పాక్‌తో యుద్ధం తప్పదేమో..! | The same could happen to the war, I'm | Sakshi
Sakshi News home page

పాక్‌తో యుద్ధం తప్పదేమో..!

Published Sat, Oct 1 2016 1:15 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

పాక్‌తో యుద్ధం తప్పదేమో..! - Sakshi

పాక్‌తో యుద్ధం తప్పదేమో..!

టీపీసీసీ చీఫ్, మాజీ సైనికాధికారి ఉత్తమ్
* ఒకవేళ అనివార్యమైతే పాక్ ఉండదు
* సరిహద్దు పరిణామాలపై ‘సాక్షి’తో అభిప్రాయాలు

సాక్షి, హైదరాబాద్: భారత్-పాకిస్తాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులనుబట్టి చూస్తే ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు, మాజీ సైనికాధికారి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఏడు ఉగ్రవాద శిబిరాలపై సైన్యం మెరుపుదాడి (సర్జికల్ స్ట్రైక్) చేపట్టిన నేపథ్యంలో సరిహద్దులోని తాజా పరిణామాలపై ఆయన శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.

పాక్‌తో సరిహద్దు వెంబడి 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను సైన్యం ఖాళీ చేయించడం, కశ్మీర్‌లోని పాఠశాలలను మూసివేయించడం, యుద్ధ విమానాలు, బలగాలను మోహరించడం వంటి వాటినిబట్టి చూస్తే యుద్ధం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో భారత్ అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ఉత్తమ్ అభిప్రాయాలు, సూచనలు ఆయన మాటల్లోనే....
 
ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలి
పాకిస్తాన్‌లో అపరిపక్వ నాయకత్వం, కొరవడిన ప్రజాస్వామిక స్ఫూర్తి, జీహాదీ మనస్తత్వంబట్టి ఆ దేశం ఎలా స్పందిస్తుందో ఊహించలేం. మేం నష్టపోయినా సరే భారత్‌కు నష్టం చేయాలనే ప్రతీకార ధోరణితోనే పాక్ ఉండే అవకాశం ఎక్కువ. అందుకని యుద్ధం జరిగే అవకాశాలే ఎక్కువ. దీనికి కొన్ని నెలలు పడుతుంది. 1971లో పాక్‌తో యుద్ధానికి ముందు మొదటి సంకేతం వెలువడిన ఏడాది తర్వాత ఆ దేశంతో పూర్తిస్థాయి యుద్ధం జరిగింది.

అందుకని ఒకవైపు సైనిక చర్యలకు దిగుతూనే అంతర్జాతీయంగా అన్ని దేశాలను కూడగట్టుకుని పాక్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలి. ముందుగా సింధు జలాల ఒప్పందాన్ని కేంద్రం రద్దు చేసుకోవాలి. అత్యంత అనుకూల దేశం (ఎంఎఫ్‌ఎన్)గా పాకిస్తాన్‌కు మనం ఇచ్చిన హోదాతో వ్యాపార, వాణిజ్యాల్లో ఆ దేశం ఎక్కువగా లాభపడుతోంది. ఈ హోదాను రద్దు చేసి పాక్‌ను శత్రు దేశంగానే చూడాలి. అమెరికాతో ఏర్పడిన సత్సంబంధాలను ఉపయోగించుకుని పాక్‌కు అగ్రరాజ్యం నిధులను అడ్డుకోవాలి. పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించేలా అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తేవాలి. అలాగే ఆ దేశ అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార సంబంధాలపై ఒత్తిడి కలిగించాలి.
 
యుద్ధం అనివార్యమైతే....

పాకిస్తాన్ ప్రధాన మంత్రి సైన్యం చేతిలో కీలుబొమ్మ. అణ్వాయుధాల వినియోగంపై అంతర్జాతీయ స్థాయిలో నిషేధ ఒప్పందాలున్నా యి. దీంతోపాటు అణ్వాయుధాలు కలిగి ఉన్న రెండు దేశాల మధ్య ఇప్పటిదాకా యుద్ధాలు జరగలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సైనిక, వైమానిక, నౌకా దళాలు రెండు దేశాలకు ఉన్నాయి. యుద్ధం జరిగితే 1971లో బంగ్లాదేశ్ ఏర్పడినట్టుగానే ఇప్పుడు పాకిస్తాన్‌లో బలూచిస్తాన్ కూడా ఏర్పాటుకావడం తప్పదు. యుద్ధం వల్ల భారత్‌కు కొంత నష్టం జరిగినా పాకిస్తాన్‌కు ఉనికి కూడా ఉండదు.
 
నేనూ యుద్ధానికి వెళ్తా...
సర్జికల్ స్ట్రైక్‌ను సైనిక దళాలు సమర్థంగా నిర్వహించాయి. సైనికుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని ఎంత పొగిడినా తక్కువే. సరిహద్దులో సైనికాధికారిగా రెండు దశాబ్దాలపాటు వివిధ బాధ్యతలను నిర్వహించిన చాలా తక్కువ మంది అధికారుల్లో నేనూ ఒకడిని. నేను రిజర్వులో ఉన్నా. యుద్ధం వస్తే నన్నూ పిలుస్తారు. దేశం కోసం పనిచేసే భాగ్యం వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది..? తప్పకుండా యుద్ధంలో పాల్గొంటా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement