నలుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్
మేజర్‌సహా నలుగురు సైనికులు మృతి
శ్రీనగర్: కశ్మీర్‌లో మంగళవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు, నలుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. అమరులైన ఆర్మీ సిబ్బందిలో ఒక మేజర్ కూడా ఉన్నారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో సైనికులు బందిపొరా జిల్లాలోని హజిన్ ప్రాంతానికి చేరుకున్నారు.
ఆ ప్రాంతాన్ని సైనికులు తమ అధీనంలోకి తీసుకుంటుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. సైనికులు ఎదురు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 10 మంది సైనికులు గాయపడగా చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. ఇక్కడే ఒక ఉగ్రవాది కూడా హతమయ్యాడు. మరో ఎన్ కౌంటర్ కుప్వారా జిల్లాలోని క్రల్‌గండ్ ప్రాంతంలో జరిగింది. ఒక ఇంటిలో దాగి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడి మేజర్ ఎస్ దహియా మరణించారు.
సరిహద్దులో సొరంగం
జమ్మూ: భారత్–పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు తవ్వుకున్న సొరంగాన్ని సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) సిబ్బంది గుర్తించారు. జమ్మూ కశ్మీర్‌లోని సాంబా జిల్లా సరిహద్దులో ఉగ్రవాదులు ఈ సొరంగం తవ్వారు. కంచె నుంచి సొరంగం భారత భూభాగంలో 20 మీటర్ల వరకూ విస్తరించి ఉందని బీఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు.