు. ఈ దాడిలో అహ్మద్ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన తరువాత గ్రామంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడినట్లు సీనియన్ పోలీస్ అధికారి గౌరవ్ యాదవ్ చెప్పారు. ప్రస్తుతం ఈ కేసును ఆయనే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అర్చకుడు రమేష్ సుథార్‌ను అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. రమేష్ కుటుంబ సభ్యులు సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతిలో ఉన్నారని.. ఈ కేసు గురించి మాట్లాడేందుకు వారు ఇష్టపడడం లేదని గౌరవ్ అన్నారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇక్కడకు పారామిలటరీ బలగాలను తెప్పించామన్నారు. ఇదిలావుండగా.. తమ సోదరుడు చేసిన చిన్న పొరపాటుకు దారుణంగా హత్య చేశారని అహ్మద్‌ఖాన్ సోదరి రఖాఖాన్ చెప్పారు. ఇకపై ఈ గ్రామంలో జీవించలేమని.. అందుకే ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నామని ఆమె ఆవేదనగా చెప్పారు. -
నలుగురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
మేజర్‌సహా నలుగురు సైనికులు మృతి శ్రీనగర్: కశ్మీర్లో మంగళవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు, నలుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. అమరులైన ఆర్మీ సిబ్బందిలో ఒక మేజర్ కూడా ఉన్నారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో సైనికులు బందిపొరా జిల్లాలోని హజిన్ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని సైనికులు తమ అధీనంలోకి తీసుకుంటుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. సైనికులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 10 మంది సైనికులు గాయపడగా చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. ఇక్కడే ఒక ఉగ్రవాది కూడా హతమయ్యాడు. మరో ఎన్ కౌంటర్ కుప్వారా జిల్లాలోని క్రల్గండ్ ప్రాంతంలో జరిగింది. ఒక ఇంటిలో దాగి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడి మేజర్ ఎస్ దహియా మరణించారు. సరిహద్దులో సొరంగం జమ్మూ: భారత్–పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు తవ్వుకున్న సొరంగాన్ని సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) సిబ్బంది గుర్తించారు. జమ్మూ కశ్మీర్‌లోని సాంబా జిల్లా సరిహద్దులో ఉగ్రవాదులు ఈ సొరంగం తవ్వారు. కంచె నుంచి సొరంగం భారత భూభాగంలో 20 మీటర్ల వరకూ విస్తరించి ఉందని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. -
పాక్‌తో యుద్ధం తప్పదేమో..!
టీపీసీసీ చీఫ్, మాజీ సైనికాధికారి ఉత్తమ్ * ఒకవేళ అనివార్యమైతే పాక్ ఉండదు * సరిహద్దు పరిణామాలపై ‘సాక్షి’తో అభిప్రాయాలు సాక్షి, హైదరాబాద్: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులనుబట్టి చూస్తే ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు, మాజీ సైనికాధికారి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఏడు ఉగ్రవాద శిబిరాలపై సైన్యం మెరుపుదాడి (సర్జికల్ స్ట్రైక్) చేపట్టిన నేపథ్యంలో సరిహద్దులోని తాజా పరిణామాలపై ఆయన శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. పాక్‌తో సరిహద్దు వెంబడి 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను సైన్యం ఖాళీ చేయించడం, కశ్మీర్‌లోని పాఠశాలలను మూసివేయించడం, యుద్ధ విమానాలు, బలగాలను మోహరించడం వంటి వాటినిబట్టి చూస్తే యుద్ధం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో భారత్ అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ఉత్తమ్ అభిప్రాయాలు, సూచనలు ఆయన మాటల్లోనే.... ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలి పాకిస్తాన్లో అపరిపక్వ నాయకత్వం, కొరవడిన ప్రజాస్వామిక స్ఫూర్తి, జీహాదీ మనస్తత్వంబట్టి ఆ దేశం ఎలా స్పందిస్తుందో ఊహించలేం. మేం నష్టపోయినా సరే భారత్‌కు నష్టం చేయాలనే ప్రతీకార ధోరణితోనే పాక్ ఉండే అవకాశం ఎక్కువ. అందుకని యుద్ధం జరిగే అవకాశాలే ఎక్కువ. దీనికి కొన్ని నెలలు పడుతుంది. 1971లో పాక్‌తో యుద్ధానికి ముందు మొదటి సంకేతం వెలువడిన ఏడాది తర్వాత ఆ దేశంతో పూర్తిస్థాయి యుద్ధం జరిగింది. అందుకని ఒకవైపు సైనిక చర్యలకు దిగుతూనే అంతర్జాతీయంగా అన్ని దేశాలను కూడగట్టుకుని పాక్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలి. ముందుగా సింధు జలాల ఒప్పందాన్ని కేంద్రం రద్దు చేసుకోవాలి. అత్యంత అనుకూల దేశం (ఎంఎఫ్ఎన్)గా పాకిస్తాన్‌కు మనం ఇచ్చిన హోదాతో వ్యాపార, వాణిజ్యాల్లో ఆ దేశం ఎక్కువగా లాభపడుతోంది. ఈ హోదాను రద్దు చేసి పాక్‌ను శత్రు దేశంగానే చూడాలి. అమెరికాతో ఏర్పడిన సత్సంబంధాలను ఉపయోగించుకుని పాక్‌కు అగ్రరాజ్యం నిధులను అడ్డుకోవాలి. పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించేలా అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తేవాలి. అలాగే ఆ దేశ అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార సంబంధాలపై ఒత్తిడి కలిగించాలి. యుద్ధం అనివార్యమైతే.... పాకిస్తాన్ ప్రధాన మంత్రి సైన్యం చేతిలో కీలుబొమ్మ. అణ్వాయుధాల వినియోగంపై అంతర్జాతీయ స్థాయిలో నిషేధ ఒప్పందాలున్నా యి. దీంతోపాటు అణ్వాయుధాలు కలిగి ఉన్న రెండు దేశాల మధ్య ఇప్పటిదాకా యుద్ధాలు జరగలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సైనిక, వైమానిక, నౌకా దళాలు రెండు దేశాలకు ఉన్నాయి. యుద్ధం జరిగితే 1971లో బంగ్లాదేశ్ ఏర్పడినట్టుగానే ఇప్పుడు పాకిస్తాన్లో బలూచిస్తాన్ కూడా ఏర్పాటుకావడం తప్పదు. యుద్ధం వల్ల భారత్‌కు కొంత నష్టం జరిగినా పాకిస్తాన్‌కు ఉనికి కూడా ఉండదు. నేనూ యుద్ధానికి వెళ్తా... సర్జికల్ స్ట్రైక్‌ను సైనిక దళాలు సమర్థంగా నిర్వహించాయి. సైనికుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని ఎంత పొగిడినా తక్కువే. సరిహద్దులో సైనికాధికారిగా రెండు దశాబ్దాలపాటు వివిధ బాధ్యతలను నిర్వహించిన చాలా తక్కువ మంది అధికారుల్లో నేనూ ఒకడిని. నేను రిజర్వులో ఉన్నా. యుద్ధం వస్తే నన్నూ పిలుస్తారు. దేశం కోసం పనిచేసే భాగ్యం వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది..? తప్పకుండా యుద్ధంలో పాల్గొంటా. -
సరిహద్దుల్లో మళ్లీ పాక్ కాల్పులు
దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ దుందుడుకు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని దాయాది దేశం ఉల్లంఘిస్తూనే ఉంది. మూడు రోజుల క్రితం కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్ దళాలు మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డాయి. మూడు రోజుల క్రితం పూంఛ్ సెక్టార్లో మోర్టార్లు, చిన్న తరహా ఆయుధాలతో కాల్పులకు దిగిన పాక్ దళాలు తాజాగా మంగళవారం రాజౌరీ జిల్లాలోని బీమ్ బేర్ లోని గాలీ ప్రాంతంలో కవ్వింపు చర్యలకు దిగాయి. భారత సైనికులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు దిగడంతో అప్రమత్తమైన భారత బలగాలు పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. సరిహద్దులో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.